Share News

వసూళ్లలో వెనుకబాటే..

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:47 AM

ఆదాయం లేనిది మునిసి పాలిటీల అభివృద్ధి అంతంత మాత్రమే. పురపాలికలకు వచ్చే ఆదాయం అధిక భాగం ఆస్తి పన్ను నుంచే వస్తుంటుంది. అలాంటి ఆస్తి పన్ను వసూలు చేయడంలో జిల్లా మునిసిపాలిటీలు వెనుకబడ్డాయి.

వసూళ్లలో వెనుకబాటే..

ఆస్తి పన్ను వసూళ్లలో వెనుకబడిన జిల్లా మునిసిపాలిటీలు

మిగిలింది 30 రోజులు.. వసూలు కావలసింది రూ.15.79 కోట్లు

ఇప్పటివరకు 44.50 శాతం మాత్రమే వసూలు

గత వసూళ్లపై 12.09 శాతం జీడీపీ సాధిస్తేనే ఆర్థిక సంఘం నిధులు

(ఆంధ్రజ్యోతి-భువనగిరి టౌన్‌): ఆదాయం లేనిది మునిసి పాలిటీల అభివృద్ధి అంతంత మాత్రమే. పురపాలికలకు వచ్చే ఆదాయం అధిక భాగం ఆస్తి పన్ను నుంచే వస్తుంటుంది. అలాంటి ఆస్తి పన్ను వసూలు చేయడంలో జిల్లా మునిసిపాలిటీలు వెనుకబడ్డాయి. ఇప్పటి వరకు 44.50 శాతం మాత్రమే వసూలు చేయడంతో ఆర్థిక సంఘం నిధుల రాక ఆలస్యం కానుంది.

ఆస్తిపన్ను వసూళ్లలో జిల్లా మునిసిపాలిటీలు వెనుకబడుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపునకు 30 రోజులు మాత్రమే గడువు ఉండగా, నేటివరకు కేవలం 44.50 శాతం మాత్రమే ఆస్తిపన్ను వసూలు అయ్యింది. జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్‌, ఆలేరు, యాదగిరిగుట్ట, భూదాన్‌పోచంపల్లి, మోత్కురు పట్టణాల్లో గత బకాయిలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కలిపి 44,456 అసిస్మెంట్ల నుంచి రూ.28.45 కోట్ల ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉండగా, నేటి వరకు కేవలం రూ.12.66 కోట్లు వసూలైంది. ఇంకా రూ.15.79 కోట్లు రావాల్సి ఉంది. గడువులోపు లక్ష్యం మేరకు ఆస్తి పన్ను వసూళ్లలో ఆయా మునిసిపాలిటీల రెవెన్యూ విభాగాలు విఫలమైతే పట్టణాల అభివృద్ధికి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులకు గ్రహణం పట్టే ప్రమాదం ఉంది.

రూ.28.45 కోట్ల ఆస్తిపన్ను డిమాండ్‌

జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో 44,456 అసిస్మెంట్లు ఉన్నాయి. వీటిలో 38,321 గృహాలు, 3,724 వాణిజ్య భవనాలు, 2,408 గృహాలు, దుకాణాలు కలిసి ఉన్నా యి. వీటి నుంచి పాత బకాయిలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కలిపి ఆస్తి పన్ను డి మాండ్‌ రూ.28.45 కోట్లు ఉంది. అయితే నేటివరకు రూ.12.66 కోట్లు, (44.5 శాతం) వసూలు కాగా రూ.15.79 కోట్లు రావాల్సి ఉంది.

