ఇందిరమ్మ బిల్లుకు ఎల్-3 చిక్కు
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:47 AM
ఇందిరమ్మ ఇల్లు పథకం లబ్ధిదారుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఇల్లు మంజూరైన ఆనందంలో అప్పులు చేసి ఇంటి పనులు ప్రారంభించారు. పనులు చేపట్టాక ఎల్-3లో మీపేరుంది మీకు బిల్లులు రావని చెబుతుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
అప్పులు చేసి ఇంటి పనులు చేపట్టిన లబ్ధిదారులు
క్షేత్రస్థాయిలో సర్వేల తప్పిదాలతో ఇబ్బందులు
ఇందిరమ్మ ఇల్లు పథకం లబ్ధిదారుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఇల్లు మంజూరైన ఆనందంలో అప్పులు చేసి ఇంటి పనులు ప్రారంభించారు. పనులు చేపట్టాక ఎల్-3లో మీపేరుంది మీకు బిల్లులు రావని చెబుతుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా 370 మంది నాలుగు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. అయితే క్షేత్రస్థాయిలో అధికారుల తప్పులు లబ్ధిదారులకు తలనొప్పిగా మారాయి. లబ్ధిదారులను తప్పుగా గుర్తించడంతో బిల్లులు మంజూరు కావడం లేదంటున్నారు.
- (ఆంధ్రజ్యోతి-భానుపురి)
రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇల్లు పథకా న్ని తీసుకువచ్చింది. మొదటి విడతలో సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం దశల వారీగా రూ.5 లక్షలు ఆర్థికసాయం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిని మూడు విభాగాలు విభజించింది. ఎల్-1 అంటే స్థలం ఉండి ఇళ్లు లేని అర్హులుగా, ఎల్-2లో ఇళ్లు, స్థలం లేని వారిని, ఎల్-3 అంటే డాబా ఇళ్లు ఉండి, నాలుగు చక్రాల వాహనాలు, వ్యవసాయ భూములు ఉన్న వారుగా వర్గీకరిస్తూ జాబితాలను వెల్లడించింది. ఇందుకు గ్రామస్థాయిలో గ్రామకార్యదర్శులు, ఇతరులతో కలిసి సర్వేలు చేసింది.
5,180 దరఖాస్తులు గ్రౌండింగ్
జిల్లావ్యాప్తంగా ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను అధికారులు విభజించారు. ఎల్-1లో 90,042 దరఖాస్తులు, ఎల్-2లో 53,676, ఎల్-3లో 1,59,868 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాకు 8,121 ఇళ్లు మంజూరు కాగా 5,180 దరఖాస్తులను గ్రౌండింగ్ చేశా రు. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణం జరుగుతోంది. కోదాడ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టులుగా తీసుకున్న గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చురుకుగా సాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మోతె మండలం విభలాపురం, నడిగూడెం మండలంలోని రామచంద్రాపురం, మునగాల మండలంలోని తాడ్వాయి, అనంతగిరి మండలంలోని లక్కారం, కోదాడ మండలంలోని గుడిబండ, చిలుకూరు మండలంలోని ఆర్యగూడెంలో ఇందిరమ్మఇళ్ల నిర్మాణం జరుగుతోందని, 80 శాతం పనులు పూర్తి అయ్యాయని చెబుతున్నారు. హుజూర్‌నగర్‌లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మాణం చేపట్టాల్సి ఉందని అంటున్నారు.
ఇరకాటంలో 370 మందికి...
జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు పథకానికి మంజూరైన వారిలో 370 మంది ఎల్-3లో ఉన్నట్లుగా అధికారులు పేర్కొంటూ బిల్లులు..మంజూరు చేయడం లేదు. పట్టాలు ఇచ్చే సమయంలో పట్టించుకోని అధికారులు అప్పులు చేసి తీరా కొంతమేర పనులు పూర్తి చేశాక ఆనలైనలో ఎల్-3లో ఉందంటు బిల్లులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెనపహాడ్ మండలంలో లింగయ్య అనే వ్యక్తికి ఇళ్లు మంజూరు పట్టా ఇచ్చారు. అయితే తనకు వెంట వెంటనే బిల్లు వస్తోందని అప్పు చేసి పునాది, గోడలు నిర్మాణం చేసి స్లాబ్ దశకు పనులు చేపట్టారు. కానీ బిల్లులు మాత్రం రావడం లేదు. అయితే అతడితో పాటు మరికొందరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరై బిల్లులు వస్తుండడంతో ఆందోళనకు గురి అవుతున్నారు. సక్రమంగా సర్వే చేయకపోవడంతో ఇందిరమ్మ లబ్ధిదారులు ఇబ్బందిపడే పరిస్థితి ఉంది. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రం ఇచ్చినా సంతోషం లేదని లబ్ధిదారులు అంటున్నారు. బెస్‌మెంట్ బిల్లు రాకపోవడంతో అధికారుల వద్దకు పరుగులు తీస్తే ఎల్-3లో ఉన్నట్లు చెబుతున్నారని వాపోతున్నారు. కలెక్టరేట్‌లోని హౌసింగ్ కార్యాలయం చుట్టూ, ఆయా ఎంపీడీవోల కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యదర్శుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కిరాయి ఇంటి ఫొటోలను సొంతిల్లుగా క్షేత్రస్థాయి అధికారులు తప్పుగా పేర్కొనడంతోనే బిల్లులు రావడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఎల్-3 జాబితా నుంచి తీసివేసి వెంటనే బిల్లులు మంజూరు చేయాలని లబ్ధిదారులు వేడ కుంటున్నారు.
కిరాయికి ఉన్న వారికే బిల్లులు వస్తున్నాయి
జిల్లాలో 5,180 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయి. కిరాయికి ఉన్న లబ్ధిదారులకే ఇళ్ల బిల్లులు వస్తున్నాయి. 370 మంది ఇళ్లకు పట్టాలు ఉండగా ఎల్-3 జాబితాలో ఉండడంతో బిల్లులు రావడం ఆలస్యమవుతోంది. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలోనే వారికి సైతం బిల్లులు వస్తాయి.
- సిద్ధార్థ, పీడీ గృహనిర్మాణ శాఖ, సూర్యాపేట