ధాన్యం నిల్వ చేసేదెలా?
ABN , Publish Date - May 09 , 2026 | 12:17 AM
యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి దాదాపు నెలరోజులు కావొస్తున్నా.. ప్రక్రియ మాత్రం గాడిన పడలేదు. జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో తూకాల్లో జాప్యంతో ధాన్యం బస్తాలు పేరుకుపోతున్నాయి.
కొనుగోళ్లలో జాప్యానికి ప్రధాన సమస్య గోదాముల కొరతే
కొనుగోళ్ల లక్ష్యం 4.50 లక్షల మెట్రిక్ టన్నులు..
గోదాముల సామర్ద్యం మాత్రం 2 లక్షల మెట్రిక్ టన్నులే..
గోదాముల కోసం అధికార యంత్రాంగం యత్నాలు
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి దాదాపు నెలరోజులు కావొస్తున్నా.. ప్రక్రియ మాత్రం గాడిన పడలేదు. జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో తూకాల్లో జాప్యంతో ధాన్యం బస్తాలు పేరుకుపోతున్నాయి. తూకం వేయని ధాన్యం రాశుల వద్ద రైతులు రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. సహనం నశించి రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ప్రతిరోజు జిల్లాలో ఎక్కడో.. ఓ చోట రైతులు, రాజకీయ పార్టీల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయడానికి అధికార యంత్రాంగం ఎన్ని కసరత్తులు చేసినా.. క్షేత్రస్థాయిలో కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ చేయడానికి అవసరమైన సామర్థ్యం మేర గోదాముల కొరత పట్టిపీడిస్తోంది. జిల్లాలో ఏటికేడు వరిసాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. వానాకాలం, యాసంగి తేడా లేకుండా ధాన్యం దిగుబడి సైతం గణనీయంగా పెరుగుతోంది. అయితే సేకరించిన ఈ ధాన్యాన్ని నిల్వచేయడానికి తగినంత సామర్ధ్యంగల మౌలికమైన గోదాములను సమకూర్చుకోవడంలో ముందుచూపు కొరవడటం ప్రధాన సమస్యగా మారింది. ఏటా కోతల సీజన్‌లో కొనుగోళ్లు జాప్యమవుతుండడంతో రైతుల ఆందోళన సాధారణ సమస్యగా మారింది. ప్రతీసారి కొనుగోళ్ల అప్పుడు మాత్రమే అటు ప్రజాప్రతినిధులకు, ఇటు అధికారులకు ధాన్యం నిల్వలకు గోదాముల కొరత అనే సమస్య జ్ఞాపకం వస్తోంది. దీంతో రైతుల ఆందోళనలు..అధికారుల ఉరుకులు, పరుగులు పరిపాటిగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మిల్లుల వద్ద దిగుమతులే ప్రధాన సమస్య
యాసంగి సీజన్‌లో వానాకాలం కంటే అధిక విస్తీర్ణంలో వరి సాగైంది. జిల్లాలో 3.14 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. ఇందులో స్థానిక అవసరాలు, మిల్లర్లు, ట్రేడర్లు కొనుగోలు చేసే లక్ష మెట్రిక్ టన్నులను మినహాయించి 4.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యం. ఈమేరకు జిల్లావ్యాప్తంగా 357 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, 312 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. ఈ నెల 6వ తేదీ వరకు జిల్లాలో 72,806 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేశారు. ఇందులో 62,119 టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ఎగుమతులు చేశారు. అయితే ధాన్యం సేకరణ లక్ష్యంలో 20 శాతం లోపు కూడా పూర్తికాక ముందే మిల్లర్ల వద్ద ధాన్యం దిగుమతికి సమస్యలు ఉత్పన్నం కావడం..దీంతో మిల్లుల వద్ద దిగుమతి సరిపడా నిల్వలకు గోదాముల వసతి లేక లారీల దిగుమతిలో జాప్యం జరుగుతోంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు వెంటవెంటనే తరలించడానికి అవరోధం ఏర్పడుతోంది. తూకం వెంటవెంట వేయకపోవడంతో రైతులు కల్లాల్లో తమ ధాన్యం రాశులతో రోజుల కొద్ది పడిగాపులు కాయాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి.
