‘టెంపుల్ సిటీ’లో అతిథి గృహాలు
ABN , Publish Date - Jul 01 , 2026 | 12:43 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సన్నిధి లో పెద్దగుట్టపై అభివృద్ధి చేసిన టెంపుల్‌సిటీ లేఅవుట్ లో భక్తులకు వసతి సదుపాయాల కల్పన నిమిత్తం అతిథిగృహాల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
నిర్మాణాలకు ప్రభుత్వం పచ్చ జెండా
తిరుమల తరహా విధానాల అమలు
మఠాలు, కులసంఘాలకు స్థలాల కేటాయింపు యోచన
హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్‌కు మార్కెట్ ధరకు భూకేటాయింపు
ఆధ్యాత్మిక, పర్యాటక, మౌలిక సదుపాయాల్లో అత్యుత్తమ దేవస్థానంగా అభివృద్ధి
గుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేంవత్‌రెడ్డి సమీక్ష
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సన్నిధి లో పెద్దగుట్టపై అభివృద్ధి చేసిన టెంపుల్‌సిటీ లేఅవుట్ లో భక్తులకు వసతి సదుపాయాల కల్పన నిమిత్తం అతిథిగృహాల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.ఆలయ పునర్నిర్మాణంతో పాటు అభివృద్ధి చేసిన టెంపుల్ సిటీలో కాటేజీలు, అతిథిగృహాల నిర్మాణానికి ముందుకు వచ్చే దాతల జాబితా సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యా దగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై మంగళవారం హైదరాబాద్ ఎంసీఆర్‌హెచ్‌డీలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
టెంపుల్ సిటీలో అతిథి గృహాల నిర్మాణాల విషయంలో తి రుమలలో అనుసరిస్తున్న విధానాలు ఇక్కడా అనుసరించాల ని, దాతలకు విడతల వారీగా అనుమతులు ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట ఆలయాన్ని ప్రభుత్వం సుమారు రూ.1200కోట్ల వ్యయంతో దేశంలోని అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా పునర్నిర్మాణం చేసింది. అం తర్జాతీయ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతున్న ఆలయాన్ని సం దర్శించే దేశ, విదేశీ భక్తులకు అదేస్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధికి సంకల్పించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కాటేజీలు,అతిథి గృహాల నిర్మాణం కోసం యాదగిరికొండకు అభిముఖంగా ఉన్న పెద్దగుట్టపై 207 ఎకరాల్లో టెంపుల్ సిటీ లేఅవుట్‌ను అభివృద్ధి చేసింది. విశాలమైన రహదారులు, డ్రైనేజీ, ల్యాండ్‌స్కేప్ గార్డెన్లు, పచ్చదనం, నీటి సదుపాయం, వీధి దీపాలతో అభివృద్ధి చేసిన ఈ లేఅవుట్‌లో అతిథి గృహాల నిర్మాణాల కోసం దాతలకు ప్లాట్లు కేటాయించకపోవడంతో పదేళ్లుగా ఇవి నిరుపయోగంగా ఉంటున్నాయి. ఆలయ పునర్నిర్మాణంతో కొండపై ఉన్న అతిథి గృహాలను కూల్చివేయడంతో స్వామివారి సన్నిధిలో బసచేసే భక్తులకు వసతి సదుపాయా లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాదగిరిగుట్ట ఆలయం, ఇతర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలనే సంకల్పంలో భాగంగా టెం పుల్ సిటీలో వసతి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం నిర్ణయించింది. టెంపుల్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అతిథి గృహాల నిర్మాణాలకు ముందుకు వచ్చే దాతలకు, సంస్థలకు లేఅవుట్‌లో స్థలాలు కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిం ది. దీంతో టెంపుల్ సిటీలోని సువిశాలమైన అన్ని హంగులతో అభివృద్ధి చేసిన సుమారు 200కుపైగా ప్లాట్లలో కాటేజీలు, అతిథి గృహాల నిర్మాణానికి అవకాశం ఏర్పడింది.
ఆలయానికి భూహక్కులు ఉండేలా కేటాయింపు
లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సన్నిధిలో భక్తులకు అన్నదానం, వసతి సదుపాయాలను కల్పించేందుకు మ ఠాలకు, కులసంఘాలకు సైతం స్థలాల కేటాయింపునకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించారు. ధార్మిక సేవలు నిర్వహించే మఠాలు, సంస్థలు, కులసంఘాలకు భూముల కేటాయింపుపై ఒక విధానం రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ కేటాయింపుల్లో భూ హక్కులు ఆలయానికే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ భూముల కేటాయింపులో తిరుమలలో అనుసరిస్తున్న విధానాలను అధికారులు అధ్యయనం చేసి స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానాన్ని రూపొందించాలన్నారు. అక్కడి విధానాలను యాదాద్రి ఆలయానికి అవసరమైన మార్పులతో అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అదే విధంగా హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్‌కు మార్కెట్ ధర ప్రకారం భూమి కేటాయించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు.
