భూగర్భజలాలు పాతాళానికి..
ABN , Publish Date - May 29 , 2026 | 11:57 PM
ప్రకృతిలో జీవరాశికి అతి విలువైన వనరు నీరు. ప్రాణకోటికి అత్యంత అవసరమైంది నీరే. మన ఆహార అవసరాలను తీర్చడానికి సాగే వ్యవసాయం, వస్తు ఉత్పత్తుల పరిశ్రమలు, వాణిజ్యంనుంచి ప్రతీరంగానికి నీరు అత్యంత అవసరమైన ప్రకృతి ప్రసాదించిన వనరు.
జిల్లాలో వేగంగా పడిపోతున్న భూగర్భజలాలు
అసాధారణరీతిలో నీటి మట్టాలతో పర్యావరణ సమతుల్యతపై ప్రభావం
ఏప్రిల్‌లో సాధారణ నీటిమట్టం 4.75 మీటర్లు
వాస్తవ నీటిమట్టం 8.53 మీటర్లు.. మే నెలలో మరింత లోతుకు నీటిమట్టం
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): ప్రకృతిలో జీవరాశికి అతి విలువైన వనరు నీరు. ప్రాణకోటికి అత్యంత అవసరమైంది నీరే. మన ఆహార అవసరాలను తీర్చడానికి సాగే వ్యవసాయం, వస్తు ఉత్పత్తుల పరిశ్రమలు, వాణిజ్యంనుంచి ప్రతీరంగానికి నీరు అత్యంత అవసరమైన ప్రకృతి ప్రసాదించిన వనరు. ప్రాచీ న జీవన సంస్కృతులు, నాగరికతలు జల వనరులు ఉన్న చోటు నుంచే అభివృద్ధి చెందాయి. అయితే అలాంటి ప్రాణపదమైన నీటి వనరుల వినియోగంలో అసాధారణరీతుల కారణంగా భూగర్భజలాలు అడుగంటుతున్నాయి.
జిల్లాలో వేగంగా పడిపోతున్న జలమట్టాలు.. రాబో యేకరువు పరిస్థితులను ఎదుర్కోవాల్సిన ప్రమాద ఘం టికలను మోగిస్తోంది. జిల్లాలో భూగర్భజలాల వినియో గం పెరుగుతుండటం.. ఇష్టానుసారం తోడేస్తుండటం ఆందోళనకరంగా మారుతోంది. జలవనరుల వినియోగంతోపాటు వర్షపునీటి నిర్వహణ(రీచార్జ్)లో జాగ్రత్త పాటించడం ద్వారానే రాబోయే నీటికరువు వంటి ప్రమాదాలను అధిగమించవచ్చని భూగర్భజలశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రకృతి ప్రసాదం.. జల వనరు
జీవరాశి మనుగడకు ప్రసాదించిన సహజ వనరు భూగర్భ జలం. ఈ భూగర్భజలాల లభ్యత ఆయా ప్రాం తాల్లో విస్తరించిన రాతి శిలల భూ భౌతిక నిర్మాణం (జియోలాజికల్ ఫార్మేషన్)పై ఆధారపడి ఉంటుంది. కొండలు, గుట్టలు, ఎర్ర, నల్లరేగడితోపాటు చౌడు నేలల మిళితమైన జిల్లాలో ఎక్కువగా రాతి శిలలు, గ్రానైట్ వంటి కఠిన శిలలతో కూడి జియెలాజికల్ ఫార్మేషన్ కలి గి ఉందని జియాలజిస్టులు పేర్కొంటున్నారు. కఠినమైన గ్రానైట్ శిలలు ఎక్కువగా ఉండే జిల్లాలో 30 నుంచి 60 అడుగుల లోతు వరకు మొరం మట్టి అధికంగా ఉం టుంది. అందుకే ఈ ప్రాంతంలో ఎక్కువగా మెట్ల బావు లు, రింగుల బావులతో వ్యవసాయం సాగుతుండేది. ఈ తరహాకు చెందిన మొరంరాతి పొరల్లో అరమీట రు నుంచి రెండున్నర మీటర్ల వరకు వర్షపునీరు ఇంకిపో వడానికి మృత్తిక పొర ఒక వారధిగా పనిచేస్తోంది. ఈ పొర ఆధారంగా వర్షపు నీటితోపాటు, ఇతరత్ర మిగులు జలాలు సైతం భూగర్భంలో ఇంకడానికి రీచార్జ్‌కి శాస్త్రీయ విధానాలు అవలంభించడం ప్రతీ ఒక్కరి తప్పనిసరి బాధ్యత.
అసాధారణ భూగర్భజల మట్టాలు..
