Share News

స్థలాభావం.. అంతా ఆగమాగం

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:06 AM

సూర్యాపేట జిల్లా వ్యవసాయ మార్కెట్‌కు ఈ ఏడాది వానాకాలం సీజన ధాన్యం భారీగా తరలివస్తోంది. ఈ నెల 22న అత్యధికంగా 40వేల బస్తాల ధాన్యం వచ్చింది.

స్థలాభావం.. అంతా ఆగమాగం
నిర్మాణదశలో నిలిచిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌

(ఆంధ్రజ్యోతి-తిరుమలగిరి)

సూర్యాపేట జిల్లా వ్యవసాయ మార్కెట్‌కు ఈ ఏడాది వానాకాలం సీజన ధాన్యం భారీగా తరలివస్తోంది. ఈ నెల 22న అత్యధికంగా 40వేల బస్తాల ధాన్యం వచ్చింది. మార్కెట్‌ అంతా ధాన్యపు రాశులతో నిండి, నడిచే దారి కూడా కరువైంది. దీంతో వ్యాపారులకు తిప్పలు తప్పడం లేదు. అయితే ఇందుకు స్థలాభావమే కారణమంటున్నారు. మొత్తం 9.36ఎకరాల్లో మార్కెట్‌ విస్తరించి ఉం డగా 2023లో అప్పటి ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ మార్కెట కోసం ఎకరం స్థలాన్ని కేటాయించి పనులు ప్రారంభించింది. ప్రస్తుతం ఆ నిర్మాణం పురోగతిలో లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే మందుల సామేల్‌ ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ తొలగించాలని అధికారులను కోరారు.

రెండు షెడ్ల ఏర్పాటుతో

ప్రస్తుతం తిరుమలగిరి మార్కెట్‌లో కాంటాలు అయిన ధాన్యాన్ని ఎగుమతి చేసేందుకు లారీలు మార్కెట్‌లోకి వచ్చేందుకు చోటులేదు. గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌కు కేటాయించిన ఎకరం స్థలం అదనంగా ఉంటే క్రయవిక్రయాలు సులభమవుతాయంటున్నారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ స్థలంతో రెండు షెడ్లు ఏర్పాటు చేస్తే, రైతులకు ధాన్యం పోసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా గత వారం కిందట ఎమ్మెల్యే మందుల సామేల్‌ మార్కెట్‌లో పర్యటించి, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణంతో ఏర్పడుతున్న సమస్యను మార్కెట్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మునిసిపాలిటికి ఇచ్చిన స్థలాన్ని వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకుని, ఆ స్ధలంలో షెడ్డు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలోనే ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణంపై అధికారులు చొరవతీసుకుని, షెడ్లు నిర్మించాలని పలువురు రైతులు, వ్యాపారులు కోరుతున్నారు.

ఇంటిగ్రేటెడ్‌తో స్థలాభావం ఏర్పడుతోంది

మార్కెట్‌లో గత ప్రభుత్వం ఎకరం స్థలంలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మిస్తోంది. దీంతో మార్కెట్‌లో సీజనలో ఎక్కువ ధాన్యం వచ్చినపుడు రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌ నిర్మాణ ప్రదేశంలోనే షెడ్డు నిర్మిస్తే, ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఎల్సోజు చామంతినరేష్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన

ఎగుమతులపై తీవ్ర ప్రభావం

మార్కెట్‌కు ధాన్యం ఎక్కువగా వచ్చినపుడు వ్యాపారులం ఇబ్బందిపడుతున్నాం. వాహనాలు లోపలికి రాలేని పరిస్థితి. కాంటాలు ఆలస్యమవుతున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను తొలగించాలి.

రాపాక సోమేష్‌, వ్యాపారి

అత్యధికంగా ధాన్యం వస్తోంది

మార్కెట్‌కు ఈ సీజనలో రోజూ 10వేల బస్తాలు వస్తున్నాయి. ఇప్పటివరకు 2.50లక్షల బస్తాల ధాన్యం వచ్చింది. మరో 3లక్షల బస్తాలు వస్తాయని భావిస్తున్నాం.

షంషీర్‌, మార్కెట్‌ కార్యదర్శి

Updated Date - Oct 24 , 2026 | 12:06 AM