Share News

వచ్చిన నీటిని వచ్చినట్టే..

ABN , Publish Date - Apr 14 , 2026 | 11:31 PM

రెండు రాష్ట్రాల అన్నపూర్ణగా విరాజిల్లుతూ లక్షల ఎకరాలకు సాగు నీటిని అందిస్తున్న బహూళార్థ సాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్‌ నుంచి ఏటా ఎగువ నుంచి వచ్చిన వరదంతా దిగువకు వదిలేస్తున్నారు.

వచ్చిన నీటిని వచ్చినట్టే..

సాగర్‌కు ఈ ఏడాది 1,982 టీఎంసీల వరద రాక

దిగువకు 1953.76 టీఎంసీలు విడుదల

గత ఏడాది 1,266 టీఎంసీలరాక, 1251.2 టీఎంసీలు విడుదల

వేసవికి ముందే తాగునీటి ఇక్కట్లు!

నాగార్జునసాగర్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): రెండు రాష్ట్రాల అన్నపూర్ణగా విరాజిల్లుతూ లక్షల ఎకరాలకు సాగు నీటిని అందిస్తున్న బహూళార్థ సాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్‌ నుంచి ఏటా ఎగువ నుంచి వచ్చిన వరదంతా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో ఏటా వేసవి ప్రారంభం కాక ముందే (మార్చి నెలలోనే) తాగు నీటి సమస్య ఏర్పడుతోంది. దీంతో జంటనగరాలకు తాగు నీటి ని అందించాలంటే పుట్టంగండి వద్ద అత్యవసర మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తరలించాల్సి పరిస్థితి ఏర్పడుతోంది. ఎగువ నుంచి వచ్చిన వరదను ఒడిసి పట్టకుండా ఇరు రాష్ట్రాలు ఎడాపెడా నీటిని తరలిస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంటోందని నీటిపారుదలశాఖ నిపుణులు చెబుతున్నారు. ఎగువ నుంచి వచ్చిన నీటిని మరో నీటి సంవత్సరం ప్రారంభమయ్యే వరకు కనిష్ఠ (510 అడుగులు) స్థాయికి పడిపోకుండా చూసుకుంటే సాగు, తాగునీటి సమస్యలు రావని నిపుణులు పేర్కొంటున్నారు.

రెండు నీటి సంవత్సరాల్లో నీటి రాక, విడుదల ఇలా..

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు 2024-25 నీటి సంవత్సరం లో (2024 జూన్‌ 1 నుంచి 2025 మే 31 వరకు) ఎగువ నుంచి 1,266 టీఎంసీల వరద వచ్చింది. ఈ నీటిని కుడి కాల్వకు 192.3 టీఎంసీలు, ఎడమ కాల్వకు 144.9 టీఎంసీలు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 298.5 టీఎంసీ లు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 52.9టీఎంసీలు, వరద కాల్వ ద్వారా 7.7 టీఎంసీలు, క్రస్ట్‌ గేట్ల ద్వారా 554.9 టీఎంసీల నీటిని విడుదల చేశారు. సాగర్‌ నుంచి గత నీటి సంవత్సరంలో మొత్తం 1,251.2 టీఎంసీల నీటిని విడుదల చేశారు. 2025-26 నీటి సంవత్సరంలో ఎగువ నుంచి 1,981 టీఎంసీల నీరు సాగర్‌కు వచ్చి చేరింది. సాగర్‌ నుంచి కుడి కాల్వ ద్వారా 190టీఎంసీల నీటిని, ఎడమ కాల్వ ద్వారా 150.89 టీఎంసీల నీటిని, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 46.29 టీఎంసీల నీటిని, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 370.60 టీఎంసీల నీటిని, వరద కాల్వ ద్వారా 5.28 టీఎంసీల నీటిని, క్రస్ట్‌ గేట్ల ద్వారా 1,151.90 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్‌ నుంచి మొత్తం 1,953.76 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ఈ నీటి సంవత్సరంలో సాగర్‌కు వచ్చిన వరదంతా దిగువకు విడుదల చేశారు. దీంతో వేసవిలో తాగు నీటి తిప్పలు తప్పవని నీటిపారుదలశాఖ నిపుణులు పేర్కొంటున్నారు.

సాగర్‌ నీటి సమాచారం

సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగు లు (312.0450 టీఎంసీలు) కాగా, సోమవారం సాయంత్రానికి 528.20 అడుగులుగా (164.6544 టీఎంసీలు) ఉంది. సాగర్‌ నుంచి ఎడమ కాల్వ ద్వారా 3,667 క్యూసెక్కుల నీటిని, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి మొత్తం 5,767 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, ఎగువ నుంచి 5,767 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరుతోంది.

Updated Date - Apr 14 , 2026 | 11:31 PM