అత్యుత్తమ దేవస్థానంగా అభివృద్ధికి ప్రణాళికలు
గుట్ట ఆలయాన్ని దేశంలోనే అత్యుత్తమ దేవస్థానంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలను రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అంశాల వారీగా సమీక్షిస్తూ ఆలయ విస్తర ణ, అతిథి గృహాల నిర్మాణం, పర్యాటక అభివృద్ధి, భూసేకరణ వంటి అంశాల్లో సమగ్ర కార్యాచరణ రూపొందించి అతివేగంగా అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆధ్యాత్మిక, పర్యాటకంగా మౌలిక సదుపాయాల విషయంలో ఆలయాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. భూసేకరణ కోసం అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన పర్యాటక ప్రాంతాలతో అనుసంధానిస్తూ, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) విధానంలో ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
ఇంజనీర్ల కమిటీ నివేదికపై అధ్యయనం
లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంపై రాష్ట్ర ప్రభు త్వం నియమించిన ఇంజనీర్ల కమిటీ నివేదికను అధ్యయనం చేసి, తుదినోట్‌ను వారం రోజుల్లో అందించాలని సీఎం రేంవత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం, తదితర పనులకు సంబంధించి సుమారు రూ.150కోట్లకు చెందిన కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు, పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీర్లతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక అందించడంతో అందులోని అంశాలను అధ్యయనం చేయాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. వారం రోజుల్లో పూర్తిస్థాయి నోట్‌ను అందజేయాలని సూచించారు. సమీక్షా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కుందూరు రఘువీరారెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయే్‌షరంజన్, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజ రామయ్యర్, కమిషనర్ ఎం.హనుమంతరావు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా, సీఎంవో కార్యదర్శి మాణిక్‌రాజ్, ఓఎస్టీ వేముల శ్రీనివాస్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, కలెక్టర్ అనురాగ్‌జయంతి, ఆలయ ఈవో పాల్గొన్నారు.
ఆదర్శ గ్రామంగా వాసాలమర్రి అభివృద్ధి
త్వరలో సందర్శించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
గృహ ప్రవేశాలకు సిద్ధంకానున్న 150 ఇందిరమ్మ ఇళ్లు
పాఠశాల, రహదారుల నిర్మాణాలు పూర్తికి ఆదేశాలు
యాదాద్రి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని, గ్రామంలో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యతో నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం వాసాలమర్రి, కొండాపూర్ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు బీర్ల అయిలయ్య తెలిపారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుని, డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం చేస్తానని, రహదారి విస్తరణ చేస్తానని ఇళ్ల కూల్చివేతలు చేపట్టి మధ్యంతరంగా వదిలేశారన్నారు. ఆ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిందని పేర్కొన్నారు. వాసాలమర్రి, కొండాపూర్ గ్రామాలకు అదనంగా 150 ఇళ్లు మంజూరు చేయనున్నట్టు చెప్పారు. వాటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయడమేగాక సామూహికంగా నిర్వహించే గృహ ప్రవేశాల కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతారని చెప్పారు. పర్యటన ఖరారు వరకు గ్రామంలోని పాఠశాల, రహదారులతో పాటు ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేసి, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు.
బీఎన్.తిమ్మాపూర్ నిర్వాసితులకు రూ.134కోట్లు
బస్వాపూర్‌లో 100 ఎకరాల్లో బృందావన్ గార్డెన్
బండరావిర్యాలలో డంపింగ్‌యార్డ్ ఏర్పాటు ఉపసంహరణ
యాదాద్రి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): బస్వాపూర్ నృసింహసాగర్ రిజర్వాయర్ కింద వ్యవసాయ భూములు, ఇళ్లను కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పునరావాస కార్యక్రమాలకు రూ.134కోట్ల నిధులు 15 నుంచి 20 రోజుల్లో విడుదల చేస్తామని సీఎం రేంవత్‌రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గ ప్రధాన సమస్యలపై సీఎంతో చర్చించారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న బస్వాపూర్ నిర్వాసితులకు పరిహారం, పునరావాస నిధులను విడుదల చేయాలని కోరగా, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు చెప్పారు. అదేవిధంగా పర్యాటకంగా అభివృద్ధిలో భాగంగా బస్వాపూర్ రిజర్వాయర్ చెంత 100 ఎకరాల భూమిని ఇప్పటికే పర్యాటకశాఖకు స్వాధీనం చేశామని, యాదగిరిగుట్ట-భువనగిరి ఖిల్లా మధ్య ఉన్న బస్వాపూర్ రిజర్వాయర్ వద్ద బృందావన్ తరహాలో థీమ్ పార్క్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరగా సానుకూల ంగా స్పందించారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా బండరావిర్యాల వద్ద ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్‌తో భువనగిరి నియోజకవర్గంలోని పోచంపల్లి మండలం సరిహద్దు గ్రామాలపై కాలుష్య ప్రభావం పడుతోందని, వెంటనే డంపింగ్‌యార్డ్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని సీఎంను కోరినట్టు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. భువనగిరి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ఆయన సానుకూలంగా స్పందిచారని చెప్పారు.