Land acquisition : భూ సేకరణ పనులు ముమ్మరం
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:32 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేస్తున్న వ్యవసా య కళాశాల భవనాల నిర్మాణానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి క్షేత్రస్థాయిలో శరవేగంగా పనులు నిర్వహిస్తున్నారు.
రైతుల ఖాతాల్లో రూ.24.50కోట్ల నగదు జమ
హుజూర్‌నగర్‌లో వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన చేయనున్న గవర్నర్
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేస్తున్న వ్యవసా య కళాశాల భవనాల నిర్మాణానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి క్షేత్రస్థాయిలో శరవేగంగా పనులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా భూసేకరణకు ప్రభుత్వం పరిహారాన్ని మంజూరుచేసింది. వ్యవసాయ కళాశాలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఈ నెల 20న శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి కలెక్టర్ తేజ్‌సనందలాల్ పవార్ నేతృత్వంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రంలో మూడు వ్యవసాయ కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేయగా, అందులో హుజూర్‌నగర్‌లో ఒకటి నిర్మించనున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభ్యర్థన మేరకు సీఎం రేవంత్‌రెడ్డి మార్చి 30న ఉగాది సందర్భంగా సన్నబియ్యం పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై హుజూర్‌నగర్ కు వ్యవసాయ కళాశాలను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తరువాత కొద్ది నెలల వ్యవధిలోనే పనులు ప్రా రంభించడం విశేషం. హుజూర్‌నగర్ విద్యా చరిత్రలో మరో కీలక వ్యవసాయ కళాశాల రానుండటంతో ఈ ప్రాంత రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరనుందని ఆశిస్తున్నారు.
భూసేకరణ పరిహారం మంజూరు
హుజూర్‌నగర్ పట్టణ పరిధిలోని మగ్దుంనగర్‌లో నిర్మించనున్న వ్యవసాయ కళాశాలకు సంబంధించి భూసేకరణ పూర్తి కాగా, ప్రభుత్వ భూమిని సాగుచేసుకుంటున్న సుమారు 130 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం వారి ఖాతాల్లో రూ.24.50కోట్ల నగదు జమచేసింది. రైతుల నుంచి సేకరించిన 100 ఎకరాలకు సంబంధించిన నిధులు జమచేయడంతో శంకుస్థాపనకు అధికారులు సర్వం సన్నద్ధం చేశారు. ఎకరానికి సుమారు రూ.24లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించింది. మరో 130 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా, ఈ ప్రక్రియ కూడా త్వరలో పూర్తికానుంది. మగ్దుంనగర్ ప్రాంతంలో సర్వే నెం.1041లో 100 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ కళాశాల భవనాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే 230 ఎకరాలకు పైగా భూసేకరణ చేశారు. గత ఏడాది అక్టోబరు 22న 140 జీవో ద్వారా కళాశాల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి నెలరోజుల క్రితం సర్వే పూర్తిచేసి నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా, వ్యవసాయ కళాశాల భవనాలను నిర్మించనుండటంతో ఇక్కడ రైతులకు అవసరమైన ఇతర మౌలిక వసతులు కూడా కల్పించనున్నారు.
ఇప్పటికే తరగతులు ప్రారంభం...
పట్టణంలోని శ్రీనివాస థియేటర్ సమీపంలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాల భవనంలో ఈ ఏడాది మార్చి నుంచి వ్యవసాయ కళాశాలకు సంబంధించిన తరగతులు నిర్వహించనున్నారు. గత ఏడాది డిసెంబరు మొదటి వారం నుంచి హైదరాబాద్‌లోని వ్యవసాయ యూనివర్సిటీలో హుజూర్‌నగర్‌కు మంజూరు చేసిన వ్యవసాయ కళాశాల విద్యార్థులకు బోధన చేస్తున్నారు. మొదటి సెమ్ అనంతరం రెండో సెమిస్టర్ అంటే మార్చి నాటికి పట్టణంలోని అద్దె భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. కాగా, నూతన భవనంలో సుమారు 500మంది విద్యార్థులు అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకునేలా ఏర్పాట్లుచేస్తున్నారు. విద్యార్థుల బోధనకు తరగతి గదులు, హాస్టల్ వసతులు, ప్రొఫెసర్లు ఉండేందుకు నివాస గృహాలు, సెమినార్ హాళ్లు కూడా నిర్మించనున్నారు. కాగా, హుజూర్‌నగర్ కళాశాలకు సంబంధించి 40 మంది విద్యార్థులకు మొదటి సంవత్సరం తరగతులు హైదరాబాద్‌లో బోధిస్తున్నారు. రెండో ఏడాది నాటికి పట్టణంలో అద్దె భవనంలో 120 నుంచి 180 మంది విద్యార్థులకు తరగతులు బోధించేలా వసతులు కల్పిస్తున్నారు. ఇదిలా ఉండగా, పట్టణంలోని అద్దె భవనంలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరుచేసింది. రాష్ట్ర ప్రభుత్వం కళాశాలకు సంబంధించి రూ.124కోట్లు మంజూరుచేయగా, త్వరితగతిన పనులు పూర్తిచేసేలా ప్రభుత్వం సంకల్పించింది. 2026 చివరి నాటికి కళాశాల నూతన భవన నిర్మాణాలు కొలిక్కి వచ్చేలా అధికారం యంత్రాంగం దృష్టి సారించింది.
పరిహారం చెల్లింపుతో..
పట్టణానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మగ్దుంనగర్ ప్రాంతంలో కళాశాల నిర్మాణానికి భూసేకరణ పూర్తయింది. సర్వే నెంబర్ 1041లో సుమారు 150 మంది రైతులు సాగు చేసుకుంటున్నారు. వానాకాలం పంట పూర్తి కాగా, ప్రస్తుతం యాసంగి సాగుచేస్తున్నారు. మరో నెలలో యాసంగి పంటల దిగుబడి రానుంది. ఈ పంట అనంతరం రైతులు ప్రభుత్వానికి భూములు అప్పగించనున్నారు. కళాశాలకు భూసేకరణ సందర్భంగా తొలుత రైతులు తటపటాయించినా ఆ తరువాత అంగీకరించారు. ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూమికి పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. కలెక్టర్ తేజ్‌సనందలాల్ పవార్ రైతుల డిమాండ్లను పరిశీలించి ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం చెల్లించి అండగా ఉంటామని స్పష్టం చేయడంతో రైతులు భూములు అప్పగించేందుకు అంగీకరించారు. పరిహారం విషయంలో రైతులు మంత్రి ఉత్తమ్‌ను పలు దఫాలు కలిసి విన్నవించడంతో ప్రభుత్వపరంగా చేయాల్సినవన్నీ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తయింది. అందుకు ప్రభుత్వం రూ.124 కోట్లను మంజూరు చేసింది. రైతుల ఖాతాల్లో రూ.24.5కోట్లు జమచేసింది. దీంతో శంకుస్థాపనకు గవర్నర్ రానున్నారు.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసేందుకే హుజూర్‌నగర్‌కు వ్యవసాయ కళాశాల మంజూరు చేసింది. రైతులకు ఇప్పటికే పరిహారం చెల్లించాం. రైతుల ఖాతాల్లో నిధులు జమచేశాం. గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ వ్యవసాయ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. హుజూర్‌నగర్ ప్రాంతంలో విద్యారంగం అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్న. రైతులకు మరిన్ని సేవలు, కొత్త వరి వంగడాలు అందించేందుకు ఈ కళాశాల ఎంతో ఉపయోగపడుతుంది. రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయి.