Share News

నువ్వా.. నేనా?

ABN , Publish Date - Feb 10 , 2026 | 12:43 AM

జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల్లో పోటీ రసవత్తరంగా ఉంది. కొన్నిచోట్ల త్రిముఖపోటీ, మరికొన్ని చోట్ల ద్విముఖ పోటీ నెలకొంది. అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు ముగించారు. మంగళవారం నుంచి అభ్యర్థులు కొద్దిమందితో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటును అభ్యర్థించవచ్చు.

నువ్వా.. నేనా?

అన్నిచోట్ల త్రిముఖ పోటీ

కొన్నివార్డుల్లో ద్విముఖం

అన్ని మునిసిపాలిటీల్లోనూఅదే తీరు

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట): జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల్లో పోటీ రసవత్తరంగా ఉంది. కొన్నిచోట్ల త్రిముఖపోటీ, మరికొన్ని చోట్ల ద్విముఖ పోటీ నెలకొంది. అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు ముగించారు. మంగళవారం నుంచి అభ్యర్థులు కొద్దిమందితో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటును అభ్యర్థించవచ్చు. ఒక్కోసారి ఒక్క ఓటుతో గెలిచిన సందర్భాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క ఓటు ఉన్న ఇంటిని కూడా పలుమార్లు సందర్శించి, ఓటు అభ్యర్థిస్తున్నారు. కొంతమంది రెండు, మూడు ప ర్యాయాలు గెలిచిన కౌన్సిలర్లు పోల్‌ మేనేజ్‌మెంట్‌లో సిద్ధహస్తులు కావడంతో వారు దూసుకెళ్తున్నారు.

జిల్లాలో మొత్తం 141 వార్డులు ఉండగా నాలుగు వార్డులు ఏకగ్రీవం కాగా 137వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికోసం 372 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. సూర్యాపేట మునిసిపాలిటీలో 165 పోలింగ్‌స్టేషన్‌లు ఉన్నాయి. కోదాడలో 35వార్డులు ఉండగా హుజూర్‌నగర్‌లో 28 వార్డులు ఉన్నాయి. నేరేడుచర్ల, తిరుమలగిరిలలో 15 వార్డుల చొప్పున ఉన్నాయి. ప్రధాన పోటీ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య నెలకొంది. పలువార్డుల్లో త్రిముఖ పోటీతో పాటు కొంత మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా బలంగా ఉన్నారు. దీనివల్ల ఓట్లు చీలి చతుర్ముఖపోటీ ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని వార్డుల్లో కేవలం రెండు పార్టీల మద్యే సైఅంటే సై అన్నట్లుగా ఉంది. ఇటువంటి వార్డులు దాదాపు 52 దాకా ఉన్నాయి. ఈ వార్డుల్లో ఎవరు గెలిచిన కేవలం 50 ఓట్ల లోపు మెజార్టీ మాత్రమే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎన్నికల నిబంధనలకు తిలోదకాలు

అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే ఇళ్ల మధ్య ఉన్న గోడలపై పోస్టర్‌లు అతికించారు. మైకులు కూడా ఒక స్థాయిలో శబ్ధం చేయాలని ఉండగా అంతకు మించి చెవులు చిల్లుమనేలా వినిపించారు. ఎన్నికల పరిశీలకులు, అధికారులు చోద్యం చూస్తుండగానే ప్రచారాలు ముగిశాయి. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు మద్యం, మటన్‌, చికెన్‌ కూడా పంపిణీ చేశారు. ఈ నెల 8వతేదీన ఆదివారం రోజు ఒక్కో ఇంటికి వాటర్‌ బాటిల్‌ కూడా అందజేశారు. ఒక అభ్యర్థి ఎన్నికల ఖర్చు కేవలం రూ.లక్ష మాత్రమే చేయాల్సి ఉండగా రూ. కోటి వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇక మంగళవారం డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేసే అవకాశం ఉంది. ఇక ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పైగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తమ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని డబ్బు ఖర్చుకు వెనకాడడం లేదు. కొంత మంది ఉద్యోగాలు వదులు కొని కూడా రంగంలోకి దిగారు.

చివరి రోజు హోరెత్తిన ప్రచారం..

కోదాడటౌన్‌ / తిరుమలగిరి : సోమవారం మునిసిపాలిటీల్లో అన్ని వార్డుల్లో ప్రచారం హోరెత్తింది. బ్యాండ్‌ బాజాలు, డప్పుచప్పుళ్లు యువత కేరింతల మధ్య అభ్యర్థులు భారీ ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి వీధుల్లో సందడి చేశారు. ఓటర్లను ఆకర్షించేందుకు స్వయంగా కార్యకర్తలతో కలిసి స్టెప్పులేశారు.

Updated Date - Feb 10 , 2026 | 12:51 AM