Share News

నిలిచిన సమీకృత మార్కెట్‌ పనులు

ABN , Publish Date - Feb 27 , 2026 | 11:52 PM

వినియోగదారులకు ఒకే చోట కూరగాయలు, పండ్లు, పూలు, మాంసం, చేపలు తదితరాలన్నీ ఒకేచోట లభించేందుకు గత ప్రభుత్వం సమీకృత మార్కెట్‌ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.

నిలిచిన సమీకృత మార్కెట్‌ పనులు
అసంపూర్తిగా నిలిచిన సమీకృత మార్కెట్‌ భవనం

(ఆంధ్రజ్యోతి-మిర్యాలగూడ అర్బన)

వినియోగదారులకు ఒకే చోట కూరగాయలు, పండ్లు, పూలు, మాంసం, చేపలు తదితరాలన్నీ ఒకేచోట లభించేందుకు గత ప్రభుత్వం సమీకృత మార్కెట్‌ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎన్నెస్పీ క్యాంప్‌లో 2022లో మార్కెట్‌ నిర్మాణానికి రూ.4.5కోట్ల అంచనా వ్యయం రూపొందించి టెండర్‌ ప్రక్రియద్వారా పనులు అప్పగించారు. అదే ఏడాది నిర్మాణ పనులకు పునాది పడింది. 2022-23 ఆర్థిక సంత్సరంలో మంజూరైన తొలివిడత నిధులతో పనులు ప్రారంభించారు. ఆ తరువాత ప్రభుత్వం మారడం, నిధుల విడుదలపై శీతకన్ను ప్రదర్శిస్తున్న నేపథ్యంలో సమీకృత మార్కెట్‌ నిర్మాణపనులకు నిధుల గ్రహణం పట్టుకుంది. దీంతో ఏడాదిలో పూర్తి కావాల్సి పనులు రెండున్నరేళ్లుగా పడకేశాయి.

జటిలమైన ట్రాఫిక్‌ సమస్య

పట్టణీకరణ విస్తరిస్తున్న క్రమంలో జనాభా సైతం పెరుగుతోంది. దీంతో నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్డెక్కుతున్నారు. వ్యాపార, వాణిజ్య కేంద్రాలతో పాటు పూలు,పండ్లు, కూరగాయలు, మాంసం విక్రయ కేంద్రాలు సైతం ఇదే రోడ్డుకు సమీపంలో ఉన్న నేతాజీ మార్కెట్‌, రైతుబజార్‌లో విస్తరించి ఉన్నాయి. ఆయా విక్రయ కేంద్రాలనుంచి ప్రజలు తమకు అవసరమైన నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా తోపుడుబండ్లు ఉండడం, వాహనాల పార్కింగ్‌తో రాకపోకల్లో అంతరాయం ఏర్పడుతోంది. ఈ క్రమంలో సాగర్‌, నల్లగొండ, కోదాడ రోడ్లపై ట్రాఫిక్‌ సమస్య మరింత జటిలంగా తయారైంది. ఈ సమస్యకు కొంతమేర పరిష్కారం చూపేందుకు సమీకృత మార్కెట్‌ను నిర్మాణం దోహదపడుతుందని మునిసిపల్‌ పాలకమండలి భావించి స్థలాన్ని కేటాయించింది. కానీ ఎన్నెస్పీ క్యాంపులో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్‌పనులు ఏళ్లతరబడి ముందుకు సాగకపోవడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ సమస్య యథాతథంగా కొనసాగుతోంది.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా...

మిర్యాలగూడ సమీకృత మార్కెట్‌ పనులు నిలిచిపోవడంతో ఆ ప్రదేశంలో పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి. ఈ భవనంలోకి కొందరు యువకులు రాత్రివేళలో ప్రవేశించి మద్యం, ధూమపానంతో కాలక్షేపం చేస్తున్నారు. చెట్లపొదల్లో గంజాయి వంటి మాదక ద్రవ్యాలను సైతం వినియోగిస్తున్నట్లుగా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమీకృత మార్కెట్‌ నిర్మాణ పనులపై ప్రజాప్రతినిధులు, మునిసిపల్‌ నూతన పాలకమండలి దృష్టిసారించి పూర్తిచేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ప్రస్తుత పరిస్థితిపై నివేదిస్తాం

సమీకృత మార్కెట్‌ భవన నిర్మాణ ప్రస్తుత పరిస్థితిపై నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తాం. కొంతకాలంగా నిధుల విడుదల చేయకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్‌ పనులను నిలిపివేశారు. పనులు మొదలయ్యేలా అధికారులు తగిన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం. ఈ ఏడాదిలోపు పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.

- జీ.శ్రీనివా్‌స,మునిసిపల్‌ కమిషనర్‌

Updated Date - Feb 27 , 2026 | 11:52 PM