పంట మార్పిడి జరిగేదెట్టా?
ABN , Publish Date - May 13 , 2026 | 12:16 AM
జిల్లా వ్యాప్తంగా పంటల మార్పిడి జరగకపోవడంతో రాను న్న రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. వానాకాలం సీజన్‌లో 6లక్షల ఎకరాలకు పైగా వరి సాగుకానుండగా, 5.60లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది.
జిల్లాలో గణనీయంగా పెరుగుతున్న వరి, పత్తి సాగు
పడిపోతున్న కూరగాయలు, పప్పు దినుసుల సేద్యం
తోటలు సైతం కనుమరుగవుతున్న పరిస్థితి
(ఆంధ్రజ్యోతి,నల్లగొండ): జిల్లా వ్యాప్తంగా పంటల మార్పిడి జరగకపోవడంతో రాను న్న రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. వానాకాలం సీజన్‌లో 6లక్షల ఎకరాలకు పైగా వరి సాగుకానుండగా, 5.60లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. దీంతో పాటు పప్పు దినుసులు ఉద్యాన పంటలు, కూరగాయల సాగు కేవలం 60వేల ఎకరాల కు మించని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన వ్య వసాయ వారోత్సవాల్లో అధికార యంత్రాంగం పంటల మార్పిడి పై రైతులకు అవగాహన కల్పించింది. అయితే ఏ మేరకు రైతులు పంటల మార్పిడీకి మొగ్గుచూపుతారో వేచి చూడాల్సిందే.
ఇటీవల రైతు కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి పంటల మార్పిడి అత్యవసరమని నివేదిక సమర్పించింది. ప్రతీ వానాకాలం సీజన్‌లో వరి, పత్తి పంటలు అత్యధికంగా సాగవుతుండగా యాసంగిలో సైతం వరి అత్యధికంగా సాగవుతోంది. ఏటా వరి విస్తీర్ణం పెరుగుతుండగా, కూరగాయల సాగు తగ్గిపోతోంది. సుస్థిర వ్యవసాయం, రైతులు ఆర్థికంగా బలోపేతం కావడం, సహజ వనరుల సంరక్షణ, భవిష్యత్‌లో ఆహార భద్రత కోసం పంటల మార్పిడి తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది.
వాతావరణానికి అనుకూలంగా ప్రణాళికలు...
జిల్లాలో వాతావరణానికి అనుకూలం గా పంటల ప్రణాళికలు రూపొందించాల ని ప్రభుత్వం వ్యవసాయశాఖ అధికారుల ను ఆదేశించింది. పంటల మార్పిడి లక్ష్యాల ను గ్రామాల వారీగా నిర్ణయిస్తేనే ప్రయోజనం చేకూరుతుందనేది ప్రభుత్వం యోచించింది. గత ప్రభుత్వ హయాంలో కూరగాయల హబ్‌గా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, నల్లగొండ సరిహద్దు గ్రామాల్లో పెద్ద మొత్తంలో సాగుచేపట్టాలని నిర్ణయించి నా ఆ తరువాత ప్రణాళిక నిలిచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూరగాయల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించినా ఇంకా అమలుకు నోచుకోలేదు. కూరగాయల సాగు కేవలం జిల్లా వ్యాప్తంగా 4వేల నుంచి 5వేల ఎకరాల్లో మాత్రమే ఉండటంతో ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ధరలు మండిపోతున్నాయి. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాల పంటలు కూడా గణనీయంగా పడిపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి తప్ప డం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను రూపొందించేందుకు ‘రైతు వారం’ పేరుతో కార్యక్రమా న్ని రూపొందించింది. వరి, పత్తి దిగుబడులు పెరుగుతుండటంతో భవిష్యత్‌లో కొనుగోలు విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో ప్రభుత్వం పంటల మార్పిడిపై దృష్టిసారించింది.
తగ్గుతున్న పండ్ల తోటల విస్తీర్ణం
ఒకప్పుడు నల్లగొండ జిల్లా పండ్ల తోటల విస్తీర్ణంలో దేశంలో ప్రథమ స్థానంలో ఉంది. ఆ తరువాత పండ్ల తోటల విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ వచ్చింది. పాత తోటలను తొలగించి వాటి స్థానంలో రైతులు వరి సేద్యం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మార్కెటింగ్ సమస్యతో పాటు ఎగుమతి సౌకర్యం లేకపోవడమే. జిల్లాలో 69వేల ఎకరాల్లో బత్తాయి, నిమ్మ తోటలతో పాటు ఇతర తోటలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవల క్రాప్ బుకింగ్‌కు సంబంధించి వివరాలు సేకరించిన సమయంలో ఒక్క నల్లగొండ మండలం పరిధిలోనే 269 ఎకరాల్లో బత్తాయి తోటలను తొలగించిన రైతులు వరి సేద్యం చేసినట్టు గుర్తించారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 4వేల ఎకరాల్లో ఈ ఆరు నెలల కాలంలో బత్తాయి తోటలను తొలగించారు. దీనికి తెగుళ్లతో పాటు వేరుకుళ్లు, దిగుబడి తగ్గడం, ధర పడిపోవడం ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. పండ్ల తోటలను తొలగిస్తున్న రైతులు నీటి వనరులు ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేని వరి సాగు చేయడానికే మొగ్గు చూపుతున్నారు.
పంట మార్పిడిపై రైతులకు అవగాహన: పి.శ్రవణ్‌కుమార్, జేడీఏ
జిల్లాలో పంటల మార్పిడిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఒకే పంట వేయడం వల్ల భూసారం దెబ్బతినడంతో పాటు పంటలపై ప్రభావం చూపిస్తోంది. పంట మార్పిడి చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు ‘రైతు వారోత్సవాలు’ నిర్వహించాం. పంటల మార్పిడితో రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఎప్పుడూ ఒకే పంట సాగుచేయడం వల్ల ఉపయోగం ఉండదు. దిగుబడులు తగ్గుతాయి. వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, ఉద్యాన పంటలు సాగుచేయాలి. రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పంటల మార్పిడికి చర్యలు తీసుకుంటున్నాం.