Share News

ఆ విత్తనాలను అరికట్టేదెలా?

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:06 AM

గత సీజన్‌లో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలకు తెలియకుండానే ఓ వరి రకం విత్తనాలు మార్కెట్‌లోకి వచ్చాయి. అసలు ఈ రకం విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.

ఆ విత్తనాలను అరికట్టేదెలా?

మార్కెట్‌లోకి కేఎన్‌ఎం-12510 రకం వరి విత్తనాలు

పరిశోధన పూర్తికాక ముందే లూజ్‌గా లభిస్తున్న రకాలు

గత సీజన్‌లో సేద్యం చేసిన పలువురు రైతులు

నల్లగొండ, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): గత సీజన్‌లో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలకు తెలియకుండానే ఓ వరి రకం విత్తనాలు మార్కెట్‌లోకి వచ్చాయి. అసలు ఈ రకం విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. పెద్దపల్లి జిల్లా కూనారం మండలంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ పరిశోధన కేంద్రంలో కేఎన్‌ఎం-12510 అనే వరి రకం విత్తనాలపై పరిశోధన జరుగుతోంది. ఈ పరిశోధనా సమమయంలోనే జిల్లాలో పలువురు రైతులు కేఎన్‌ఎం-12510ను పోలిన రకం విత్తనాలు వినియోగించారు. అయితే ఈ విత్తనాలు వినియోగించిన ప్రాంతా ల్లో కొందరు రైతులు దిగుబడి బాగానే వచ్చిందని చెబుతుండగా, మరికొంత మంది దిగుబడి తగ్గిందంటున్నారు. వాస్తం ఏదైనప్పటికీ జిల్లాలో ఈ రకం వరి విత్తనాలు లూజ్‌గా దొరకడం, వాటిని రైతులు సేద్యం చేయడంపై వ్యవసాయ అధికారులతో పాటు శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

మోసపోయిన రైతులకు ఆర్థిక నష్టాలు

జిల్లాలోని పలుచోట్ల కేఎన్‌ఎం-12510 వరి రకం లూజ్‌ సీడ్స్‌ కొనుగోలు చేసి రైతులు సాగు చేశారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లింది. ఈ రకం వరి విత్తనాలకు ప్రభుత్వ ధ్రువీకరణ లేదు. అదేవిధంగా ధ్రువీకరణ లేని లూజ్‌ సీడ్స్‌ వినియోగించడంతో దిగుబడి తగ్గడంతో పాటు నాణ్యత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఈ ధాన్యం కొనుగోలును ఐకేపీ నిర్వాహకులు తిరస్కరించినట్టు తెలిసింది. ఓ వైపు మార్కెటింగ్‌ లేక మరో వైపు ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం వ్యవసాయ అధికారుల దృష్టికి వచ్చిన వెంటనే కేఎన్‌ఎం-12510 లూజ్‌ సీడ్స్‌ కొనుగోలు చేయకుండా వ్యవసాయశాఖ రైతులను అప్రమత్తం చేసింది. ప్రభుత్వ అనుమతి పొంది, ధ్రువీకరించిన విత్తనాలు మాత్రమే సాగు చేయాలని వ్యవసాయశాఖ రైతులకు అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. అయితే అసలు ఈ విత్తనాలు మొత్తంగా లూజ్‌గానే దొరుకుతున్నాయి. పెద్దపల్లిలోని పరిశోధనా కేంద్రం నుంచి ఈ విత్తనాలకు సంబంధించిన మినీ కిట్లను కూడా ఇప్పటి వరకు మార్కెట్‌కు విడుదలచేయలేదు. ఎక్కడా రైతులకు మినీ కిట్లను పంపిణీ చేయక ముందే అవే రకం విత్తనాలు ఎలా వచ్చాయనే దానిపై స్పష్టత లేదు. కనీసం బ్యాగుల్లో కూడా ఈ విత్తనాలు పంపిణీ చేయకుండా, ఎలాంటి ముద్రలు లేకుండా లూజ్‌ విత్తనాలు మార్కెట్‌కు వస్తుండటం గమనార్హం.

శాస్త్రవేత్తలు ఏమన్నారంటే..

ఈ విషయమై కంపాసాగర్‌ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త శ్రీధర్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, అసలు కేఎన్‌ఎం-12510 రకాన్ని పెద్దపల్లిలోని జయశంకర్‌ వ్యవసాయ పరిశోధనా కేంద్రం నుంచి విడుదల చేయలేదని స్పష్టం చేశారు. ఆ విత్తనాలు కేఎన్‌ఎం-12510 రకాన్ని పోలి ఉండటాన్ని గుర్తించామని, ఈ విషయం ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. మరో ఏడాది వరకు పెద్దపల్లి పరిశోధనా కేంద్రం నుంచి ఈ రకం విత్తనాలు విడుదలయ్యే ప్రసక్తి లేదని, వాటిని పోలిన లూజ్‌ విత్తనాలు రైతులు వినియోగించవద్దని సూచించారు.

అన్నం వండి చూసి తిరస్కరించిన మిల్లర్లు

కేఎన్‌ఎం-12510 విత్తనాలు సాగుచేసి దిగుబడి వచ్చిన తరువాత ధాన్యాన్ని చాలా మంది రైతులు ఐకేపీ కేంద్రాలకు తీసుకెళ్లగా కొనుగోలు చేయకపోవడంతో సదరు రైతులు మిల్లర్ల వద్దకు వెళ్లారు. అయితే ఐకేపీలో కొనుగోలు చేయకపోవడంతో అనుమానం వచ్చిన మిల్లర్లు ఆ ధాన్యం సన్నగా కన్పిస్తున్నా ఏదో తేడా అనిపించడంతో ఓ ప్రాంతంలోని మిల్లర్లు ఈ రకం ధాన్యాన్ని పట్టిన తరువాత బియ్యంతో అన్నం వండారు. అయితే ఈ అన్నం రుచిగా లేకపోవడంతో పాటు రంగు మారినట్టు ఉండటంతో ఈ రకం ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు తిరస్కరించారు. అయితే ఎంతో అంతా తగ్గించి కొనుగోలు చేయాలని రైతులు కోరడంతో క్వింటాకు రూ.400 నుంచి రూ.500 వరకు ధర తగ్గించి మిల్లర్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది. కేఎన్‌ఎం-12510 రకాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసిన మిల్లర్లు ఆ తరువాత ఇతర ధాన్యంతో కలిపి బియ్యంగా మార్చి విక్రయించినట్టు తెలిసింది.

మొత్తంగా ఊరు పేరు లేని విత్తనాలు లూజ్‌గా లభించగానే నాణ్యమైనవిగా భావించిన రైతులు కొనుగోలుచేశారు. తీరా వాటిని సాగుచేశాక పంటచేతికొచ్చాక ఆర్థికంగా నష్టపోయారు. బీపీటీ మాదిరిగానే కేఎన్‌ఎం-12510 రకం విత్తనాలు కన్పిస్తుండటంతో రైతులు లూజ్‌ విత్తనాలను కొనుగోలుచేసి సాగు చేయడం ద్వారా నష్టపోయారు.

Updated Date - Jun 04 , 2026 | 12:06 AM