Share News

పంచాయతీ కార్మికులకు బీమా భద్రత

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:51 AM

గ్రామ పంచాయతీ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవిత బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది.

పంచాయతీ కార్మికులకు బీమా భద్రత

సహజ, ప్రమాద మరణాల్లో కుటుంబాలకు ఆర్థిక ఆసరా

రెండు రకాల బీమా పాలసీలు

ఎంపీడబ్ల్యూ కార్మికులతో పాటు అదనపు కార్మికులకు వర్తింపు

పంచాయతీ నిధుల నుంచి ప్రీమియం చెల్లింపులు

(ఆంధ్రజ్యోతి, యాదాద్రి) : గ్రామ పంచాయతీ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవిత బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. గ్రామ పంచాయతీల్లో క్షేత్రస్థాయిలో పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల విభాగంతో పాటు వివిధ సేవలు అందిస్తున్న మల్టీపర్పస్‌ వర్కర్లతో పాటు పంచాయతీ అవసరాల కోసం అదనంగా నియమించిన కార్మికులకు బీమా సదుపాయం కల్పించనుంది. ఆయా పంచాయతీల్లో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బంది ప్రమాద, సహజ మరణాలు సంభవించినప్పుడు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు బీమా పాలసీ నమోదు చేయాలని పంచాయతీ కార్యదర్శులను, మండల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పంచాయతీల్లో అందుబాటులో ఉన్న నిధుల నుంచి బీమా ప్రీమియం చెల్లించాలని జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులు క్షేత్రస్థాయిలో విధుల నిర్వహిస్తున్న సందర్భాల్లో ప్రమాదాలబారిన పడటం, అనారోగ్య కారణాలతో మృతిచెందడం జరుగుతోంది. చాలీచాలని వేతనాలతో గ్రామస్థాయిలో సేవలు అందించే కార్మికులు మృతిచెందినప్పుడు కుటుంబాలు వీధిన పడుతున్నాయి. అటువంటి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు రకాల జీవిత బీమా పథకాలను వర్తింపజేయాలని నిర్ణయించింది. సహజ మరణాల్లో సైతం కుటుంబాలకు ఆసరా కల్పించేందుకు ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, సమగ్ర వ్యక్తిగత బీమా వర్తించే పోస్టాఫీస్‌ గ్రూప్‌ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స పథకంలో ప్రతి పంచాయతీ కార్మికుడిని నమోదు చేయించాలని నిర్ణయించారు. ఈ రెండు బీమా స్కీంలకు సంబంధించిన ప్రీమియంలను ఆయా పంచాయతీల నిధుల నుంచి కార్మికుల వ్యక్తిగత ఖాతాల ద్వారా చెల్లించనున్నారు.

సహజ మరణాలకు వర్తించే ‘పీఎం జీవన జ్యోతి’

గ్రామ పంచాయతీ కార్మికులు సహజ మరణం చెందినప్పుడు వారి కుటుంబాల కు ఆర్థిక భరోసా కోసం తక్కువ ప్రీమియంతో అందించే జీవిత బీమా పథకం ‘ప్రధాన మంత్రి జీవన జ్యోతి యోజన (పీఎంజేజేబీవై)’లో కార్మికుల పేరు నమో దు చేయించనున్నారు. ఈ పథకంలో నమోదైన పంచాయతీ కార్మికుడికి ఏడాదికి రూ.436 ప్రీమియం చెల్లించడం ద్వా రా ఏ కారణంతో మరణించినప్పటికీ రూ.2 లక్షల బీమా సొమ్ము ఆ కార్మికుడి కుటుంబానికి అందుతుంది. పంచాయతీల్లో పనిచేసే ఎంపీడబ్ల్యూ, ఇతర తాత్కాలిక కార్మికుల్లో 18-50 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి ఈ బీమా పాలసీ వర్తిస్తుంది. అందుకోసం బ్యాంకులో ఖాతా ఉండాలి. ఈ ఖాతా నుంచి ఏటా వార్షిక ప్రీమియం రూ.436 ఆటోమెటిక్‌గా డెబిట్‌ అవుతుంది. అయితే పంచాయతీ కార్మికులను ఈ బీమా పాలసీలో నమోదు చేసి, ఏటా ప్రీమియాన్ని వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయడం ద్వారా ప్రీమియం చెల్లింపులుచేయనున్నారు.