జిల్లాలో నిపుణుల అంచనాల ప్రకారం అసాధారణరీతిలో జలమట్టాలు పడిపోతున్నాయి. దీంతో పర్యావరణం దెబ్బతినడ మే కాకుండా, ప్రకృతి వనరులు దెబ్బతింటున్నాయి.. అనావృష్టి, అకాల వర్షాల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జిల్లాలో విస్తరించిన రాతి శిలల భూభౌతిక నిర్మాణం (జియోలాజిక ల్ ఫార్మేషన్) ప్రకారం సాధారణ నీటి మట్టాల కంటే అసాధారణరీతిలో నీటి మట్టాలు ఉన్నాయి. నవంబరు లో 3 మీటర్ల నీటిమట్టం ఉండాల్సి ఉండగా, 4.50 మీట ర్ల లోతుకు పడిపోయాయి. అంటే దాదాపు 1.50 వ్యత్యా సం ఉంది. ఏప్రిల్‌లో ఉండాల్సిన నీటిమట్టం 4.75 మీటర్లకు బదులు 8.53 మీటర్లుగా నమోదైంది. 3.78మీటర్ల వ్యత్యాసంలో భూగర్భజలాలు ఉన్నాయి. మే చివరి వరకు కూడా రుతుపవనాల జాడ లేకపోవడం, జిల్లాలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలమట్టం...మరింత ఆందోళనకర పరిస్థితులకు చేరుతుందని భూగర్భ జలవనరుల నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే జిల్లాలో భూగర్భ జలమట్టాల సంరక్షణకు చర్యలు తీసుకున్నప్పుడే ఈ ప్రమాదం నుంచి బయట పడే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. భూగర్భ నీటిని తోడుకుని అవసరాలకు వినియోగించడంతో ఎంత శ్రద్ధాసక్తులు చూపుతున్నారో. వర్షపునీటిని భూగర్భంలోకి రీచార్జ్ చేయడంలో కూడా అంతే శ్రద్ధ తీసుకున్నప్పుడే పర్యావరణ సమతుల్యతకు ముఖ్యమైన భూగర్భజల మట్టాలను కాపాడుకోగలుగుతాం.
భూగర్భ జల మట్టాల సాధారణ స్థితులు
ఏప్రిల్-మార్చి వరకు ఆర్థిక సంవత్సరం మాదిరే జూన్‌నుంచి మేనెల వరకు నీటి సంవత్సరంగా ఏటా పరిగణలోకి తీసుకుంటారు. జూన్ నుంచి సెప్టెంబరు వరకు రుతుపవనాల ప్ర భావంతో వర్షాలు కురుస్తాయి. అలా కురిసిన వర్షం సహజంగా నీటిలో ఇంకిపోతుంది. భూగర్భంలోకి వర్షపు నీరు ఇంకిపోయే ప్రక్రియ సాధారణం గా నవంబరు చివరినాటికి కొనసాగుతుంది. దీనిని రీచార్జ్ వ్యవధిగా పరిగణిస్తారు. అయితే ఈ కాలంలో భూగర్భ సాధారణ జలమట్టం కేవలం 3 మీటర్ల లోతులోనే అందుబాటులో ఉండాలి. నీటి సంవత్సరం చివరి మాసం మే వరకు అవసరాలకోసం నీటిని తోడుకున్న తర్వాత కూడా కనీస భూగర్భ జలమట్టం 5 మీటర్ల వర కే ఉండాలి. ఆ తర్వాత వరుసగా నీటి సంవత్సరం ఆరంభంలో జూన్‌లో 4.75 మీటర్లు, జూలైలో 4.25 మీటర్లు, ఆగస్టులో 4మీటర్లు, సెప్టెంబరులో 3.50 మీటర్లు, అక్టోబరులో 3.25 మీటర్లు, నవంబరులో 3 మీటర్లు, డిసెంబరులో 3.25 మీటర్లు, జనవరిలో 3.75 మీటర్లు, మార్చి లో 4.25 మీటర్లు, ఏప్రిల్‌లో 4.75 మీటర్లు, ఇక మేలో 5 మీటర్ల వరకు అందుబాటులో ఉండాలి. సాధారణ స్థితిలో భూగర్భజలమట్టాలు ఉన్నప్పుడే భూమిపై గడ్డి, గరక, మొక్కలు, చెట్లు, భారీ వృక్షాల కు అవసరమైన భూగర్భనీటిని అందుకుని ఎండిపోకుండా జీవిస్తాయి. ప్రకృతి పచ్చదనంతో జీవకోటికి అవసరమైన ఆహార అవసరాలు, ఆక్సిజన్ అందుతుంది. భూమి పైపొరల్లో ఉండాల్సిన తేమ ఉండి, సమశీతోష్ణత కాపాడబడుతుంది. పర్యావరణ సమతుల్యత రక్షించడంతో భూగర్భ జలమట్టం ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
భూగర్భ జలమట్టాల ఆధారంగానే పంటల సాగు చేసుకోవాలి
పి. జ్యోతికుమార్, డిప్యూటీ డైరెక్టర్, భూగర్భజల శాఖ
జిల్లాలో భూగర్భ జలమట్టాలు తగ్గిపోతున్నాయి. భూగర్భ జలాల సంరక్షణకు రీచార్జ్ ప్రణాళికలు తప్పనిసరిగా చేపట్టాలి. వృథాగా పోయే వర్షపునీటిని భూగర్భంలోకి ఇంకడానికి అవసరమైన నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరాలు ఉన్నాయి. అదేవిధంగా జిల్లాలోని రైతాంగం సైతం జిల్లాలోని ఆయా నెలల్లో భూగర్భ జలమట్టాలను పరిగణలోకి తీసుకుని అందుకు అనుగుణమైన పంటలనే సాగుచేసుకోవాలి. ముఖ్యంగా రెండో పంటగా వరిసాగుకు మాత్రం భూగర్భ జల లభ్యత అంచనాల ప్రకారమే చేసుకోవాలి. భూగర్భ జలాలు అధికంగా తోడుకుని, వినియోగిస్తున్నందున పర్యావరణంపై ప్రభావం చూపుతూ అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
జిల్లాలో భూగర్భ జలమట్టాలు
నెల సాధారణ వాస్తవ వ్యత్యాసం
జనవరి-2026 3.75 మీ. 5.49మీ 1.74మీ.
ఫిబ్రవరి-2026 4.00 మీ. 6.49 మీ. 2.49మీ.
మార్చి- 2026 4.25 మీ. 7.83 మీ. 3.58 మీ.
ఏప్రిల్-2026 4.75 మీ. 8.53 మీ. 3.78 మీ.