సైకిల్ షెడ్డులోనే పాఠాలు
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:13 AM
ప్రభుత్వ బడుల ఆధునికీకరణలో భాగంగా డిజిటల్ తరగతులు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోంది.
(ఆంధ్రజ్యోతి- చండూరు)
ప్రభుత్వ బడుల ఆధునికీకరణలో భాగంగా డిజిటల్ తరగతులు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోంది. కానీ నల్లగొండ జిల్లా చండూరులో పేరుకే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల.. చండూరు పట్టణం నడిబొడ్డున ఉన్నా కానీ సొంత భవనం లే క సైకిల్ షెడ్డులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులతో 112 మంది విద్యార్థులు, ఐదు తరగతి గదుల్లో విద్యనభ్యసిస్తున్నారు. కానీ ప ాఠశాల అభివృద్ధ్దిలో ఆమడ దూరంలో ఉండడంతో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్ధులకు విద్య అందని ద్రాక్షలా మారింది.
ఆకతాయిల ఆగం..
ఎంతోమంది విద్యాబుద్దులు నేర్చుకునే విద్యాలయం రాత్రి సమయాల్లో ఆకతాయిలకు అడ్డాగా మారుతోంది. కొందరు దుండగులు రాత్రి సమయంలో పాఠశాల ప్రాంగణంలోకి చొరబడి పేకాట ఆడడంతో పాటు అక్కడే మద్యం తాగుతున్నారు. సుమారు 15 ఎకరాలకు పైగా ఉన్న పాఠశాల చు ట్టూ ప్రహరీ ఉంది. అయితే అందులోకి వెళ్లేందుకు వీలుగా ఎక్కడో ఒకచోట ప్రహరీ కూల్చి వేస్తున్నారు. అలా గతంలో అనేకమార్లు కూల్చి వేస్తే వెంటనే తిరిగి నిర్మాణం చేశారు. తాజాగా ఇటీవలే మళ్లీ గోడను కూల్చి వేసి తరగతి గదుల్లోకి దూరేందుకు కిటకీల ఇనుప చువ్వలను వంచారు. తరగతి గదిలో ఉన్న ఫ్యాన ధ్వంసం చేశారు. రాత్రి వేళలో వాచమన లేకపోవడంతో ఆకతాయిలు తమ కార్యక్రమాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. సంబంధిత అధికారులు, పోలీసులు స్పందించి ప్రత్యేక దృష్టిసారించి పాఠశాలలో కొనసాగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.
పరిశీలనకే పరిమితం
2024 సెప్టెంబరు 3న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అప్పటి జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, నారాయణరెడ్డి, అప్పటి అదనపు కలెక్టర్ పూర్ణచందర్, అప్పటి ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జిల్లా విద్యాశాఖ అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పాఠశాల పరిస్థితిని నేరుగా పరిశీలించారు. ప్రస్తుత అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సైతం 2025జూన 12న పాఠశాలను తనిఖీ చేశారు. వారి దృష్టికి పాఠశాలలో ఉన్న సమస్యలన్నీ ప్రధానోపాధ్యాయుడు యా దగిరి పరిస్థితి వివరించారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా, మండల ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. అయినప్పటికీ విద్యార్ధులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అధికారులు కల్పించలేకపోయారని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రాథమిక పాఠశాలకు కొత్త భవనం మంజూరు చేయాలని ఉ పాధ్యాయులు, విద్యార్ధుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
మన ఊరు-మన బడికి ఎంపికైనా ..
చండూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గతంలో మన ఊరు-మనబడికి ఎంపికైంది. కానీ స్థల సమస్య వేధిస్తోంది. గతంలో గ్రామ శివారులో పాఠశాల ఉండేది. ఈ పాఠశాల భవనాన్ని 2008లో అధికారులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేటాయించారు. అయితే సరిపడా భవనాలు ఎక్కడా లేకపోవడంతో అక్కడి నుంచి పట్టణంలో ప్రధాన కూడలిలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థుల సైకిల్ స్టాండ్ కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్డుకు మార్చారు. సరిపడా తరగతులు లేకపోవడంతో విద్యార్ధులు చెట్లకిందనే పాఠాలు వినాల్సి వస్తుంది. కొద్దిపాటి వర్షం కురిసినా మొత్తం తడిగా, ఎండాకాలంలో ఉక్కపోతతో విద్యార్థులు గదుల్లో కూర్చోలేని పరిస్థితి. కనీసం అటెండర్ పోస్టు కూడా లేకపోవడంతో పనులన్నీ ఉపాఽధ్యాయులపై భారం పడుతోంది.
అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
ప్రభుత్వం నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రజాప్రతినిధులు పాఠశాలను తనిఖీ చేసినప్పుడల్లా సమస్యలను వారికి ఏకరువు పెట్టాం. సరిపడా గదులు లేకపోవడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాతల సహకారంతో కొంత సౌకర్యాలు సమకూర్చాం. వర్షం వస్తే షెడ్డులోకి నీటి జల్లులు వస్తాయి. రేకుల షెడ్డు కావడంతో ఎండకాలంలో ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నాం.
- పిల్లి యాదగిరి, హెచఎం ప్రాథమిక పాఠశాల, చండూరు