Share News

ఆమెకు ఆరోగ్య పరీక్షలు

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:17 AM

స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యుల ఆరోగ్య భద్రత లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర ఆరోగ్య సేవలు అందించనుంది.

  ఆమెకు ఆరోగ్య పరీక్షలు

తొలుత స్వయం సహాయ సంఘాల మహిళలకు

జిల్లాలో మొత్తం 18,672 సంఘాలు, 1.94లక్షల మంది సభ్యులు

మహిళల ఆరోగ్య భద్రతే లక్ష్యం

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి)

స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యుల ఆరోగ్య భద్రత లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర ఆరోగ్య సేవలు అందించనుంది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం విస్తృత కార్యాచరణను సిద్ధం చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 18,672 ఎస్‌హెచజీ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న 1,94,493 మంది మహిళలకు దశల వారీగా ఆరోగ్య పరీక్షలు నిర్వహంచనున్నారు. దశల వారీగా పరీక్షలు నిర్వహించి, మహిళల ఆరోగ్య పరిస్థితిపై సమగ్ర హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందిస్తారు. మహిళల ఆరోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించి, సకాలంలో చికిత్సలు అందించే లక్ష్యంగా జిల్లా అధికార యంత్రాంగం సమగ్ర ఆరోగ్య పరీక్షలకు అవసరమైన యంత్ర పరికరాలు, పారామెడికల్‌, వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చి కార్యక్రమాన్ని మూడు మాసాల్లో పూర్తిచేసేలా కార్యాచరణను రూపొందించింది.

పరీక్షలకు మౌలిక సదుపాయాల కల్పన

స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 1,94,493 మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ల్యాబ్‌, యంత్రపరికరాలు, టెక్నీషియన్స, రిజెంట్ల వంటి వనరుల అవసరాలపై సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఆయా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ల్యాబ్‌లలో యంత్ర పరికరాలు, సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు. టెక్నీషియన పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. మహిళల నుంచి నమూనాల సేకరణ, డేటా నమోదు, ఫాలోప్‌ ప్రక్రియలను సమర్థంగా నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, మెప్మా, మునిసిపల్‌ శాఖల ఉద్యోగులతో పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఉద్యోగులను వినియోగించుకోనున్నారు. వీరికి ఆయా విధుల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అందుకోసం జిల్లాలోని పోచంపల్లి, షారాజీపేట, బీబీనగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మాస్టర్‌ ట్రైనర్‌ కేంద్రాలుగా గుర్తించారు. ఇక్కడ శిక్షణ పొందిన మాస్టర్‌ టైనర్లు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇతర ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇస్తారు.

30 రకాల ఆరోగ్య పరీక్షలు

మహిళల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా చేపడుతున్న సమగ్ర వైద్య పరీక్షల కార్యక్రమంలో ఎస్‌హెచజీలో సభ్యురాలైన ప్రతీ మహిళకు 30 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. బయో కెమిసీ్ట్ర విభాగంలో మధుమేహం, సీరం, బిలిరుబిన, సీరం క్రియాటిన, బ్లడ్‌యూరియా, ఎస్‌జీపీటీ, ఎస్‌జీవోటీ, సీరం ఆల్కలైన పాస్పెట్‌, సీరం టోటల్‌ ప్రోటీన, సీరంఅల్బుమిన తదితర పరీక్షలు నిర్వహిస్తారు. థైరాయిడ్‌ పనితీరును అంచనావేసే టీఎ్‌సహెచఎ్‌స పరీక్షలను సైతం చేస్తారు. వీటితో పాటు హిమోగ్లోబిన, తెల్లరక్త కణాలు, ఎర్ర రక్తకణాలు, ప్లేట్‌లెట్‌ కౌంట్‌ తదితర హిమటాలజీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ ఆరోగ్య పరీక్షలకు అదనంగా ఆరోగ్యవివరాల సేకరణ కోసం మహిళ రక్త గ్రూప్‌, ఎత్తు, బరువు,బాడీమాస్‌ ఇండెక్స్‌(బీఎంఐ), బీపీ, శరీర ఉష్ణోగ్రత, హార్ట్‌బీట్‌, పల్స్‌ రేట్‌, కంటి, నోటి, చర్మ, గోళ్ల పరీక్షలు నిర్వహిస్తారు. అదే విధంగా వైకల్య నిర్ధారణ పరీక్షలు సైతం చేపట్టనున్నారు. మహిళలకు నిర్వహించే ఈ సమగ్ర ఆరోగ్య పరీక్షల ద్వారా వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడమేగాక సకాలంలో చికిత్స అందించే అవకాశం ఏర్పడుతుంది.

మహిళల ఆరోగ్యమే లక్ష్యం

కుటుంబ సంక్షేమానికి కీలకమైన మహిళల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం సమగ్ర ఆరోగ్య పరీక్షల కార్యక్రమం చేపట్టనుంది. మహిళల ఆరోగ్య పరిస్థితిపై సమగ్ర ప్రొఫైల్‌ను రూపొందించడంతోపాటు ఈ పరీక్షల్లో వ్యాధులను ముందస్తుగానే గుర్తించనున్నారు. నిర్ధారించిన వ్యాధులకు చికిత్సను అందించేందుకు వైద్యఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసే అవకాశం లభిస్తుంది. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ఈ కార్యక్రమం ప్రయోజనకరం కానుంది.

ఎస్‌హెచజీలు ఇలా..

మండలాలు : 17

మునిసిపాలిటీలు : 6

ఎస్‌హెచజీలు : 18,672

సభ్యులు : 1,94,493

ఆస్పత్రులు ఇలా..

జిల్లా కేంద్ర ఆసుపత్రి : 1

కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు : 3

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు : 21

మహిళల ఆరోగ్య పరిరక్షణకు వైద్య పరీక్షలు: అనురాగ్‌జయంతి, కలెక్టర్‌

స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలను దశల వారీగా మూడు మాసాల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాం. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ఈ సమగ్ర వైద్య పరీక్షలు ఉపయోగపడనున్నాయి. ఈ పరీక్షల ద్వారా మహిళల ఆరోగ్యస్థితిపై సమగ్ర ప్రొఫైల్‌ రూపొందించడమేగాక, వ్యాధులను ముందస్తుగా గుర్తిస్తాం. సకాలంలో చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య, మునిసిపల్‌, మెప్మా, డీఆర్‌డీఏ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నాం. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.

కలెక్టరేట్‌లో శిక్షణ

ఆరోగ్య పరీక్షల నిర్వహణకు జిల్లాస్థాయి శిక్షణాకార్యక్రమాన్ని గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. టీ- డయాగ్నస్టిక్‌ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ భరత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, డీఆర్‌డీవో టి.నాగిరెడ్డి, డీఎంహెచవో మనోహర్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 12:17 AM