ఆ ఎస్‌ఆర్‌వోలో ఇంటి దొంగలు?
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:23 AM
నల్లగొండ డివిజన్‌లోని ఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఇద్దరు ఇంటి దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు విశ్వసనీయం సమాచారం. నకిలీ ఈసీలపై ఇప్పటికే కేటాయించిన ఒరిజినల్ ఈసీల నంబర్లు వేసి ఇస్తున్నారని, సదరు నకిలీ ఈసీల డబ్బును వీరు జేబుల్లో వేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఫేక్ ఈసీలు ఇస్తూ స్వాహా చేస్తున్న వైనం
ప్రభుత్వ ఖజనాకు గండి
అధికారులను పక్కనబెట్టి ఆ ఇద్దరివే సంతకాలు
ఒక ఒరిజినల్ ఈసీ నెంబరే మిగతా నకిలీ ఈసీలకు...
(ఆంధ్రజ్యోతి,నల్లగొండ): నల్లగొండ డివిజన్‌లోని ఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఇద్దరు ఇంటి దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు విశ్వసనీయం సమాచారం. నకిలీ ఈసీలపై ఇప్పటికే కేటాయించిన ఒరిజినల్ ఈసీల నంబర్లు వేసి ఇస్తున్నారని, సదరు నకిలీ ఈసీల డబ్బును వీరు జేబుల్లో వేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఎంతో విలువైన ఈసీలకు సంబంధించి ఆన్‌లైన్ ద్వారా ఫీజులు కట్టిన అనంతరం నిబంధనల మేరకు ఈసీ(ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్) ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా రియల్ ఎస్టేట్‌కు, ఆస్తుల కొనుగోలుకు, భూమి లేదంటే ఆస్తిపై ఎటువంటి చట్టపరమైన సమస్యలు, కోర్టు కేసులు, అప్పులు లేవని సమాచారం ఇచ్చేదే ఈసీ. బ్యాంకు లావాదేవీలు, విక్రయాలు, కొనుగోలుకు సంబంధించి ఒక్కోసారి 30 ఏళ్లకు సంబంధించిన సమాచారం కూడా ఈసీ ద్వారా తెలుస్తుంది. అయితే ఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు సంస్థ ఖజానాకే గండి పెడుతున్నారు. ఈసీ కావాలంటే మీ-సేవా కేంద్రాలు లేదా ఇతర ఆన్‌లైన్ ద్వారా రూ.550 చలానా కట్టి సదరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్తే ఈసీ ఇస్తారు. అయితే ఆ ఎస్‌ఆర్‌వో(సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు)లోని ఇద్దరు ఇంటి దొంగలు స్వలాభం కోసం ఫేక్ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నట్లు తెలిసింది. ఒకే నెంబర్ మీద రోజుకు పలు సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 70 నుంచి 100 వరకు ఈసీలకు దరఖాస్తులు వస్తే 30 ఈసీల ఫీజు ప్రభుత్వానికి చెల్లించి మిగతా 70 ఈసీలు నకిలీవి ఇచ్చి దానికి సంబంధించిన ఫీజును జేబులో వేసుకుంటున్నారు. ఈ నకిలీ 70 ఈసీలపై 30 ఒరిజినల్ ఈసీ నెంబర్లు కేటాయిస్తున్నట్టు తెలిసింది.
