ఇందిరా మహిళా శక్తి భవనం ప్రారంభానికి సిద్ధం
ABN , Publish Date - May 30 , 2026 | 12:01 AM
మహిళా సమభావన సంఘాలను అభివృద్ధి చేసి, మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తోంది.
రూ.5కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం పూర్తి
జిల్లా మహిళా సమాఖ్య సమావేశాలు.. శిక్షణకు ప్రత్యేక హాళ్లు
(ఆంధ్రజ్యోతి-భువనగిరి రూరల్): మహిళా సమభావన సంఘాలను అభివృద్ధి చేసి, మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తోంది. జిల్లాలోని సంఘాల ఆర్గనైజర్లు, మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ, జిల్లాస్థాయి సమావేశాల నిర్వహణకు ప్రతీ జిల్లాలో మహిళా భవనాలను నిర్మించారు.
జిల్లాలో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ ప్రాంగణంలో చేపట్టిన నిర్మాణం పూర్తయింది. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మహిళా వారోత్సవాల సందర్భంగా ఈ ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్2న ఈ భవనాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్చూవల్‌గా ప్రారంభించే అవకాశాలున్నాయని మహిళా సమాఖ్య సభ్యులు భావిస్తున్నారు.
రూ.5 కోట్లతో నిర్మాణం
జిల్లా కేంద్రంలో గ్రామ, మండల స్థాయి మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రాఽథమిక సభ్యులతో జిల్లాస్థాయి సమావేశాలు, శిక్షణ కోసం ఇందిరా మహిళాశక్తి భవనాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. రూ.5కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ భవనాలకు రూ.4.50కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయగా, రూ.50లక్షలను జిల్లా మహిళా సమాఖ్య నిధులనుంచి వ్యయం చేశారు. ఈభవనంలో మహిళా సంఘాల సభ్యుల విస్తృత సమావేశాలకు విశాలమైన హాల్‌తోపాటు జిల్లాస్థాయిలో మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వడానికి సైతం ప్రత్యేక హాల్ నిర్మించారు. జిల్లా సమాఖ్య కార్యకలాపాలను సైతం ఇందిర మహిళా శక్తి భవనం నుంచి నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా 17మండలాల్లో ప్రస్తుతం 1,560 మహిళా సంఘాలు ఉండగా, వాటిలో 15,212 మంది సభ్యులున్నారు. మహిళా సాధికారితకోసం ప్రభుత్వం అందిస్తున్న రుణసాయం వడ్డీలేని రుణాలతో ఈ మహిళా సంఘాలు వివిధ ఉత్పత్తులు, వ్యాపారాలను నిర్వహిస్తున్నాయి.
మహిళా సాధికారతకు ప్రభుత్వ ప్రోత్సాహం: కందుకూరి రేణుక, అధ్యక్షురాలు, జిల్లా మహిళాసమాఖ్య
ప్రభుత్వం మహిళా సాధికారతకు అనేక ప్రోత్సాహకాలను అందిస్తోంది. మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంగా స్వయం ఉపాధికి బ్యాంకు లింకేజీ, వడ్డీలేని రుణాలను అందిస్తోంది. మహిళలు స్వయంశక్తితో ఆర్థికంగా ఎదగడానికి కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చడమే కాకుండా, తగిన శిక్షణ అందిస్తున్నారు. అందులో భాగంగానే గ్రామస్థాయిలో మహిళా భవనాలతోపాటు జిల్లాస్థాయిలో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మాణం చేపట్టారు.