Share News

అయిననూ కష్టమే..!

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:16 AM

రాష్ట్ర ప్రభుత్వం యూరియా పంపిణీ విధానాన్ని సులభతరం చేసి పారదర్శకంగా పంపిణీకి రోజుకో విధంగా మార్పులు చేస్తున్నా రైతులు మాత్రం యథావిధిగా సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఫోన్‌ యాప్‌ ద్వారా ఫర్టిలైజర్‌ బుకింగ్‌తో పలు సమస్యలు వస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ మాత్రం గత యాసంగితోపాటు, ప్రస్తుత వానాకాలం సీజన్‌లోనూ ఫర్టిలైజర్‌ యాప్‌ బుకింగ్‌ విధానాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.

అయిననూ కష్టమే..!

ఇటీవలే ఎరువుల పంపిణీలో మారిన విధానాలు

తాజాగా మీ-సేవా కేంద్రాల ద్వారా బుకింగ్‌

ఫార్మర్‌ రిజిస్ట్రీ లేకపోవడంతో బుకింగ్‌కాని పరిస్థితి

నిబంధనలు మారుస్తున్నా సమస్యలు యథాతథం

(ఆంధ్రజ్యోతి, నల్లగొండ)

రాష్ట్ర ప్రభుత్వం యూరియా పంపిణీ విధానాన్ని సులభతరం చేసి పారదర్శకంగా పంపిణీకి రోజుకో విధంగా మార్పులు చేస్తున్నా రైతులు మాత్రం యథావిధిగా సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఫోన్‌ యాప్‌ ద్వారా ఫర్టిలైజర్‌ బుకింగ్‌తో పలు సమస్యలు వస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ మాత్రం గత యాసంగితోపాటు, ప్రస్తుత వానాకాలం సీజన్‌లోనూ ఫర్టిలైజర్‌ యాప్‌ బుకింగ్‌ విధానాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.

వానాకాలం సీజన్‌లో జిల్లాకు మొత్తం 85వేల మెట్రిక్‌టన్నుల యూరియా అవసరం అని వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించి. ఇప్పటివరకు 25వేల మెట్రిక్‌టన్నుల యూరియా పంపిణీ చేయగా, మరో 17వేల మెట్రిక్‌టన్నుల నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ యూరియాను యాప్‌ బుకింగ్‌తో పాటు, మీ-సేవా కేంద్రాల ద్వారా బుకింగ్‌ చేస్తే పంపిణీ చేస్తున్నారు. అయితే యాప్‌లో బుకింగ్‌ రైతులకు సమస్యగా మారింది. ఎట్టి పరిస్థితుల్లో యాప్‌ ద్వారానే యూరియా పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో నిల్వల ఆధారంగా ఫర్టిలైజర్‌ యాప్‌ బుకింగ్‌తో రైతులు యూరియాను పొందాల్సి ఉంటుంది. చాలా గ్రామాల్లో స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా బుకింగ్‌ చేసేందుకు రైతులు పలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. యూరియా నిల్వ ఉన్న సమయంలో నెట్‌ పనిచేయకపోవడం, నెట్‌ పనిచేసిన సమయంలో నిల్వలు పూర్తవుతున్నాయి. ఓటీపీ చెక్‌చేసే వరకే ఒక్కోసారి నిల్వలు ఉండటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ లేకుంటే నో బుకింగ్‌

జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు. చాలామంది రైతులు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోకపోవడంతో ప్రస్తుతం యూరియా బుకింగ్‌ చేసుకోవాలంటే సమస్య ఎదురవుతోంది. మీ-సేవా కేంద్రాలకు రైతులు వెళ్లినప్పుడు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ లేకపోవడంతో యూరియా బుకింగ్‌ కావడం లేదు. మీ-సేవా కేంద్రాల ద్వారా ఫార్మర్‌ రిజిస్ట్రీ ఉంటేనే యూరియా బుక్‌ అవుతోంది. జిల్లా వ్యాప్తంగా సెప్టెంబరు మాసం వరకు యూరియా పంపిణీ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో 5లక్షల ఎకరాల వరకు రైతులు పత్తి విత్తనాలు విత్తారు. అయితే సమృద్ధిగా వర్షాలు లేకపోవడంతో పత్తి మొలకలు వాడుపట్టే దశలో ఉన్నాయి. వర్షాలు సమృద్ధిగా కురిస్తే యూరియా అవసరం పెరుగుతంది. వరి సేద్యం కూడా వానలు లేకపోవడంతో ముందుకు సాగడం లేదు. వర్షాలు కురిసి బోరుబావులు, భూగర్భ జలాలు పెరిగి, సాగర్‌ రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతం నుంచి వరదలు వస్తే వరి సేద్యం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆ సమయంలో యూరియా కోసం రైతులు ఎగబడతారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయశాఖ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

సాంకేతిక సమస్యలపై దృష్టి ఏదీ?

రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరఫరా విషయంలో ప్రధానంగా పారదర్శకతపైనే దృష్టికి సారించింది. యూరియా సరఫరా కోసం పారదర్శక విధానాలతో రైతులకు ప్రయోజనం చేకూరుతున్నప్పటికీ సాంకేతిక సమస్యలు మాత్రం యథావిధిగా ఉంటున్నాయి. ప్రధానంగా సెల్‌ ఫోన్‌ ద్వారా యూరియా బుకింగ్‌ యాప్‌ రైతులకు సమస్యగా పరిణమించింది. చాలామంది రైతులకు అవగాహన లేకపోవడం, స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం తెలియకపోవడంతో యాప్‌ ద్వారా యూరియా బుకింగ్‌ చేయలేకపోతున్నారు. వారు యాప్‌పై అవగాహన ఉన్న వారి వద్దకు వెళ్లి యూరియా బుకింగ్‌ చేసుకోవాల్సి వస్తోంది. తాజాగా మండల కేంద్రాలు లేదా పట్టణాల్లో ఉండే మీ-సేవా కేంద్రాలకు వెళ్లి యూరియా బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే యూరియా కోసం వ్యవసాయ పనులను పక్కనపెట్టి మండల కేంద్రానికి లేదా పట్టణ కేంద్రానికి వెళ్లి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని పలువురు రైతులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రెండు బస్తాల యూరియా ఇస్తున్నా ఎటువంటి బుకింగ్‌ లేకుండా రైతులకు నేరుగా సరఫరా చేయాలని రైతులు, రైతు సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ప్రభుత్వ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గకుండా గత సీజన్‌ మాదిరిగానే ప్రస్తుతమూ యాప్‌ ద్వారా మీ-సేవా కేంద్రాల ద్వారా యూరియా సరఫరాకే మొగ్గు చూపుతోంది. యూరియాను అధికంగా వినియోగిస్తుండటంతో భూసారం దెబ్బతినే ప్రమాదం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని యూరియాను తక్కువగా వినియోగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎకరాకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేస్తోందని. అయితే యూరియా బుకింగ్‌ విషయంలో సాంకేతిక సమస్యలను తొలగితే రైతులకు కొంతమేరకైనా కష్టాలు తప్పే అవకాశం ఉంది.

Updated Date - Jul 10 , 2026 | 12:16 AM