ఆదాయం ఫుల్.. వసతులు నిల్
ABN , Publish Date - May 14 , 2026 | 12:23 AM
కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ప్రతీ ఆదివారం జరిగే పశువుల సంత జిల్లాలోనే రెండో అతి పెద్ద సంత. సంత ద్వారా గ్రామపంచాయతీకి కోట్లలో ఆదాయం సమకూరుతున్నా ఇక్కడ కనీస వసతులు కనబడడం లేదు.
కొండమల్లేపల్లి సంతలో వసతులు లేక ఇబ్బందులు
ఏడాదికి రూ.3.80కోట్ల ఆదాయం
షెడ్డు లేక.. నిలువ నీడ లేక అవస్థలు
కొండమల్లేపల్లి, మే 13 (ఆంధ్రజ్యోతి): కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ప్రతీ ఆదివారం జరిగే పశువుల సంత జిల్లాలోనే రెండో అతి పెద్ద సంత. సంత ద్వారా గ్రామపంచాయతీకి కోట్లలో ఆదాయం సమకూరుతున్నా ఇక్కడ కనీస వసతులు కనబడడం లేదు. ఉమ్మడి జిల్లాకు చెందిన రైతులతో పాటు చుట్టుపక్కల ఉన్న నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, గుంటూరు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పశువుల క్రయ విక్రయదారులు కొండమల్లేపల్లి పశువుల సంతకు వస్తుంటారు. దీంతో ప్రతీ ఆదివారం జరిగే పశువుల సంత క్రయ విక్రయాలతో కిటకిటలాడుతోంది.
కోట్లలో ఆదాయం ఉన్నా..
కొండమల్లేపల్లి పశువుల సంత హైదరాబాద్-నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై ఉండడంతో ఇక్కడ పశువుల క్రయ విక్రయాలు అధికంగా జరుగుతాయి. దీంతో గ్రామపంచాయతీకి సంత నుంచి కోట్లలో ఆదాయం వస్తోంది. మంచినీటి సౌకర్యం లేక దూర ప్రాంతాల నుంచి వచ్చే క్రయ విక్రయదారులు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినపరిస్థితి. దీంతో చేసేది లేక నీటిని కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి. ఇక మూగ జీవాల పరిస్థితి తాగునీరు లేక దుర్భరంగా మారింది. మౌలిక సదుపాయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంతకు వచ్చే మహిళా రైతులకు మరుగుదొడ్లు లేకపోవడంతో వారి వ్యధ వర్ణణాతీతం. అంతేకాకుండా వేసవి కాలం కావడంతో తీవ్రమైన ఎండలో నిలబడలేక.. కనీసం నిలువ నీడ లేకపోవడంతో ఎండలోనే రైతులు ఉండాల్సిన పరిస్థితి. వసతులు కల్పించాలని పలుమార్లు అధికారులను కోరినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని క్రయ విక్రయదారులు వాపోతున్నారు. కోట్లలో ఆదాయం ఉన్నప్పటికి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, ఇప్పటికైన అధికారులు సంతకు వచ్చే క్రయ విక్రయదారులు, రైతులకు అన్ని రకాల వసతులు కల్పించాలని కోరుతున్నారు.
టెండరింగ్‌లో గోల్ మాల్
2016 నుంచి 2025 వరకు సంత కాంట్రాక్ట్ ఒకే వ్యక్తి వివిధ పేర్లతో ఎలాంటి టెండర్ లేకుండా దక్కించుకుని సొమ్ము చేసుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రతీ సంవత్సరం గ్రామపంచాయతీ కార్యాలయం ద్వారా ఓపెన టెండర్ పద్ధతిన సంత నిర్వహణ దక్కించుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా అధికారుల అండదండతో, అధికారుల చేతులు తడిపి దాదాపు 10సంవత్సరాల్లో సంత వేలం పాట జరగకుండా ఒక్కరికే అప్పజెప్పడంతో అధికారుల తీరుపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంవత్సరం నూతన పాలకవర్గం ఏర్పడినాక సంత వేలంపాట ఖచ్చితంగా నిర్వహించాలని పాలకవర్గం సభ్యులు తీర్మానించి సంత వేలంపాటను ఈ ఏడాది ఫిబ్రవరి 25న నిర్వహించారు. ఇందులో రికార్డు స్థాయిలో రూ.3.80కోట్లకు నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన వర్కాల భాస్కర్‌రెడ్డి అత్యధికంగా పాట పాడి టెండర్‌ను దక్కించుకున్నారు. గత సంవత్సరం రూ.1.22కోట్లు మాత్రమే ఉండడం, ఈ సారి మాత్రం రికార్డు స్థాయిలో మూడు రెట్లు ఆదాయం గ్రామపంచాయతీకి రావడం గమనార్హం.
