Share News

నేటి నుంచి గృహగణన

ABN , Publish Date - May 11 , 2026 | 12:14 AM

జనాభా లెక్కల్లో కీలకమైన గృహగణనకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు గృహగణనకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది.

నేటి నుంచి  గృహగణన

జూన్‌ 9 వరకు కొనసాగనున్న హౌస్‌ లిస్టింగ్‌, హౌస్‌ సెన్సస్‌ నమోదు

స్వీయగణన ద్వారా జిల్లాలో 17,728 ఇళ్ల నమోదు

గృహగణనలో మరో 4.85లక్షల ఇళ్ల నమోదుకు అవకాశం

(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ): జనాభా లెక్కల్లో కీలకమైన గృహగణనకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు గృహగణనకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. గృహగణన తర్వాత 2027, ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రాష్ట్రంలో కీలకమైన జనగణన ప్రక్రియ కొనసాగుతుంది.

నేటినుంచి మొదలయ్యే హౌస్‌ లిస్టింగ్‌, హౌజ్‌ సెన్సె్‌సకు అధికార యంత్రాంగం సన్నాహాలు పూర్తిచేసింది. ఈ దఫా గతంలో ఎన్నడూ లేని విధంగా స్వీయగణనకు అవకాశం కల్పించి ఏప్రిల్‌ 26 నుంచి మే 10వరకు అవకాశం కల్పించారు. నేటి నుంచి నిర్వహించే ఇళ్ల గణన నిమిత్తం ఇప్పటికే ఎంపిక చేసిన ఎన్యూమరేటర్లకు జిల్లాలో శిక్షణ సైతం ముగిసింది. గత పదహారేళ్ల క్రితం 2011లో చేసిన జనగణనను పూర్తిగా మాన్యువల్‌ పద్ధతులలో నిర్వహించగా, ఈదఫా డిజిటల్‌ మోడ్‌లో ట్యాబ్‌లను వినియోగించి అందులో గణనల వివరాలు నమోదు చేయనుండడం ఈ జనాభా లెక్కల ప్రత్యేకతగా చెబుతున్నారు.

సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌లో 17,728 కుటుంబాల నమోదు

జనగణనలో ఈదఫా స్వీయగణనకు అవకాశమివ్వడంతో జిల్లాలో ఏప్రిల్‌ 26నుంచి మే 10 వరకు ప్రభుత్వ ఉద్యోగులు, విద్యావంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. జిల్లాలో ఈ నెల 10వ తేదీ సాయంత్రం వరకు 17,728 మంది తమ ఇళ్ల వివరాలను వెబ్‌పోర్టల్‌లో స్వీయగణన ద్వారా నమోదు చే సుకున్నారు. ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి వరకు నమోదుకు అవకాశం ఉండడంతో ఈ సంఖ్య మరికొంత పెరిగే అవకాశముంది. స్వీయగణన చేసుకున్నవారికి వారి మెయిల్‌కు వచ్చిన ఈఎ్‌సఐడీ (సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ ఐడీ)ని భద్రపరుచుకోవాలి. నేటినుంచి గృహగణనకు వచ్చే ఎన్యూమరేటర్లకు ఈ ఐడీని తెలియజేస్తే వారు దాని ప్రకారం ఆ గృహ వివరాలను నమోదు చేసి ధృవీకరిస్తారు. సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ లేక అధికారులు నమోదుకు వచ్చినప్పుడు ఇచ్చే ఫొన్‌నెంబరే జనగణన పూర్తయ్యే వరకూ వినియోగించాలి.

