Share News

పనితీరు ఎలా ఉంది

ABN , Publish Date - Oct 28 , 2026 | 11:53 PM

నిఘా వర్గాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సర్వే నిర్వహిస్తున్నాయి. ప్రజా ప్రభుత్వ, ప్రజాప్రతినిధుల పనితీరుపై ఆరా తీస్తున్నారు. మండలంలోని ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లో 30 మంది నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అందులో అన్ని వర్గాల వారు ఉండేలా చూస్తున్నారు.

పనితీరు ఎలా ఉంది

ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులపై నిఘా వర్గాల సర్వే

గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ..

ఎమ్మెల్యే, మంత్రులు, ప్రభుత్వ పనితీరుపైనా

అభివృద్ధి, పథకాల అమలుపై ఆరా

ప్రతీ మండలం నుంచి ఐదు గ్రామాల్లో

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట): నిఘా వర్గాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సర్వే నిర్వహిస్తున్నాయి. ప్రజా ప్రభుత్వ, ప్రజాప్రతినిధుల పనితీరుపై ఆరా తీస్తున్నారు. మండలంలోని ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లో 30 మంది నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అందులో అన్ని వర్గాల వారు ఉండేలా చూస్తున్నారు. వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి? సర్వే ఆధారంగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగుల నుంచి వృద్ధుల వరకు, పెన్షన్లర్ల నుంచి రైతుల వరకు వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వానికి నివేదిక అందాక ప్రభుత్వం ఆయా అంశాలపై సమగ్రంగా సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తోంది. దీంతో ప్రభుత్వ పాలనపై నిఘావర్గాల చేత ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు ఎమ్మెల్యే లు, ఎంపీలు, మంత్రుల పనితీరుపై సర్వేలు చేసి నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం. నివేదికలోని అంశాలను పరిశీలించి కొంతమంది పనితీరు బాగా లేదని, మరికొంత మంది పనితీరు మార్చుకోవాల్సిన అవసరముందని సంబంధిత ప్రజాప్రతినిధులకు సూచించారు. అంతేకాక త్వరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వాస్తవాలను తెలుసుకునేందుకు సర్వే చేయిస్తున్నారు. అంతేకాక మూడేళ్లుగా ప్రభుత్వం అనేక సంక్షే మ అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది. దీంతో స్థానికంగా ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం నెలకొందనే విషయాన్ని నిఘా వర్గాల ద్వారా సేకరించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. దాంతో పాటు ఆయా నియోజకవర్గాలలో వివిధ పార్టీల నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థుల విషయంలోనూ ప్రజల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

సర్వే ఆధారంగా..

నిఘావర్గాల సర్వే ఆధారంగా ప్రభుత్వ పనితీరును తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థుల పనితీరును తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల పనితీరును సర్వేల ద్వారా తెలుసుకొని రాబోయే ఎన్నికల్లో ఆయా నియోజక వర్గాల నుంచి సంబంధిత అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వాలా వద్దా అనే విషయాలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పనితీరు, ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ఆయా నియోజక వర్గాల్లో పలు సర్వే బృందాల చేతసర్వేలు చేయించి నివేదిక తెప్పించుకున్నారు. రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న సందర్భంలో నిఘావర్గాల ద్వారా నివేదికను తెప్పించుకుంటున్నారు. దీని ఆధారంగా ఎన్నికలు ఏవిధంగా ఎదుర్కొవాలో ముందస్తుగా చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైతే దానిని అధిగమించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

విధుల ఒక చోట.. సర్వే మరోచోట

ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నియోజకవర్గాలల్లో కొన్నిరోజులుగా నిఘా వర్గాలు సర్వే నిర్వహించే పనిలో నిఘా వర్గాలు నిమగ్నమయ్యాయి. పారదర్శకమైన సర్వే కోసం ఒక నియోజకవర్గంలో విధులు నిర్వహించే ఇంటిలిజెన్స్‌ సిబ్బందిని మరో నియోజకవర్గంలో సర్వే నిర్వహించేందుకు కేటాయించారు. వారి నివేదిక ఆధారంగా ప్రభుత్వం రాబోయే ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అంతేకాక ఆయా నియోజక వర్గాల్లోని అభ్యర్థుల విషయంలో కూడా నిఘా వర్గాలు అందించే నివేదికను పరిశీలించే అవకాశాలు లేకపోలేదు.

మండలానికి ఐదు గ్రామాల చొప్పున..

ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో నిఘా వర్గాలు ప్రతీ మండలంలో ఐ దు మేజర్‌ పంచాయతీల్లో సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రతి మం డలం నుంచి ఐదు మేజర్‌ గ్రామపంచాయతీలను ఇంటిలిజెన్స్‌ అధికారులు గుర్తించారు. అధికారులు గుర్తించారు. సంబంధిత గ్రామాలల్లో నిఘా వర్గాల సిబ్బంది సర్వే కొనసాగిస్తున్నారు.

ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ పనితీరుపై..

ఎమ్మెల్యే, మంత్రులు, ప్రభుత్వ పనితీరు విషయాలను సర్వేలో నిఘావర్గాలు సేకరిస్తున్నాయి. మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజల నుంచి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉండే ఆదరణను తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో రాష్ట్ర ఇంటిలిజెన్స్‌ వర్గాలు ఒక్కో పార్టీ నుంచి ఒక అభ్యర్థి పేరును సూచిస్తూ, వారికి ప్రజల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాలను నమోదు చేస్తున్నారు.

ప్రతీ గ్రామంలో 30 మంది అభిప్రాయాలు

నిఘావర్గాలు మండలంలోని 5 గ్రామాలలో సర్వే చేస్తుండగా 30 ఏళ్లు మొదలుకొని 60ఏళ్లుపైబడిన వృద్ధుల వరకు సర్వే కొనసాగిస్తున్నారు. ప్రతీ గ్రామంలో 25 నుంచి 30 మంది నుంచి నిఘావర్గాలు వివిధ అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నాయి. సర్వేలో నిరుద్యోగులు, రైతులు, కూలీలు, ఉద్యోగులు, పెన్షనర్లు, సంఘ బంధం సభ్యులు, దివ్యాంగులతో పాటు మరికొన్ని వర్గాల వారితో ముచ్చటించి వివరాలు రాబడుతున్నారు. స్థానికంగా చేసిన సర్వే నివేదికను జిల్లా ఇంటిలిజెన్స్‌ వర్గాలకు అందిస్తున్నారు. అనంతరం రాష్ట్ర ఇంటిలిజెన్స్‌ వర్గాలకు నివేదికలు వెళ్లగానే ఆయా నివేదికలను ప్రభుత్వానికి అందించే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Oct 28 , 2026 | 11:53 PM