Share News

ఉద్యాన రైతుల ఊగిసలాట..!

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:21 AM

దాదాపు 20 ఏళ్ల క్రితం భారతదేశంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లా బత్తాయి తోటల సాగులో మొదటి స్థానంలో ఉండేది. సుమారు 4లక్షల ఎకరాల్లో బత్తాయి సాగు చేసిన రైతులు ప్రస్తుతం దీనస్థితిలో ఉండిపోయారు.

ఉద్యాన రైతుల ఊగిసలాట..!

తోటల ఎంపికలో సందిగ్ధం

బత్తాయి తోటలపై నిరాసక్తత

ప్రస్తుతం ఆయిల్‌ఫాంను ప్రోత్సహిస్తున్న సర్కార్‌

మార్కెట్‌ ధరలల్లో అనిశ్చితి

పెట్టుబడుల భారంతో రైతుల దిగాలు

(ఆంధ్రజ్యోతి-నల్లగొండ): దాదాపు 20 ఏళ్ల క్రితం భారతదేశంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లా బత్తాయి తోటల సాగులో మొదటి స్థానంలో ఉండేది. సుమారు 4లక్షల ఎకరాల్లో బత్తాయి సాగు చేసిన రైతులు ప్రస్తుతం దీనస్థితిలో ఉండిపోయారు. అనేక సమస్యలు, సవాళ్ల మధ్య తోటల సాగు చేయలేక ఉమ్మడి జిల్లాలో 45వేల ఎకరాలకు పండ్ల తోటలు పడిపోయాయంటే రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.

జిల్లాలో రానురాను అసలు పండ్ల తోటల సాగు మనుగడ ఉంటుందా? లేదా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఉద్యాన రైతులకు ప్రధానంగా మార్కెట్‌ ధరలలో వ్యత్యాసం, అనిశ్చితి, వాతావరణంలో మార్పులు, తోటలకు తెగుళ్లు వంటి సమస్యలతో పాటు పెట్టుబడుల భారం గణనీయంగా పెరగడంతో రైతులు సందిగ్ధంలో పడిపోతున్నారు. పండ్ల తోటలకు సంబంధించి దిగుబడి చేతికొచ్చే సమయానికి ధరలు పడిపోవడంతో తీవ్ర నష్టాలు వాటిల్లుతున్నాయి. ముఖ్యంగా బత్తాయి కాయ దిగుబడి వచ్చే సమయంలో ఏమి రేటు ఉంటుందనే దానిపై కూడా స్పష్టత రావడంలేదు. చాలా చోట్ల బత్తాయి తోటలను తొలగిస్తున్న రైతులు వరి సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. గత కొద్ది రోజుల క్రితం క్రాప్‌ బుకింగ్‌లో 2025-26 సంవత్సరంలో ఏకంగా జిల్లావ్యాప్తంగా 4వేల ఎకరాల్లో బత్తాయి తోటలను తొలగించి వరిసేద్యం చేపట్టారు.

తోటల ఎంపికపై రైతుల అయోమయం

జిల్లాలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, సమస్యలు, తెగుళ్లు పెట్టుబడుల భారం మార్కెటింగ్‌ సమస్యతో ఏతోట లు వేయాలన్న దానిపై రైతులు అయోమయంలో పడ్డారు. ప్రభుత్వం సైతం జిల్లా పరిస్థితులకు అనుగుణంగా రైతుల ను ప్రోత్సహించకుండా రాష్ట్రస్థాయిలో అన్ని జిల్లాలో ప్రభు త్వం చెప్పిన విధంగా ఏదో ఒక ఉద్యానపంటల సాగును ప్రణాళికలో పెట్టి దానికే ప్రోత్సాహం ఇస్తుంది. దీంతో రైతు లు అయోమయంలో పడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు టార్గెట్‌ను అధిగమించడానికి ఉద్యాన శాఖ అధికారులు ప్రభుత్వం ఏ తోటలు పెట్టాలంటే ఆ తోటకే ప్రోత్సా హం ఇస్తున్నారు. ప్రస్తుతం బత్తాయి, నిమ్మ, మామిడి తోటతోపాటు ఇతర ఉద్యాన తోటలకు ఎలాంటి ప్రోత్సాహంలేదు. కేవలం ఆయిల్‌పామ్‌ సాగునే ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. సాంప్రదాయ పంటలా, వాణిజ్య పంటలా? అనే దానిపై రైతులకు ఎటూ పాలుపోని పరిస్థితి నెలకొంది. వరి సాగుతో పోలిస్తే మామిడి, బత్తాయి, కూరగాయల వంటి ఉద్యాన పంటలు అధిక ఆదాయాన్ని ఇస్తాయని అధికారు లు, శాస్త్రవేత్తలు గతంలో అధికారులు పదేపదే అవగాహన కల్పించినప్పటికీ ఆయిల్‌పామ్‌ సాగుచేస్తే అధిక ఆదాయం ఉంటుందని రైతులకు చెబుతున్నారు. అసలు ఏ తోటలు సాగు చేయాలనే దానిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 22వేల నుంచి 25వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగవుతున్నట్లు సమాచారం. అయితే ఆయిల్‌పామ్‌కు నీటి వనరులు సమృద్ధిగా ఉంటే ప్రయోజనం ఉంటుంది. ఒక్కో ఆయిల్‌పామ్‌ మొక్కకు రోజుకు 250లీటర్ల వరకు నీటి అవసరం ఉంటుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం అంతంతే..

