వైద్య, ఆరోగ్యశాఖలో ఇదేం సర్దుబాటు?
ABN , Publish Date - May 26 , 2026 | 11:53 PM
వైద్య ఆరోగ్య శాఖలో కీలక విభాగం 104 లో పనిచేసిన ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా మారింది. 104 సిబ్బంది ప్రధానంగా మారుమూల గ్రామాల ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులకు గురైతే వారికి అవగాహన కల్పించడంతో పాటు మందులు అందజేస్తారు.
104 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇతర జిల్లాలకు బదిలీ
15 నెలలుగా వేతనాలు లేని పరిస్థితి
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు
(ఆంధ్రజ్యోతి,నల్లగొండ): వైద్య ఆరోగ్య శాఖలో కీలక విభాగం 104 లో పనిచేసిన ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా మారింది. 104 సిబ్బంది ప్రధానంగా మారుమూల గ్రామాల ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులకు గురైతే వారికి అవగాహన కల్పించడంతో పాటు మందులు అందజేస్తారు. అయితే కాలక్రమంలో 2018 నుంచి 104 వాహనాలను తొలగించడంతో పాటు అందులో పనిచేసే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారడంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జిల్లాలో గతంలో 104 వాహనాలు క్రమం తప్పకుం డా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తూ ప్రజలకు, ముఖ్యంగా దీర్ఘకాలిక రోగులకు మందులు అందజేసేవారు. దీంతో మారుమూల ప్రాంత ప్రజలకు ప్రయోజనం కలిగేది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 104ను పునరుద్ధరించకపోవడంతో పరిస్థితి తలకిందులైంది. ఈ పథకానికి నిధులు కేటాయించకపోవడంతో వాహనాలు మూలన పడి స్ర్కాప్ కింద వేలం వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం 104 పునరుద్ధరణ ఆలోచన చేయలేదు. దీంతో మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు మృగ్యమయ్యాయి.
సర్దుబాటుతో ఉద్యోగులకు మొదలైన కష్టాలు
వైద్య ఆరోగ్యశాఖలో 104 వాహనాల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులు ప్రస్తుతం రోడ్డున పడ్డా రు. అవుట్ సోర్సింగ్ ప్రతిపాదికన పనిచేస్తున్న సదరు ఉద్యోగులకు వైద్య ఆరోగ్యశాఖలో ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా, ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి అంతర్ జిల్లా బదిలీ కూడా చేశారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు కొంత మందికి రూ.9వేలు వేతనం ఉండగా, మరికొంత మందికి రూ.15వేలు మాత్రమే వేతనంగా ఉంది. డాక్టర్ల ను మినహాయిస్తూ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులను సర్దుబాటు చేశారు. జిల్లా లో పనిచేసిన ఉద్యోగులను జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకు బదిలీచేశారు. స్వల్ప వేతనాలతో పనిచేస్తున్న వీరిని ఇతర జిల్లాలకు బదిలీ చేయడంతో వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా యి. ఇదిలా ఉండగా, 15 నెలలుగా వేతనాలు రాకపోవడంతో వీరు కష్టాలు ఎదుర్కొంటున్నారు. నల్లగొండ జిల్లా నుంచి జనగామ జిల్లాకు బదిలీ అయిన వారు కొద్ది రోజుల క్రితం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌కు కష్టాలను మొరపెట్టుకొని వినతిపత్రం అందజేశారు. 15 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో పాటు జనగామ జిల్లాలో విధులు నిర్వహించడం ఇబ్బందిగా ఉందని విన్నవించారు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ రీడిప్లాయిమెంట్ ఉత్తర్వులను జారీచేసి తిరిగి సొంత జిల్లాకు పంపాలని జనగామ జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. అయితే ఉత్తర్వులు రాకపోవడంతో యథావిధిగా జనగామలోనే పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది.
జిల్లాలో గతంలో మొత్తం 73మంది 104లో పనిచేశారు. అందులో జనగామ జిల్లాకు 28మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు బదిలీ అయ్యారు. వీరిలో 10మంది కంప్యూటర్ ఆపరేటర్లు, నలుగురు డ్రైవర్లు, ఆరుగురు సెక్యూరిటీ గార్డులు, నలుగురు ఫార్మసి్‌స్టలు, నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారు. మిగతా ఉద్యోగులు సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో పనిచేస్తుండగా స్వల్ప సంఖ్యలో నల్లగొండలో విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, తమను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని, సకాలంలో వేతనాలు మంజూరు చేయాలని 104 అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు వేడుకుంటున్నారు.
అధికారులు ఆదుకోవాలి : పెంటమల్ల పాలిని కుమార్, డేటా ఎంట్రీ ఆపరేటర్
నన్ను యాదాద్రి జిల్లాలోని జీజీహెచ్‌కు పంపించారు. దీంతో వచ్చే జీతం ఏ మాత్రం సరిపోవడం లేదు. తక్కువ జీతంతో పనిచేస్తున్న మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. పలు కష్టాలు ఎదుర్కొంటున్న మామ్మల్ని సొంత ప్రాంతంలోనే పనిచేసేలా సర్దుబాటు చేయాలి. దూర ప్రాంతాలకు బదిలీ చేయడంతో దూరభారంతోపాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
వేతనాలు త్వరగా చెల్లించాలి : గుంటి కోటయ్య, సెక్యూరిటీ గార్డు
పెండింగ్‌లో ఉన్న వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. తక్కువ వేతనంతో పనిచేస్తున్న మమ్మల్ని సొంత ప్రాంతంలోనే సర్దుబాటు చేసి వేతనాలు పెంచాలి. ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి ఆదుకోవాలి. తక్కువ వేతనంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేయాలంటే ఖర్చులు కూడా వెళ్లడం లేదు. కుటుంబ అవసరాలు తీరడం కూడా కష్టంగా ఉంది. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని ఆదుకోవాలి.
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : బైరబోయిన భిక్షం, ఐఎన్‌టీయూసీ (3194) జిల్లా అధ్యక్షుడు
వైద్య ఆరోగ్యశాఖలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న 104 సంస్థలో పనిచేసిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ప్రస్తుతం 15 నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 104 సంస్థ ప్రస్తుతం మనుగడలో లేదు. అందులో పనిచేసిన ఉద్యోగులను సర్దుబాటు చేసే విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. తక్కువ వేతనంతో పనిచేసే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఇతర జిల్లాలకు బదిలీ చేయడం బాధాకరం. వెంటనే వారిని నల్లగొండ జిల్లాలో పనిచేసేలా ఉత్తర్వులు జారీ చేయాలి. ఈ విషయాన్ని జిల్లా మంత్రి పరిశీలించి న్యాయం చేయాలి.