ఎత్తిపోతల పనులు నత్తనడకన
ABN , Publish Date - May 13 , 2026 | 12:06 AM
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనతతో బుగ్గమాదారం వద్ద చేపట్టిన రాజీవ్‌గాంధీ ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభమై ఏడాది గడుస్తున్నా పనుల్లో వేగం అందు కోవడం లేదు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనతతో బుగ్గమాదారం వద్ద చేపట్టిన రాజీవ్‌గాంధీ ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభమై ఏడాది గడుస్తున్నా పనుల్లో వేగం అందు కోవడం లేదు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని ముక్త్యాల బ్రాంచ కెనాల్ చివరన ఉన్న ముక్తేశ్వరాపురం, గణపవరం, మేజర్ కాల్వల ఆయకట్టు సాగునీటి ఎద్దడిని తీర్చడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. అయితే అనుకున్న మేర పనులు ముందుకు సాగడం లేదు.
- (ఆంధ్రజ్యోతి-చింతలపాలెం)
రాజీవ్‌గాంధీ ఎత్తిపోతల పథకాన్ని సుమారు రూ.394 కోట్ల అంచనా వ్యయంతో 21 కిలోమీటర్ల పైప్‌లైన నిర్మాణంతో రూపొందించారు. ప్రాజెక్టు పూర్తయితే చింతలపాలెం మండలం దొండపాడు, మేళ్లచెర్వు మండలంలోని రామాపురం, కందిబండ, కోదాడ మండలం రామలక్ష్మీపురం, ఎర్రారం, బీక్యాతండా, తొగర్రాయి, గణపవరం, కూచిపూడి, హుజూర్‌నగర్ మండలం హుజూర్‌నగర్, వేపలమాదారం, చిలుకూరు మండలం పాలఅన్నారం గ్రామాల్లోని సుమారు 14,100 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ పథకం కోసం నాలుగు మండలాల్లోని రైతులు తమకు చెందిన సుమారు 35 ఎకరాల వ్యవసాయ భూములను కోల్పోయారు. భూమి కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు నష్టపరిహారం చెల్లించారు. తమ భూములు పోయినా, ప్రాజెక్టు పూర్తయితే సాగు నీరు వస్తుందనే ఆశతో రైతాంగం ఎదురుచూస్తోంది.
కాంట్రాక్టు సంస్థ తీవ్ర నిర్లక్ష్యం
ఎత్తిపోతల పథకం నిర్మాణ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న కేఎల్‌ఎ్‌సఆర్ సంస్థ పనుల్లో తీవ్రనిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. ప్రాజెక్టు అత్యంత కీలకమైన పంప్‌హౌస్ నిర్మాణం ఇప్పటికి పూర్తికాలేదు. మొత్తం 35 మీట్ల లోతులో పంప్‌హౌస్ నిర్మించాల్సి ఉండగా, ఏడాది కాలంలో కేవలం 29మీటర్లు మాత్రమే పూర్తి చేశారు. ఇక 21 కిలోమీటర్ల పైపులైన పనులకు కేవలం ఆరు కిలోమీటర్ల మాత్రమే పూర్తయింది. ఇంకా 15 కిలోమీటర్ల మేర పైప్‌లైన కాల్వ పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. పంప్‌హౌస్ నుంచి కృష్ణానది వరకు 1,200 మీటర్ల అప్రోచ కెనాల్‌కు భూసేకరణ జరిగినా ఆ ప్రాంతంలో ఉన్న భూములు ఎండోమెంట భూములు కావటంతో వాటికి నష్టపరిహారం అందించకపోవడంతో అప్రోచ కెనాల్ 450 మీటర్లు మాత్రమే పూర్తయ్యింది. ఆ భూములకు నష్టపరిహారం చెల్లిస్తేనే పనులు సహకరిస్తామంటూ రైతులుఙ పనులు నిలిపివేశారు. వీటికి తోడు ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత లేన నిర్మాణ పనులను కనీసం ప్రారంభించకపోవడం కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
మంత్రి హెచ్చరించినా కదలని యంత్రాంగం
ఎత్తిపోతల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు నీరు అందించలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులు..కాంట్రాక్టర్లతో పలుమార్లు క్షేత్రస్థాయిలో సమావేశం ఏర్పాటుచేసి హెచ్చరించారు. అయినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంత్రి ఆదేశాలను సైతం పట్టించుకోకుండా పనుల పురోగతిని పర్యవేక్షించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వర్షాకాలం వస్తే అంతే సంగతులు
ప్రస్తుతం ఎండాకాలం కావడంతో పనులు వేగంగా చేయడానికి అనుకూల వాతావరణం ఉంది. అయినప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వీడటం లేదు. మరికొన్ని రోజుల్లో వర్షాకాలం సీజన ప్రారంభం కానుంది. ఒక్కసారి వర్షాలు పడితే రైతులు మళ్లీ పంటలు వేయడం మొదలుపెడతారు. కృష్ణానదిలో వరద వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే పనులు నిలిచిపోతాయని ఈ ఏడాది కూడా తమకు సాగునీరు అందడం కష్టమేనని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాంట్రాక్ట్ సంస్థపై ఒత్తిడి తెచ్చి పనులను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
గతేడాది వర్షాలతో పనులు నిలిచాయి
గతేడాది వర్షాలు భారీగా పడటంతో పంప్‌హౌస్ పనులు నాలుగు నెలలు నిలిచాయి. పైప్‌లైన కాల్వ పనులు చేయడానికి యంత్రాలు వెళ్లేందుకు రైతులు అప్పటికే పొలాల్లో పంటలు వే యడంతో అడ్డంకిగా మారింది. ఇప్పుడు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. - శ్రీనివాస్, ఇరిగేషన ఏఈ
పైప్‌లైన పనుల్లో తీవ్ర జాప్యం
జూనలో వర్షాలు ప్రారంభమైతే కాల్వ వెళ్లే దారి పొడువునా రైతులు పంటలు సాగు చేస్తారు. పంట నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో రైతులు పొలాల్లోకి యంత్రాలను రానివ్వరు.ఫలితంగా ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో ఏడాది అదనపు సమయం ప డుతుంది. పనులు విభజించి వేర్వేరు బృందాలతో ఒకేసారి పూర్తి చేయాలి. -శ్రీనివా్‌సరెడ్డి, ఉపసర్పంచ, దొండపాడు