Share News

అలా పట్టుకొని.. ఇలా వదిలేశారు

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:56 AM

ఇసుక అక్రమ రవాణా, మైనింగ్‌ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ ఆదేశించారు. దీంతో జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా పోలీస్‌, స్పెషల్‌బ్రాంచ్‌ బృందాలు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నాయి.

అలా పట్టుకొని.. ఇలా వదిలేశారు

పట్టుకుంది ఎస్బీ.. వదిలేసింది పోలీసులు!

నెలవారీ మామూళ్లు, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీస్‌

అక్రమ దందాలో పొలిటికల్‌ మార్క్‌

మిర్యాలగూడ అర్బన్‌, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ఇసుక అక్రమ రవాణా, మైనింగ్‌ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ ఆదేశించారు. దీంతో జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా పోలీస్‌, స్పెషల్‌బ్రాంచ్‌ బృందాలు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నాయి. అందులో భాగంగా మిర్యాలగూడ మండల పరిధిలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న నాలుగు ట్రాక్టర్లను గురువారం అర్ధరాత్రి స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు పట్టుకొని రూరల్‌ పోలీసులకు స్వాధీనపరిచారు. పట్టుబడిన ఇసుక ట్రాక్టర్లు రాజకీయ నేతలకు సంబంధించినవి కావడం, వారినుంచి పోలీసులకు నెలవారీ మామూళ్లు అందుతున్న నేపథ్యంలో ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వదిలేసినట్లు సమాచారం. నియోజకవర్గంలోని పాలేరు, మూసీ నదినుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఈ క్రమంలో రాజకీయ నేతలు ఇసుకాసురుల అవతారమెత్తి సహజ సంపదను కొల్లగొడుతున్న నేపథ్యంలో ఇసుక కొరత తీవ్రతరమవుతోంది.

ప్రైవేట్‌ వారికి విక్రయించి..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అనుమతులు పొందిన అక్రమార్కులు ప్రైవేటు వ్యక్తులకు విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. ఈ దందా కొన్నాళ్లుగా లాభదాయకంగా ఉండడంతో అక్రమార్కుల పంట పడుతోంది. అక్రమార్కుల ఆగడాలకు పోలీసులు అండగా నిలుస్తున్న క్రమంలో ఇసుక, మట్టి దందా నిరాటంకంగా కొనసాగుతోంది. దీనిపై ఎస్పీకి ఫిర్యాదులందడంతో నియంత్రణ చర్యలు చేపట్టాలని పోలీస్‌, స్పెషల్‌బ్రాంచ్‌ శాఖలను అప్రమత్తం చేసి మౌఖిక ఆదేశాలు జారీచేశారు. అయితే మిగతా పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇసుక, ఎర్రమట్టి అక్రమ రవాణా నియంత్రచర్యలు చేపడుతున్నప్పటికీ మిర్యాలగూడ మండల పరిధిలో అందుకు భిన్నంగా పోలీస్‌ అధికారులు పనిచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు, నెలవారీ మాముళ్లకు తలొగ్గి ఎస్పీ ఆదేశాలు సైతం బేఖాతర్‌చేసి ఎస్బీ పోలీసులు పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను వదిలేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై విచారించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Mar 07 , 2026 | 12:56 AM