బడ్జెట్ సమావేశాలపై ఆశలు
ABN , Publish Date - Mar 16 , 2026 | 12:35 AM
శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికాగా, ఈ నేపథ్యంలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాలపై ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఉమ్మడి నల్లగొండ జిల్లా అంశాలు ప్రస్తావించాలని కోరుతున్న ప్రజలు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికాగా, ఈ నేపథ్యంలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాలపై ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించిన పథకాలు, ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లో నిధులిస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
ఉమ్మడి జిల్లాలో సాగు, తాగునీరు, విద్య, వైద్యరంగాల్లో చేపట్టాల్సిన పనులకు పెద్దపీట దక్కుతుందని ప్రజలు భావిస్తున్నారు. నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా ఎమ్మెల్యేలంతా ప్రస్తుత బడ్జెట్‌లో జిల్లాకు తగిన నిధులు వచ్చేలా కృషి చేయాలని కోరుతున్నారు.
కీలక సాగునీటి పథకాలకు నిధులు!
ఉమ్మడి జిల్లా వరప్రదాయినిగా భావించే ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం పనులను 2028 జూన్ నా టికి పూర్తిచేస్తామని మంత్రులు దృఢసంకల్పంతో ఉండగా, అవసరమైన నిధులు రూ.1000 కోట్ల వర కు ఈ బడ్జెట్‌లో కేటాయించాల్సి ఉంది.
జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో 3లక్షల ఎకరాలకు సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకం పూర్తికి అవసరమైన ఏదుల-డిండి అనుసంధా న ప్రాజెక్టుతో పాటు, ఈ ప్రాజెక్ట్ కింద పెండింగ్‌లో ఉన్న రిజర్వాయర్ల నిర్మాణాలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇటీవల ఏదుల నుంచి నీటిని సేకరించే అంశంలో వివాదాస్పదంగా మారిన ఈఎన్‌సీ సిఫార్సులను రద్దుచేస్తూ ఈ సమావేశాల్లో ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. 8 నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరందించే బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా ప్రధానంగా కాల్వల నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు నిధులు ఇవ్వాల్సి ఉంది. సుమారు రూ.300కోట్ల మేర మంజూరు చేస్తే ఈ పథకం పూర్తిస్థాయిలో పూర్తవుతుంది.
సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు సాగునీరు అందించే ఎస్‌ఆర్‌ఎస్పీ రెండోదశ కాల్వల ఆధునికీకరణకు నిధులివ్వాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
దేవాదుల ఎత్తిపోతల పథకం నుంచి తుంగతుర్తి నియోజకవర్గంలో సుమారు 30వేల ఎకరాలకు నీరందించే కాల్వల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఈ పనులకు నిధులు మంజూరు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం మంజూరు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.
మూసీ కాల్వలైన ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాల్వల ఆధునికీకరణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నెల్లికల్లు ఎత్తిపోతల పథకం, మిర్యాలగూడ నియోజకవర్గంలోని తోపుచర్ల, కేశవాపురం, దామరచర్ల, వీర్లపాలెం, దున్నపోతులగండి ఎత్తిపోతల పథకాల పూర్తికి నిధులు కేటాయించి వచ్చే వానాకాలం నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.
ఫ అన్ని నియోజకవర్గాల్లో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల పనులను వేగవంతం చేసి వచ్చే విద్యాసంవత్సరానికి అందుబాటులోకి తెచ్చేందుకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని భావిస్తున్నారు.
ఫ చౌటుప్పల్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మునుగోడులో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు మంజూరు చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. కోదాడలో ప్రభుత్వ బాలికల జూనియర్, డిగ్రీ కళాశాలలు మంజూరు చేయాల్సి ఉంది.
ఫ మోత్కూరులో అద్దె భవనాల్లో అరకొర సదుపాయాల నడుమ నడుస్తున్న గురుకులానికి సొంత భవనం నిర్మించేందుకు కేటాయించాల్సి ఉంది. అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు సొంత భవనాల నిర్మాణానికి నిధులివ్వాలని, దీనిపై ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు చర్చించాలని ప్రజలు కోరుతున్నారు.
ఫ అన్ని మండల కేంద్రాల్లో 30 పడకల ఆస్పత్రులు, నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడకల ఆస్పత్రులు నిర్మించేందుకు ఈ సమావేశాల్లో కార్యాచరణ ప్రకటిస్తారని భావిస్తున్నారు. భువనగిరిలో జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల నిర్మించేందుకు నిధులపై ఈ సమావేశాల్లో చర్చించాలని కోరుతున్నారు.
ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కీలకమైన రహదారులకు నిఽధులు మంజూరైనా పనులు సాగడం లేదు. ఆ పనులు సకాలంలో పూర్తయ్యేలా అవసరమైన నిధులు ఈ బడ్జెట్‌లో కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అసంపూర్తిగా నిలిచిన, నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు పంపిణీచేయని డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ఫ భువనగిరి ఖిల్లా, పోచంపల్లి శ్రీరామానందతీర్థ గ్రామీణాభివృద్ధి సంస్థ, కొలనుపాకతో పాటు దేవరకొండ ఖిల్లా, వాడపల్లి ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే పథకాన్ని ఈ బడ్జెట్‌లో ప్రకటిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.