Share News

నైరుతి రుతుపవనాలు ఆలస్యమేనా!

ABN , Publish Date - May 30 , 2026 | 12:14 AM

నైరుతి రుతు పవనాలు ఈ సారి ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. వాస్తవానికి మే 26వరకే కేరళకు నైరుతి రుతుపవనాలు వస్తాయని, అక్కడి నుంచి తెలంగాణ లో ఈ నెలాఖరులోగా వర్షాలు కురుస్తాయని తొలుత వాతావరణ శాఖ పేర్కొన్నప్పటికీ పరిస్థితులు తలకిందులయ్యాయి.

నైరుతి రుతుపవనాలు ఆలస్యమేనా!

జూన్‌ 5 తర్వాతే వర్షాలు వచ్చే అవకాశం

స్పష్టం చేసిన వాతావరణ శాఖ

వానకాలం సాగుపై తీవ్ర ప్రభావం

నల్లగొండ, మే 29 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతు పవనాలు ఈ సారి ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. వాస్తవానికి మే 26వరకే కేరళకు నైరుతి రుతుపవనాలు వస్తాయని, అక్కడి నుంచి తెలంగాణ లో ఈ నెలాఖరులోగా వర్షాలు కురుస్తాయని తొలుత వాతావరణ శాఖ పేర్కొన్నప్పటికీ పరిస్థితులు తలకిందులయ్యాయి. ఇప్పటివరకు నైరుతి రుతుపవనాలు జాడలేకపోవడంతో ఆందోళన నెలకొంది. అక్కడక్కడ అకాల వర్షాలు కురవడం తప్ప నైరుతి రుతుపవనాల ప్రభావంవల్ల వర్షాలు రాకపోవడం చూస్తుంటే ఈ వానాకాలం సాగుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశా లు స్పష్టంగా ఉన్నాయి. తాజాగా శుక్రవారం వాతావరణ శాఖ రుతుపవనాలు ఆలస్యమవుతాయని స్పష్టంచేసింది. భారత వాతావరణశాఖ అంచనా ప్రకారం గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో జూన్‌ 5 తర్వాతే రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ఈపాటికే రుతుపవనాలు కేరళలో ప్రవేశించాల్సి ఉన్నా సమయం దాటిపోయినప్పటికీ ఇంకా రుతుపవనాలు ప్రవేశించలేదు. గతంలో జూన్‌ మొదటి వారానికి ముందే రాష్ట్రంలోకి రుతుపవనాలు వచ్చేవి. అయితే రుతుపవనాల కదలికలకు మందగించడంతో మరింత ఆలస్యం కానుంది.

వానకాలం సాగుపై ప్రభావం

గతంలో మే నెలాఖరులో ఆడపాదడపా కురిసిన వర్షాలకు, లేదంటే ముందస్తుగా కురిసిన వానలతో మే నెలలోనే పత్తి విత్తనాలు వేసిన సందర్భాలు ఉం డేవి. ఈసారి పలు చోట్ల 43 డిగ్రీల నుంచి 46డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో వర్షాలు వచ్చే అవకాశాలు కానరాకపోవడంతో రైతులు వేసవి దుక్కుల్లో విత్తనాలు వేయలేదు. ఇప్పటివరకు ఎక్కడ కూడా వర్షాలు పడక పోవడంతో దుక్కులు కూడా దున్నలేదు. ఈసారి వానాకాలంలో 5.60లక్షల ఎకరాల వర కు పత్తి విత్తనాలు వేసే అవకాశం ఉన్నట్లు వ్యవసా య శాఖ అంచనా వేసింది. రైతులు విత్తనాలను ఈ పాటికే సిద్ధం చేసుకొని ఉంచుకున్నారు. అయితే వర్షా లు కురవకపోవడంతో విత్తనాలు వేయలేక పోతున్నా రు. మరో వారంపాటు వర్షాలు వచ్చే అవకాశాలు లేవని వాతావరణ శాఖ పేర్కొంటుంది. ఈసారి వర్షాకాలంలో తక్కువగానే వర్షాలు కురుస్తాయని జూలై, ఆగస్టు నెలల్లో పెద్దగా వర్షపాతం నమోదుకాదని వా తావరణశాఖ పేర్కొనడంతో రైతుల్లో గుబులు మొదలైంది. ఇక వర్షాలు సమృద్ధిగా పడితేనే భూగర్భజలా లు పెరగడంతోపాటు బోరుబావుల కింద సేద్యం పెరగనుంది. సాగర్‌ రిజర్వాయర్‌లో కూడా నీటి నిల్వలు తగ్గడంతో ఎడమ కాల్వ కింద ఆయకట్టులో సాగుపై ప్రభావం చూపించనుంది. వర్షాలు భారీగా కురిస్తేనే జిల్లాలో వ్యవసాయ శాఖ అంచనా మేరకు 5.40లక్షల ఎకరాల్లో వరి సాగు అయ్యే అవకాశాలు ఉంటాయి.

ఎండలు తగ్గుముఖం పట్టేనా ?

నైరుతి రుతుపవనాల ఆలస్యంతో ఎండలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కానరావడంలేదు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో వారం వరకు వర్షాలు రాకపోతే భూమి చల్లబడక ఎండలతీవ్రత ఇదేవిధంగా ఉండనుంది. జూన్‌ 8వ తేదీ వరకు రోహిణి కార్తె ఉంటుంది. వాస్తవానికి జూన్‌లో మృగశిర ప్రవేశం నాటికి గతంలో వర్షాలు పడిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతానికి వర్షాలు జాడ కనిపించకపోవడంతో ఎప్పటికి వానలు వస్తాయనే దానిపై కూడా సందిగ్ద్ధం నెలకొంటుంది. వాతావరణ శాఖ జూన్‌ 5వ తేదీ వరకు వర్షాలు కురవవని తెలపడంతో పరిస్థితులు తారమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షాలు ఈ సంవత్సరం సమృద్ధిగా కురిస్తేనే రైతులు గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో అత్యధికంగా వరిపంటకు సమానంగా పత్తి పంటను సాగు చేస్తుంటారు. వరి, పత్తి మినహా జిల్లాలో ఇతర మెట్టపంటలు పెద్దగా ఉండవు. దీంతో వర్షాధారంగా సాగుచేసే పత్తి సాగుకు సంబంధించి వర్షాలు ఇప్పటికప్పుడు కురిసే అవకాశాలు లేకపోవడంతో వానకాలం పంటల సాగు మరింత ఆలస్యం కానుంది. దీంతో పంటల దిగుబడి కూడా తగ్గే ప్రమాదం లేక పోలేదు.

Updated Date - May 30 , 2026 | 12:14 AM