సబ్ రిజిస్ట్రార్ సంతకం సైతం ఆ ఇద్దరిదే
ఇటీవల ఓ ప్రధాన వాణిజ్య బ్యాంక్‌కు సంబంధించిన మేనేజర్ ఒక ఈసీ విషయంలో అనుమానం వచ్చి పరిశీలించినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని సంబంధితశాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి విచారణ చేయాలని కోరినట్లు కూడా చర్చ సాగుతోంది. బ్యాంకులో రుణం కోసం ఓ వినియోగదారుడు సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఈసీ తీసుకొని వెళ్లగా, ఆ ఈసీలో సంతకం సబ్‌రిజిస్ట్రార్‌ది కాదని సదరు బ్యాంక్‌మేనేజర్ గుర్తించారు.సబ్‌రిజిస్ట్రార్ వివిధ పనుల్లో బీజీగా ఉం టుండటంతో ఆయన సంతకాన్ని కాదని ఆ ఇద్దరే ప్రతిరోజు ఈసీలపై సంతకాలు చేస్తున్నట్టు సమాచారం. ఎంతో విలువైన ఈసీపై సంతకా లు చేయడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. సబ్ రిజిస్ట్రార్‌కు తెలియకుండానే ఈ తతంగం సాగిస్తున్నట్టు సమాచారం. ఒరిజినల్ ఈసీలపై సబ్‌రిజిస్ట్రార్ సంతకం చేస్తుండగా, ఫేక్ ఈసీలపై సదరు జూ నియర్ అసిస్టెంట్లు సంతకాలు చేస్తున్నట్లు సంబంధిత శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్తగా ఆస్తి కొనుగోలు సమయంలో మోసాలు జరగకుండా ఆస్తి ఎవరికి చెందుతుందో స్పష్టంగా తెలిపే ఈసీలను నకిలీవి జారీ చేస్తూ వేల రూపాయలు వారు సొమ్ము చేసుకుంటున్నారు.
ఆ ఎస్‌ఆర్‌వోలో నెలకొక్కరికి షిఫ్ట్ విధానం
రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా సెక్షన్లను సర్దుబాటు చేస్తే కొన్నాళ్ల వరకు వారితోనే నడిపిస్తారు. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు మాత్రమే మార్పులు చేయడం సహజం. అయితే రాష్ట్రంలో మిగతా సబ్ రిజిస్ట్రార్‌లకు భిన్నంగా సదరు రిజిస్ట్రార్ ఆఫీస్ మాత్రం ఈసీలు జారీ చేసే సెక్షన్‌ను నెలకొక్కరి చొప్పున వారిద్దరికే ఇస్తూ వస్తున్నారు. ఒకరికి ఒక నెల, మరొకరికి ఒక నెల ఈసీ సెక్షన్ ఇవ్వడంతో నకిలీ ఈసీల తతంగాన్ని నెలకొక్కరు పంచుకుంటూ లక్షల రూపాయలు గడిస్తున్నట్లు తెలుస్తోం ది. ప్రభుత్వ ఖజానాకు ఈసీ ఫీజు వెళ్లకుండా జేబుల్లోకి మళ్లించుకుంటున్నట్లు తెలిసింది. ఈ ఇద్దరు రెండు సంవత్సరాల క్రితం సదరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ కార్యాలయాలల్లో ఉన్నతాధికారులతో పాటు కింది స్థాయి ఉద్యోగులపై కర్ర పెత్తనం చేస్తున్నట్టు కూడా తెలిసింది. వారికి ఎంతో అండ ఉందని, తమను ఏమీ చేయలేర నే విధంగా సెక్షన్ల ఉద్యోగులను బెదిరిస్తూ ఈ నకిలీ ఈసీల ద్వారా పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీ-సేవా కేంద్రాల ద్వారా ఫీజు చెల్లిస్తే ప్రభుత్వానికి వెళ్తే వచ్చే ఉపయోగం ఏమి ఉండదని వినియోగదారులకు చెబుతూ కొంతమంది దళారులను సైతం నియమించుకొని ఎలాంటి ఫీజు చెల్లించకుండానే నేరుగా పాత ఈసీ నెంబర్లపై నకిలీ ఈసీ ఇస్తూ జోరుగా దందా సాగిస్తునట్టు చర్చ సాగుతోంది. సదరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమాలపై ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ఎం.రవీందర్‌రావును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, తాను తక్షణమే ఈ నకిలీ వీసీలపై విచారణ చేయిస్తానని తెలిపారు. బుధవారం సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విచారణ నిర్వహించి నకిలీ ఈసీలు ఉన్నట్టు గుర్తిస్తే సంబంధిత ఇద్దరు ఉద్యోగులపై శాఖాపర చర్యలు తీసుకుంటానని తెలిపారు.