ముమ్మరంగా ఇంటిపన్ను వసూళ్లు
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:23 AM
చౌటుప్పల్ మునిసిపాలిటీలో ఇంటి పన్ను వసూళ్ల డ్రైవ్ ముమ్మరంగా కొన సాగుతోంది.
90 శాతం టార్గెట్
చౌటుప్పల్ టౌన, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): చౌటుప్పల్ మునిసిపాలిటీలో ఇంటి పన్ను వసూళ్ల డ్రైవ్ ముమ్మరంగా కొన సాగుతోంది. ఈ నెల 31వ తేదీ లోపల టార్గెట్ రీచ అయ్యేందుకు ఇంటి పన్ను వసూళ్లలో సిబ్బంది నిమగ్నమయ్యారు. మునిసిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రామ్‌రెడ్డి పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలు వసూళ్లు చేస్తున్నాయి. ఈ బృందాల్లో 25మంది సిబ్బంది ఉన్నారు. రూ.814.66 లక్షల పన్నులకు గాను రూ.482.80 లక్షలు వసూలు చేశారు. ఇప్పటి వరకు 61.68 శాతంగా నమోదు జరిగింది. మునిసిపాలిటీలోని 20 వార్డుల్లో నివాసగృహాలు 7,468, వ్యాపార సంస్థలు 982, మిక్స్‌డ్ 545 ఉన్నాయి. గత సంవత్సరం 72శాతం ఇంటి పన్నులను వసూలు చేయగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 31 నాటికి 90 శాతంగా ఇంటి పన్నులు వసూళ్లు చేయాలని లక్ష్యంగా సిబ్బంది శ్రమిస్తున్నారు.
ఎన్నికలతో వసూళ్లకు కొంత బ్రేక్...
గత నెలలో నిర్వహించిన మునిసిపాలిటీ ఎన్నికలతో ఇంటి పన్నుల వసూళ్లకు కొంత అంతరాయం ఏర్పడింది. నెల రోజుల పాటు సిబ్బంది మొత్తం ఎన్నికల నిర్వహణలోనే ఉండడంతో వసూళ్లు చేయలేకపోయారు. ఎన్నికల్లో జరిగిన అంతరాయాన్ని అధిగమించేందుకు సిబ్బంది ప్రతీ రోజు ఉదయం 6గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇంటి పన్నులను వసూలు చేస్తున్నారు. ఒక్కో ఇంటికి ఐదారు సార్లు తిరిగి మరీ వసూలు చేస్తున్నారు.
90 శాతం వసూళ్లే లక్ష్యం
ఈ నెల 31 వ తేదీ వరకు మునిసిపాలిటీలో 90 శాతం ఇంటి పన్నులను వసూళ్లు చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని రెవెన్యూ అధికారి డి.అంజయ్య తెలిపారు. సంవత్సరాలుగా ఇంటి పన్నులను చెల్లించ కుండా మొండి బకాయిలుగా ఉన్న వారికి రెడ్ నోటీసులను జారీ చేస్తున్నామని, ఆ నోటీసులకు స్పందించకుంటే సదరు వ్యక్తుల ఆస్తులను జప్తు చేస్తామని ఆయన తెలిపారు. రెడ్ నోటీ్‌సలు జారీ చేసిన వారిలో ఒకరు ఇంటి పన్ను చెల్లించారని ఆయన తెలిపారు. మిగిలిన వ్యక్తులు కూడా చెల్లించేందుకు కొద్ది రోజుల సమయం కోరినట్టు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి పన్ను చెల్లించి మునిసిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.