ఆర్థిక సంఘం నిధులపై ప్రభావం

ఆస్తి పన్ను వసూళ్లు మందగించడంతో పట్టణాల అభివృద్ధికి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులపై ప్రభావం చూపనుంది. నిబంధనల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో వసూళ్లపై 12.09 జీడీపీ సాధిస్తేనే ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయి. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లా మునిసిపాలిటీలు లక్ష్యంమేరకు ఆస్తి పన్ను వసూలు చేయకపోవడంతో ఆర్థిక సంఘం నిధులను కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భువనగిరి మునిసిపాలిటీల ఆస్తి పన్ను డిమాండ్‌ రూ.9.74 కోట్లుండగా ఇప్పటివరకు కేవలం రూ.3.86కోట్లు వసూలు కాగా, ఇంకా రూ.5.88 కోట్లు రావాల్సి ఉంది. 12.09 జీడీపీతో ఆర్థిక సంఘం నిధులకు అర్హత సాధించాలంటే 30రోజుల్లో రూ.3.1కోట్లు వసూలు కావాల్సి ఉంది. జిల్లాలోని మిగతా మునిసిపాలిటీల పరిస్థితి కూడా సుమారు ఇలాగా ఉన్నట్లు తెలుస్తోంది.

వార్డు అధికారులు ఉన్నా..

జిల్లాలో మునిసిపాలిటీల్లో వార్డు అధికారులు ఉన్నా, ఆస్తి పన్ను వసూళ్లు మెరుగుపడటం లేదని ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లోని 104 వార్డులకు ప్రభుత్వం ఏడాది క్రితం వార్డు అధికారులను నియమించింది. వీరిలో సగానికిపైగా నేరుగా వార్డు అధికారులుగానే ఉద్యోగాలు పొందగా, మిగతా వార్డులకు బిల్‌ కలెక్టర్లు, ఇతర సిబ్బందిని ఇన్‌చార్జీ వార్డు అధికారులుగా నియమించారు. ఆ వార్డుల్లో ఆస్తి పన్ను, నీటి చార్జీలుసహా అన్ని రకాల పన్నులు, మునిసిపల్‌ కార్యాలయ విధులను వార్డులవారీగా పర్యవేక్షించాల్సిన బాధ్యత వీరిధి, పైగా వార్డులలోని వార్డు కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి. కానీ ప్రభుత్వం, మునిసిపల్‌ అధికారులు వీరికి వార్డు విధులకు బదులు ఇతర పనులను అప్పగిస్తుండటంతో ఆస్తి పన్ను వసూలు, తదితర వార్డు విధులపై ప్రభావం చూపుతున్నట్లు సమాచారం.

స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తాం : జి .రామలింగం, కమిషనర్‌, భువనగిరి మునిసిపాలిటీ

ఆస్తి పన్ను వసూళ్లకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తాం. ఆర్థిక సంవత్సరం ముగింపులోపు లక్ష్యం మేరకు పన్నులు వసూలు చేస్తాం. ప్రజలు కూడా సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి. వార్డు అధికారులకు, బిల్‌ కలెక్టర్లు ఆస్తిపన్ను చెల్లించి వెంటనే రశీదు పొందాలి. ఆన్‌లైన్‌లో నేరుగా చెల్లించవచ్చు.

ఆస్తి పన్ను ఇలా...

జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో ఆస్తి పన్ను, వసూళ్లు ఇలా ఉన్నాయి. (రూ.కోట్లలో)

మునిసిపాలిటీ బకాయి ఆస్తిపన్ను 2025-26(సం) మొత్తం వసూలు రావాల్సింది

భువనగిరి రూ.3.77 రూ.5.97 రూ.9.74 రూ.3.86 రూ.5.88

చౌటుప్పల్‌ రూ.2.34 రూ.5.80 రూ.8.14 రూ.4.80 రూ.3.34

యాదగిరిగుట్ట రూ.1.24 రూ.2.52 రూ.3.76 రూ.1.65 రూ.2.11

భూదాన్‌పోచంపల్లి రూ.1.04 రూ.1.91 రూ.2.95 రూ.1.01 రూ.1.94

ఆలేరు రూ.0.89 రూ.1.61 రూ.2.50 రూ.0.74 రూ.1.76

మోత్కూరు రూ.0.32 రూ.1.04 రూ.1.36 రూ.0.60 రూ.0.76

మొత్తం రూ.9.60 రూ.18.85 రూ.28.45 రూ.12.66 రూ.15.79

Updated Date - Mar 02 , 2026 | 12:47 AM