పేరుకుపోతు న్న ధాన్యం నిల్వలు
జిలా ్లలో యాసం గి ధాన్యం సేకరణ లక్ష్యం 4.50 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ మేరకు సేకరణకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ, సేకరించిన ధాన్యా న్ని నిల్వ చేయడానికి మిల్లర్ల వద్ద తగి న సామర్థ్యం లేదు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ప్రైవేట్ గోదాములతోపాటు మిల్ల ర్ల వద్ద గల వాస్తవ నిల్వ సామర్థ్యంతో అందుబాటులోగల గోదాములు కేవలం 2 లక్షల మెట్రిక్ టన్నులే. అయితే అందుబాటులోగల గోదాములకు రెట్టింపు సంఖ్య లో ధాన్యం కల్లాల్లో పేరుకుపోతుండటంతో ధాన్యం నిల్వలు అధికార యం త్రాంగానికి పెద్దసమస్యగా మారింది. జిల్లాలో 38 రైస్ మిల్లులున్నాయి. వీటి కి ఈ సీజన్‌లో 2.90లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించాలని లక్ష్యంగా పెట్టారు. అయితే తమ వద్ద గత రెండు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ ధాన్యమే 3.40లక్షల మెట్రిక్ టన్నులు నిల్వలు ఉన్నందున అంత ధాన్యం దిగుమతి చేసుకోలేమని ముందస్తుగానే అధికారులకు తెలిపారు. అధికారులు, మిల్లర్ల మధ్య చర్చలు జరిగి దాదాపు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతికి అంగీకరించారు. అందులో సైతం 50వేల మెట్రిక్ టన్నులకు ఇంటర్మీడియేట్ (ప్రైవేట్) గోదాముల్లో నిల్వలు చేయడానికి అనుమతించాలని కోరారు. దీంతో ప్రస్తుతం మిల్లర్ల వద్ద లక్ష మెట్రిక్ టన్నులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల గోదాముల్లో 22వేల మెట్రక్ టన్నుల, స్టేట్‌వేర్ హౌసింగ్ గోదాముల్లో 3వేల టన్నులు, ప్రైవేట్ గోదాముల వద్ద 40 వేల మెట్రిక్ టన్నులు మొత్తంగా 65వేల మెట్రక్ టన్నుల గోదాములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక మిల్లర్ల వద్ద లక్ష మెట్రిక్ టన్నులు కలుపుకుంటే మొత్తంగా కేవలం 1.65లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు మాత్రమే ప్రస్తుతం కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతికి అందుబాటులో ఉన్నాయి. మరో 2.85లక్షల టన్నుల ధాన్యం నిల్వలకు గోదాముల కొరత ఏర్పడింది. ఈ గోదాముల కొరత కారణంగానే ధాన్యం కొనుగోళ్లు జాప్యానికి ప్రధాన కారణంగా భావించిన అధికారులు జిల్లాలో అందుబాటులోగల ప్రైవేట్ పరిశ్రమలు, ఇతర వ్యాపారుల గోదాములకోసం గాలింపులు చేపడుతున్నారు. ప్రైవేట్ గోదాముల్లో ధాన్యం నిల్వ చేయడం ద్వారానే కల్లాల్లో ధాన్యం వెంటనే ఎగుమతులు చేసి, కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది.
జిల్లా యాసంగి ధాన్యం సేకరణ ప్రణాళిక
జిల్లాలో వరిసాగు విస్తీర్ణం : 3,14,621 ఎకరాలు
ధాన్యం దిగుబడి అంచనా : 5,50,000 మెట్రిక్ టన్నులు
స్థానిక అవసరాలు, కొనుగోళ్లు : 1,00,000 మెట్రిక్ టన్నులు
ప్రభుత్వ సేకరణ లక్ష్యం : 4,50,000 మెట్రిక్ టన్నులు
మే6వ తేదీ వరకు కొనుగోళ్లు : 72,806 మెట్రిక్ టన్నులు
మే6 మిల్లులకు ఎగుమతి : 62,119 మెట్రిక్ టన్నులు