Share News

canal in vain: వృథాగా కాల్వలోకి

ABN , Publish Date - May 26 , 2026 | 11:49 PM

వానాకాలం సీజన్‌ సాగుకు ఉపయోగపడాల్సిన మూసీ ప్రాజెక్ట్‌ నీరు వృథాగా పో తోంది. తూము షట్టర్‌ మరమ్మతుకు రావడంతో ప్రతి రోజూ 30 క్యూసెక్కుల నీరు కుడి కాల్వలోకి వెళ్తుందని అధికారులు చెబుతున్నా అంతకంటే ఎక్కువగానే పోతోందని రైతులు ఆరోపిస్తున్నారు.

canal in vain: వృథాగా కాల్వలోకి

మూసీ ప్రాజెక్టు కుడికాల్వ తూము షట్టర్‌లకు మరమ్మతులు

ప్రతి రోజూ 30 క్యూసెక్కులు కాల్వలోకి..

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట): వానాకాలం సీజన్‌ సాగుకు ఉపయోగపడాల్సిన మూసీ ప్రాజెక్ట్‌ నీరు వృథాగా పో తోంది. తూము షట్టర్‌ మరమ్మతుకు రావడంతో ప్రతి రోజూ 30 క్యూసెక్కుల నీరు కుడి కాల్వలోకి వెళ్తుందని అధికారులు చెబుతున్నా అంతకంటే ఎక్కువగానే పోతోందని రైతులు ఆరోపిస్తున్నారు. కొద్దిరోజుల్లో వానాకాలం సీజన్‌ ప్రా రంభం కానున్న నేపథ్యంలో నీరంతా వృథాగా పోతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది.

మూసీ ప్రాజెక్టు నిర్వహణ లోపభూయిష్టంగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుడికాల్వ షట్టర్‌కు మరమ్మతులు చేయలేకపోతుంటంతో నీరంతా కాల్వలోకి వృథా పోతోంది. యాసంగి వరి కోతలు ముగిశాయి. దాదాపు 80శాతం మంది ఇప్పటికే పంట దిగుబడిని కూడా విక్రయించారు. ఎవరికీ సాగునీరు అవసరం లేదు. దీంతో వచ్చే వానాకాలం సీజన్‌కు వినియోగించాల్సిన సాగునీరు వృథా అవుతుంటడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

అంతంతమాత్రంగా పనులు

మూసీ ప్రాజెక్టును 1954లో 4.46టీఎంసీల సామర్థ్యంతో ప్రారంభించి 1963లో పనులు పూర్తిచేశారు. నాటి నుంచి నేటి వరకు పెద్దగా ఆధునికీకరణ పనులు చేపట్టలేదు. ఇటీవల చే పట్టిన కాల్వ లైనింగ్‌, ఇరువైపులా తూములు, షట్టర్లు బిగించడం చేశారు. దీంతో నీటి వృథా చాలా వరకు తగ్గింది. గతంలో తూములు, షట్టర్లు లేకపోవడంతో నీరంతా వృథా అయ్యేది. వేములపల్లి మండలం చివరి ఆయకట్టు రైతులకు సాగు నీరు చేరడంలేదు. కాల్వ వెంట 6 మీటర్ల వెడల్పుతో సీసీ బెడ్‌, లైనింగ్‌ నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీ కాల్వలకు 6.9మీటర్ల వెడల్పుతో లైనింగ్‌, కాల్వ వెంబడి కంపచెట్లను తొలగించడం ఆధునికీకరణ పనుల్లో ఉన్నాయి. కాల్వ లైనింగ్‌, సీసీ బెడ్‌తో వేయాల్సి ఉండగా కాల్వ పూడికతీయడంలో వచ్చిన రాళ్లను వృథా చేయవద్దని అదే రాళ్లను కాల్వ లైనింగ్‌ వాడారు. దీంతో పనులు ఆలస్యమయ్యాయి.

ప్రతి మూడు రోజులకు...

కుడికాల్వ షట్టర్‌ పైకి ఎత్తడంతో దానికి మరమ్మతులు చేసేందుకు అధికారులు నానాకష్టాలు పడుతున్నారు. అక్కడ మరమ్మత్తులు చేసినప్పుడు నాలుగు రోజులు బాగానే ఉంటుం ది. తిరిగి లీకేజీ అవుతోంది. దీంతో లీకేజీని అరికట్టలేకపోతున్నారు. మూసీ ప్రాజెక్టు నీటిమట్టం మొత్తం 645అడుగులు కాగా ప్రస్తుతం 637దాకా నీరు ఉంది. దాదాపు జూన్‌ 15వరకు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. అనంతరం గేట్లను ఎత్తి నీరు విడుదల చేస్తారు. కుడి, ఎడమ కాల్వల్లో కూడా నీరు విడుదల చేస్తారు. ఎడమకాల్వ 38 కిలోమీటర్ల పొడవు ఉండగా, కుడి కాల్వ 40 కిలోమీటర్ల పొడవు ఉంది. ఎడమ కాల్వ కింద సూర్యాపేట మండలం, పెన్‌పహాడ్‌ మండలాల్లోని పలు గ్రామాలు, కుడి కాల్వ కింద నకిరేకల్‌, కేతేపల్లి, వేములపల్లి మండలాల్లోని పలు గ్రామాలకు సాగునీరు అందతుంది. ప్రాజెక్టు కింద కుడి, ఎడమ కాల్వలతో సుమారు 30 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. ఆధునికీకరణ పనులు చేపడితే కుడి కాల్వ కింద 14,720 ఎకరాలు, ఎడమ కాల్వ కింద 15,290 ఎకరాలకు సాగు నీరు అందనుంది. ఆధునికీకరణ ద్వారా 34 గ్రామాల వ్యవసాయానికి సాగునీరు అందించవచ్చు.

మూసీ లీకేజీలను అరికడతాం : చంద్రశేఖర్‌, డీఈ

మూసీ ప్రాజెక్టు కుడికాల్వ లీకేజీలను అరికడుతాం. ప్రాజెక్టుల్లో నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు గేట్‌ల ద్వారా విడుదల చేస్తాం. అప్పుడు మరమ్మతులు చేయడం సులువు అవుతుంది. ఇప్పటికే గేట్ల మరమ్మతులకు రూ.28లక్షలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. అవి విడుదల కాగానే కుడికాల్వ తూము రిపేర్‌ పనులను కూడా చేపడతాం.

Updated Date - May 26 , 2026 | 11:50 PM