కబ్జా చెరలో సంత భూమి
‘గేదెను కొని తాడును కొనేందుకు భయపడినట్లు’గా ఉంది కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం తీరు. పశువుల సంతకు చెందిన భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణం చేయకపోవడంతో సుమారు కోట్లు విలువ చేసే భూమి కబ్జాకు గురైంది. అయినప్పటికీ అధికారులు కానీ, పాలకవర్గం కానీ, ప్రజాప్రతినిధులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇలానే వ్యవహరిస్తే ఉన్న భూమి సైతం కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉందని పలువురు వాపోతున్నారు. గతంలో వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుని పశువుల సంతను నిర్వహించే వారు. 2007 సంవత్సరంలో అప్పటి సర్పంచ రమావత తారారవికుమార్ పాలకవర సభ్యులు గ్రామపంచాయతీ నిధుల నుంచి సుమారుగా రూ.12లక్షలు వెచ్చించి పట్టణానికి సమీపంలో చుట్టుపక్కల గ్రామాలకు అనువుగా ఉన్న సర్వే నెం.128లో 1.39 ఎకరాలు అంటే సుమారుగా రెండు ఎకరాల పట్టా భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేశారు. కానీ భూమి చుట్టు కంచె, హద్దులు ఏర్పాటు చేయకపోవడంతో దాదాపు అర ఎకరం భూమిని సమీప వ్యక్తులు ఆక్రమించుకుని నిర్మాణాలు చేసుకున్నారు. ఇదంతా పాలకవర్గం, అధికారులకు తెలిసినా కాని తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. భూమిని కొనుగోలు చేశాక నలుగురు సర్పంచులు మారినప్పటికీ కంచె ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ఇప్పటికైనా నూతన పాలకవర్గం కబ్జాకు గురైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని సంత భూమి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
తాగునీరు, షెడ్డు ఏర్పాటు చేయాలి
-పెద్దిశెట్టి సత్యం, కొండమల్లేపల్లి
వేసవి కాలం కావడంతో సంతలో తాగునీరు లేకపోవవడం, నీడ కోసం షెడ్డు లేక పశువుల క్రయ విక్రయాల కోసం వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళా రైతులు మరుగుదొడ్లు లేకపోవడంతో త్రీ ఇబ్బందులు పడుతున్నారు. నీటి తొట్టిలను ఏర్పాటు చేసి పశువుల దాహార్తిని తీర్చాలి, సంతలో మౌలిక సదుపాయాలు కల్పించాలి.
తగిన చర్యలు తీసుకుంటాం
-డాకునాయక్, పంచాయతీ కార్యదర్శి, కొండమల్లేపల్లి
సంతలో వసతులు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశిస్తాం. జిల్లాలో పెద్ద సంతలలో ఒకటైన కొండమల్లేపల్లిలో అన్ని వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటాం. సంత భూమి కబ్జాకు గురైనట్లు మా దృష్టికి రావడంతో సర్వే నిమిత్తం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేశాను. త్వరలోనే సర్వే చేయించి చుట్టూ కంచె ఏర్పాటు చేస్తాం. సంత భూమిని ఎవరైన కబ్జా చేస్తే చర్యలు తీసుకుంటాం.