పోస్టాఫీస్‌ గ్రూప్‌ యాక్సిడెంటల్‌ ఇన్సూరెన్స

పంచాయతీ కార్మికులకు సహజ మరణాలకు వర్తించే బీమా పథకంతో పాటు ప్రమాదాలకు గురై మరణించినా, గాయపడినా ఆదుకునేందుకు పోస్టాఫీస్‌ గ్రూప్‌ యాక్సిడెంటల్‌ ఇన్సూరెన్స పథకం కూడా వర్తింపజేయనున్నారు. ఈ పథకంలో పంచాయతీ కార్మికులకు సంవత్సరానికి రూ.550 ప్రీమియం చెల్లించి పేరు నమోదు చేయనున్నారు. ఈ పాలసీలో నమోదైన కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం అందుతుది. ప్రమాదంలో శాశ్వత లేదా పాక్షిక వైకల్యానికి గురైనా రూ.10లక్షల కవరేజీ లభిస్తుంది. గాయపడి ఆస్పత్రిలో ఉంటే చికిత్స ఖర్చులకు రూ.1లక్ష అందిస్తారు. ఈ గ్రూప్‌ ఇన్సూరెన్స కోసం కార్మికులకు పోస్టాఫీస్‌, ఇండియా పోస్ట్‌ బ్యాంక్‌లో ఖాతా ద్వారా ప్రీమియం చెల్లింపులు చేస్తారు.

జిల్లాలో 3వేల మందికిపైగా ప్రయోజనం

గ్రామ పంచాయతీల్లో క్షేత్రస్థాయిలో వివిధ రకాల విధులు నిర్వహించే కార్మికులకు అందించే సుమారు 3వేల మంది కార్మికులకు ఈ బీమా పథకాలతో ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలో 247 గ్రామ పంచాయతీల్లో ఆయా గ్రామాల జనాభా ఆధారంగా 2,640 మంది మల్టీపర్పస్‌ వర్కర్లు(ఎంపీడబ్ల్యూ) విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయా పంచాయతీల అవసరాల మేరకు జిల్లా వ్యాప్తంగా మరో ఐదారు వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే ఆపదలో ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో అందిస్తున్న ఈ బీమా పథకాలను ఎంపీడబ్ల్యూ కార్మికులతో పాటు అదనంగా నియమితులైన కార్మికులకు సైతం వర్తింపజేయనున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా మూడు వేలమందికి పైగా కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది.

కార్మికులకు ఆర్థిక రక్షణ

గ్రామ పంచాయతీల్లో క్షేత్రస్థాయి సిబ్బంది ప్రమాదాల కారణంగా ఆర్థికంగా అభద్రతకు గురవుతున్నారు. ఆయా కుటుంబాలకు ఆర్థిక రక్షణ కోసం సామాజిక భద్రత కల్పించే బీమా పథకాలను ప్రభుత్వం వర్తింపజేస్తోంది. సహజ మరణాలకు వర్తించే పీఎం జీవన జ్యోతి బీమా యోజన, ప్రమాదాల బారిన పడినప్పుడు రక్షణ కల్పించే పోస్టాఫీస్‌ గ్రూప్‌ యాక్సిడెంటల్‌ ఇన్సూరెన్స పథకంలో పంచాయతీ కార్మికులను నమోదు చేయించి, అందుబాటులో ఉన్న పంచాయతీ నిధుల నుంచి ఈ రెండు పాలసీలకు ప్రీమియం చెల్లిస్తాం. ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేశాం.

కె.శ్రీనివా్‌సరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి

Updated Date - Jun 23 , 2026 | 12:51 AM