ఆదాయం ఫుల్.. వసతులు నిల్
ABN , Publish Date - Mar 05 , 2026 | 12:29 AM
కొండమల్లేపల్లి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): పశువు లు, మూగ జీవాల క్రయ విక్రయాలకు కొండమల్లేపల్లి సంత పేరుగాంచింది.
ఇబ్బందులు పడుతున్న క్రయ విక్రయదారులు
చర్యలు చేపట్టని అధికారులు
ఇదీ కొండమల్లేపల్లి పశువుల సంత పరిస్థితి
కొండమల్లేపల్లి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): పశువు లు, మూగ జీవాల క్రయ విక్రయాలకు కొండమల్లేపల్లి సంత పేరుగాంచింది. ప్రతీ ఆదివారం జరిగే సంతకు ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మరియు దూర ప్రాంతాల నుంచి క్రయవిక్రయదారులు ఇక్కడకు వస్తుంటారు. దీంతో పెద్ద సంఖ్యలో మూగజీవాలను తీసుకొని పురుషులు, మహిళలు సంతకు వస్తుంటారు. సంత నిర్వహణ వేలంపాట ద్వారా ఒక సంవత్సరానికి సుమారు రూ.1.30 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఈ స్థాయిలో సంత ఆదాయం సమకూరుతున్నా సంతలో వసతులు మాత్రం లేవు. వేసవి కాలం కావడంతో నిలువ నీడ లేకపోవడంతో అసౌకర్యాల మధ్య సంతకు వచ్చే క్రయవిక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రతి ఏడాది చెబుతున్న అధికారులు మాటలతోనే సరిపెడుతున్నారు. నిబంధనల ప్రకారం సంతలో మౌలిక వసతులు కల్పిస్తేనే రైతు నుంచి రుసుము వసూలు చేయాలి. కానీ అవేవి లేకుండానే గ్రామపంచాయతీ పాలకవర్గం, అధికారులు, ఆదేశానుసారం కాంట్రాక్టర్ ఒక మేకకు రూ.150, పశువుకు రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో సంతకు వచ్చే మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.
ఆక్రమణకు గురైన సంత భూమి
గతంలో వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని పశువుల సంత నిర్వహించే వారు. 2007 సంవత్సరంలో అప్పటి సర్పంచ్ రమావత్ తారా రవికుమార్ పాలకవర్గం సభ్యుల చొరవతో గ్రామపంచాయతీ నిధుల నుంచి సుమారుగా రూ.12 లక్షలు వెచ్చించి పట్టణానికి సమీపంలో మండల కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డు నుంచి నల్లగొండకు వెళ్లే బైపాస్ రోడ్డులో చుట్టు పక్కల గ్రామాలకు అనువుగా ఉండే విధంగా సర్వే నెం.128లో 1.39 ఎకరాల భూమిని (దాదాపు రెండు ఎకరాల పట్టా భూమి)ని ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేశారు. కానీ భూమి చుట్టూ హద్దులు, కంచె ఏర్పాటు చేయకపోవడతో సమీప వ్యక్తులు కొందరు దాదాపు 20 గుం టల భూమిని ఆక్రమించుకొని ఇంటి నిర్మాణాలు చేపట్టారు.
ఇదంతా అప్పటి అధికారులు, పాలకవర్గానికి తెలిసినా తమకేమీ ప ట్టనట్లుగా వ్యవహరించారనే ఆరోపణ లు ఉన్నాయి. సంత భూమిని కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ముగ్గురు సర్పంచులు మారినా సంత సంత భూమికి హద్దు లు గుర్తించలేకపోవడం, చు ట్టు కంచె ఏర్పా టు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక ముందు కూడా ఇలానే ఉంటే ఉన్న భూమి మొత్తం కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉందని పట్టణవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నూతనంగా ఏర్పడిన పాలకవర్గం చొరవ తీసుకొని సంత భూమిని సర్వే చేసి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.