సన్న బియ్యమూ తీసుకోలే..
ABN , Publish Date - May 07 , 2026 | 11:38 PM
జాతీయ ఆహార భద్రత పథకం కింద పేదకుటుంబాలకు అందిస్తున్న సన్న బియ్యానికి సైతం కొంతమంది ఆసక్తి చూపడం లేదు.
రేషన్‌దుకాణాల వైపుచూడని 38,492 కార్డుదారులు
మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ పూర్తి
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి) : జాతీయ ఆహార భద్రత పథకం కింద పేదకుటుంబాలకు అందిస్తున్న సన్న బియ్యానికి సైతం కొంతమంది ఆసక్తి చూపడం లేదు. సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి విద్యుత్ బిల్లుల మాఫీకి ఉపయోగపడతాయ నే కారణంతో ఆహార భద్రతాకార్డులను పోటీపడి తీసుకున్న లబ్ధిదారులు బియ్యం తీసుకెళ్లేందుకు మాత్రం అంతగా ఆసక్తిచూపడం లేదు. దీంతో అర్హతా ప్రమాణాలు పాటించకుండా ఆహార భద్రతా కార్డుల పంపిణీ కారణంగా అనర్హులకు సైతం పెద్దసంఖ్యలో కార్డు లు జారీ చేశారనే విమర్శలు వస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా భారత ఆహార సంస్థ గోదాముల్లో పేరుకుపోతున్న బి య్యం నిల్వలను తగ్గించి, కొత్త నిల్వలకు అవకాశం కల్పించేందుకు మూడు మాసాలకు సం బంధించిన బియ్యం కోటాను ముందస్తుగా పం పిణీ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఏప్రి ల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఏప్రిల్ 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో రేషన్ దుకాణాల్లో పంపిణీకి చర్యలు తీసుకున్నా రు. దాదాపు నెల రోజుల పాటు రేషన్ దుకాణాల్లో ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేసిన ప్పటికీ గణనీయ సంఖ్యలో ఆహార భద్రత కార్డుదారులు బియ్యం తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. దీంతో అనర్హులకు సైతం కార్డుల జారీ కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని అధికారవర్గాలు భావిస్తున్నాయి.
బియ్యం తీసుకోని కార్డుదారులు 15.35శాతం
జిల్లాలో ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసిన సన్నబియ్యాన్ని 15.35శాతం కార్డుదారులు తీసుకెళ్లలేదు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నిబంధనల మేరకు అందించాల్సిన ఆహార భద్రతా కార్డులను, అనర్హులకు జారీ చేయడమే అందుకు కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో దాదాపు సగం జనాభాకు ఆహార భద్రత కార్డులు ఉన్నాయనే విషయం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీలు, 427 గ్రామ పంచాయతీల పరిధిలో 2,50,789 ఆహార భద్రతా కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల్లో సుమారు 8,35,060 మంది లబ్ధిదారులుగా నమోదయ్యారు. ఒక్కొక్కరికి నెలకు ఆరు కిలోల చొప్పున ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీచేస్తోంది. జిల్లాలో 515 రేషన్ దుకాణాలు ద్వారా బియ్యం పంపిణీకి 15,031.035 మెట్రిక్ టన్నులు నెలనెలా కేటాయింపులు చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు మూడు మాసాల కోటాను ముందస్తుగా పంపిణీకి చర్యలు తీసుకున్నారు. ఏప్రిల్, మే, జూన్ మాసాలకు చెందిన సన్న బియ్యాన్ని రేషన్ దుకాణాల్లో ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు నెలరోజుల పాటు పంపిణీ చేశారు. మొత్తం కార్డుదారులు 2,50,789 మంది ఉండగా, ఈ బియ్యాన్ని 2,12,297మంది తీసుకున్నారు. మిగతా 38,492 మంది కార్డుదారులు అసలు రేషన్ దుకాణం ముఖమే చూడలేదు. సుమారు 15.35శాతం మంది రేషన్‌దుకాణాల్లో పంపిణీ చేస్తున్న సన్న బియ్యం తీసుకునేందుకు ఆసక్తి చూపకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిలో ఏ కొద్దిమంది మాత్రమే స్థానికంగా లేకపోవడంతో తీసుకెళ్లలేదని కారణంగా భావించినా, ఎక్కువ మంది మాత్రం సంక్షేమ పథకాల లబ్ధికోసమే ఆహార భద్రతా కార్డులను తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జిల్లాలో ఆహార భద్రత పథకం ఇలా..
రేషన్ దుకాణాలు : 515
రేషన్ కార్డులు : 2,50,789
లబ్ధిదారులు : 8,35,057
మూడు మసాల
బియ్యం కోటా : 15,031.035 ఎం.టీ
బియ్యం తీసుకున్న
లబ్ధిదారులు : 2,12,297 ఎం.టీ
బియ్యం తీసుకోని
లబ్ధిదారులు : 38,492