వాస్తవానికి అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం ఉద్యాన పంటల సాగు కు నామ మాత్రంగానే ఉంది. ప్రస్తుతానికి ఆయిల్‌పామ్‌ సాగుకే ప్రోత్సాహం లభిస్తుండ గా బత్తాయి, నిమ్మ, మామిడి, కూరగాయల సాగు కు ప్రోత్సాహం నామ మాత్రంగానే ఉంది. స్థానికం గా డిమాండ్‌ ఉన్న పండ్ల తోటలు సాగు చేయా లా?, లేదంటే కూరగాయలు సాగు చేయాలనే దానిపై అనిశ్చితి నెలకొంది. ప్రభుత్వం సైతం మార్కెట్‌ను అధ్యయనం చేయడంతోపాటు నేల స్వభావానికి తగ్గట్లుగా సాగును ప్రోత్సహించే అవకాశం లేదు. కొత్త తోటల పెంపకానికి, పందిరి కూరగాయల సాగుకు రాయితీలతో పథకాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం తప్ప నిధులు కేటాయింపు లేకుండా పోతుంది. దీనికితోడు రాయితీపై పంపిణీ చేసే బిందు సేద్యం పరికరాలపై సైతం 10శాతం చొప్పున పెంచి రైతులపై భారం మోపింది. అంటే రాయితీని తగ్గించి అన్నివర్గాల రైతులకు భారం కలిగేలా జీవోను జారీచేసింది. పండ్లతోటలు దెబ్బతిని, పంట నష్టం జరిగితే వాతావరణ ఆధారిత పంటల బీమాను అమలు చేయాల్సిన ప్రభుత్వాలు ఆ వైపుగా చర్యలు తీసుకోవడంలేదు. కరోనా సమయంలో బత్తాయి ఎగుమతి లేక రైతులు పూర్తిగా నష్టపోయారు. ఉద్యాన శాఖ అధికారులు దగ్గర ఉండి కిలోల చొప్పున మార్కెట్లలో బత్తాయి విక్రయించేలా ఏర్పాటు చేసినా రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. దీనికితోడు నల్లగొండలో కోల్డ్‌ స్టోరేజీతోపాటు బత్తాయి జ్యూస్‌ను ఏర్పాటు చేస్తానన్న ప్రభుత్వ హామీ ఇప్పటివరకు నెరవేరలేదు. దీంతో నల్లగొండలో ఏర్పాటు చేసిన బత్తాయి మార్కెట్‌ ప్రస్తుతం జాడా లేకుండా పోయింది. అంతో ఇంతో సాగవుతున్న బత్తాయి రైతులు దళారుల చేతిలో ఆర్థికంగా నష్టపోతున్నారు. చాలామంది రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఉద్యాన రైతులకు భారీ ప్రోత్సాహకాలు ఇస్తే తప్ప ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బత్తాయి తోటలతోపాటు ఇతర తోటలవల్ల పూర్వవైభవం వచ్చే అవకాశాలుంటాయి. లేదంటే రానురాను ఉద్యాన తోటలు కనుమరిగయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

తోటల విస్తరణకు ఆటంకాలు ఉన్నాయి ...

నల్లగొండ జిల్లాతోపాటు, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో కూడా పండ్ల తోటలో విస్తరణకు ఆటంకాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో వారు ఏ పంట చెప్తే ఆ పంటనే సాగు చేయిస్తున్నాం. అయితే ఆ తోటల విస్తరణవల్ల భవిష్యత్‌లో దిగుబడులు వచ్చి లాభాలు వస్తాయని గ్యారెంటీగా చెప్పలేం. ప్రస్తుతం మూడు జిల్లాల్లో ఆయిల్‌పామ్‌ సాగు ప్రోత్సహిస్తున్నాం. మిగతా పండ్ల తోటలకు ప్రోత్సాహం లేదు.

- ఉమ్మడి జిల్లా ఉద్యాన శాఖలో ఓ అధికారి

Updated Date - Jun 01 , 2026 | 12:21 AM