జిల్లాలో 5,03,000 కుటుంబాల గణన

జిల్లాలో ఇప్పటికే పూర్తయిన సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ సహా జనగణన వరకు మొత్తం 5,03,000 ఇళ్లను లెక్కించాల్సి ఉంటుందని అంచనా వేశారు. మొత్తం 9,94,000 జనాభా ఉంటుందని ప్రాథమికంగా నిర్థారించారు. జిల్లా లో జనగణన కార్యక్రమానికి ప్రిన్సిపల్‌ ఛార్జ్‌ ఆఫీసర్‌గా కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ వ్యవహరిస్తారు. 41 బ్లాకులుగా విభజించిన జనగణనలో 41 మంది చార్జ్‌ ఆఫీసర్లను నియమించారు. క్షేత్రస్థాయిలో జనగణనకు 3,179 మంది ఎన్యూమరేటర్లను నియమించగా, 531 మందిని రిజర్వ్‌ లో పెట్టారు. మొత్తం 3,780 మంది సిబ్బంది నేరుగా ఇళ్లగణన, జనగణనలో పాల్గొంటారు. స్వీయగణనలో నమోదైన దాదాపు 18వేల ఇళ్లు మినహా మిగిలిన దాదాపు 4,85,000 ఇళ్లకు ఎన్యూమరేటర్లు వెళ్లి హౌస్‌ లిస్టింగ్‌, హౌస్‌ సెన్సెస్‌ నమోదు చేస్తారు. ఈ సందర్భంగా మొత్తం 33 రకాల అంశాలపై వివరాలను ఎన్యూమరేట ర్లు నమోదు చేయాల్సి ఉంటుంది. గృహగణనకు వచ్చిన వారికి అన్ని వివరాలను తెలియజేయాలని అధికారులు కోరుతున్నారు. ఇంటి వివరాల చాఫ్టర్‌ కింద ఇంటి నెంబరు మొదలుకొని ఇళ్ల తీరు, ఇంటి స్థితి, ఇంట్లో ఉండే కుటుంబాల వివరాలు, ఇంట్లో నివసించే వ్యక్తుల వివరాలు, సామాజికవర్గం, వైవాహిక స్థితి తదితర వివరాలన్నింటినీ నమోదు చేస్తారు. రెండో చాఫ్టర్‌లో ఇంటివద్ద ఉన్న సౌకర్యాల వివరాలను నమోదు చేస్తారు. ఇందులో తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్డి, మురుగు నీటి వ్యవస్థ, బాత్‌రూంలు, వంటగది, వంట చేసే ఇంధనం, తదితర వివరాలను నమోదు చేస్తారు. మూడో చాఫ్టర్‌లో డిజిటల్‌ యాక్సెస్‌ వివరాల కింద రేడియో, టీవీ, ఇంటర్నెట్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌, ఫోన్ల వివరాలు, సైకిల్‌, మోటర్‌సైకిల్‌, మోపెడ్‌, కార్లు, జీపులు, వ్యాన్ల వివరాలు నమోదుచేస్తారు. చివరగా ఇతర వివరాల కింద కుటుంబ సభ్యులు ప్రధానంగా తినే ఆహారానికి సంబంధించిన ధాన్యం వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు ఇంటిపెద్ద మొబైల్‌ నెంబర్‌ను నమోదు చేస్తారు. ఈ మొబైల్‌ నెంబర్‌ జనగణన పూర్తయ్యే వరకూ అదే నెంబర్‌ని వినియోగించాల్సి ఉంటుంది.

అందరూ పాల్గొని వివరాలందించాలి : శ్రీనివాస్‌ నాయక్‌, జిల్లా ప్రణాళికా అధికారి

జనాభా లెక్కల కార్యక్రమంలో భాగంగా చేపట్టే ఇళ్ల గణన నేటినుంచి ప్రారంభమవుతుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ గణనకు ప్రజలంతా సహకరించాలి. ఈ రోజు నుంచి జూన్‌ 9 వరకు హౌస్‌ లిస్టింగ్‌, హౌస్‌ సెన్సెస్‌ నిమిత్తం ఎన్యూమరేటర్లు ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు వారికి ఇళ్ల వివరాలు తెలియజేయాలి. అదేవిధంగా ఇటీవల స్వీయగణన చేసుకున్నవారు తమకు వచ్చిన ఐడీని తెలియజేస్తే దాన్ని ట్యాబ్‌లో ఎంట్రీచేసి వారి వివరాల నమోదును ఎన్యూమరేటర్లు ధృవీకరిస్తారు. జిల్లాలో ఎన్యూమరేటర్లకు ఇప్పటికే శిక్షణ పూర్తయింది. సెన్సెస్‌ వివరాలన్నీంటినీ ట్యాబ్‌లలో నమోదు చేయడం ద్వారా దేశచరిత్రలో మొదటిసారి డిజిటల్‌ రూపంలో జనాభా లెక్కల వివరాలు నమోదవుతున్నాయి.

Updated Date - May 11 , 2026 | 12:14 AM