హరితం మాయం
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:28 AM
రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు హరితహారం పేరుతో మొక్కలు నాటి సంరక్షించే ప్రయత్నాలు చేస్తోంది.
వరికొయ్యలకు నిప్పు, బొగ్గు బట్టీలతో తీవ్ర నష్టం
రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు హరితహారం పేరుతో మొక్కలు నాటి సంరక్షించే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు వానాకాలం సాగు సీజన ప్రారంభం కానుండటంతో పొలాల్లో వరికొయ్యల కాల్చివేతలతో హరితహారం మొక్కలు దెబ్బతింటు న్నాయి. నిప్పురవ్వులు అంటుకుని సమీపంలోని చెట్లు కూడా దగ్ధమవుతున్నాయి. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా బొగ్గుబట్టీల నిర్వహణతో చెట్లు కోతలకు గురవుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట)
వరికొయ్యల మంటలు చెట్లనూ దహించివేస్తున్నాయి. రైతులు నిప్పు పెట్టి వదిలేస్తుండటంతో సమీపంలోని చెట్లకు మంటలు అంటుకుని నిమిషాల్లో దశాబ్దాల తరబడి ఎదిగిన చెట్లు కాలి బూడిదవుతున్నాయి. వ్యవసాయాధికారులు వరికొయ్యలు కాల్చవద్దని రైతులకు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. మోతె మండలం అన్నారిగూడెం గ్రామంలో వరికొయ్యల నిప్పుతో మామిడితోట కాలిపోయింది. దీంతో రైతులకు తీవ్రనష్టం జరిగింది. జిల్లాలో 6లక్షల ఎకరాల్లో వివిధరకాల పంటలు సాగవుతుండగా అందులో 4లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. కోతల అనంతరం వరికొయ్యలను చాలామంది రైతులు తగులబెడుతున్నారు. ఇంతపెద్దమొత్తంలోని పొలాల్లో వరికొయ్యలను కాల్చడంతో కార్బనమోనాక్సైడ్ వంటి వాయువులు గాలిలో కలిసి కాలుష్యం పెరుగుతుండగా, భూసారం తగ్గిపోతోంది. తద్వారా తదుపరి పంట దిగుబడిపై ఆ ప్రభావం భారీగా పడుతోంది. జిల్లాలో ప్రతి ఏడాది దాదాపు 40 లక్షల వరకు మొక్కలు నాటుతున్నారు. కానీ సంరక్షణను నిర్లక్ష్యం చేయడంతో నాటిన మొక్కల్లో చాలా వరకు ఎండిపోతున్నాయి.
బొగ్గు బట్టీలతో ...
జిల్లాలో బొగ్గు బట్టీల ఏర్పాటు పెరిగింది. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తు న్నారు. బొగ్గుబట్టీల్లో సర్కార్‌తుమ్మ చెట్లను వాడాలి. కానీ అన్నిరకాల చెట్ల కొమ్మలను అందులో వేసి బొగ్గును తయారు చేస్తున్నారు. జిల్లాలో విచ్చల విడిగా చెట్లను నరికివేస్తున్నారు. ఏ చెట్టును తొలగించాలన్నా అటవీ శాఖ అనుమతి తీసుకోవాలి. కానీ తాము పెంచిన చెట్టే కదా అని నరికివేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు కూడా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.
నామామాత్రంగా హరితహారం
హరితహారం కార్యక్రమం నామాత్రంగా నిర్వహిస్తున్నారు. మొక్కలు నాటడమే తప్ప వాటి సంరక్షణ మరిచిపోతున్నారు. ప్రతీ వర్షాకాలం ప్రారంభంలో నిర్వహించే వనమహోత్సవంలో జిల్లాలో డీఆర్‌డీవో/ఎంపీడీవో కార్యాలయాలకు 26.80 లక్షల మొక్కలు నాటడానికి లక్ష్యంగా కేటాయిస్తారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 4 లక్షలు, మునిసి పల్ ఽఆద్వర్యంలో 12 లక్షలు మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకొని నాటుతారు. కానీ వాటికి నీరు పోసేవారు ఉండరు. కేవలం వర్షం నీటితో మాత్రమే పెరగాల్సి వస్తోంది. మొక్కలకు అమర్చిన ఫెన్సింగ్ కూడా చోరీలకు గురవుతున్నాయి. దీంతో మొక్కలు మేకలకు ఆహార మవుతున్నాయి. ప్రభుత్వ శాఖలకు కలిపి లక్షల్లో మొక్కలను అందిస్తారు. ఏ ఏడాది మొక్కలు ఆ ఏడాదిలో చనిపోతున్నాయి. దీంతో హరితహారం లక్ష్యం చేరుకోవడం లేదు.
మొక్కలు పెంచడంతోనే ఉష్ణోగ్రత తగ్గుదల
మొక్కలను పెంచడంతోనే ఉష్ణోగ్రత తగ్గుతుంది. మొక్కలు చెట్లుగా పెరగడం వల్ల నీడతో పర్యావరణానికి మేలు చేస్తాయి. చెట్లు ఆక్సిజన విడుదల చేయడంతో పాటు ఉష్ణోగ్రతను తగ్గించి వర్షాలు కురిసేలా చేస్తాయి. ప్రతీ ఒక్కరు మొక్కలు పెంచడంలో తమవంతు పాత్ర పోషించాలి. ఎవరైనా అనుమతులు లేకుండా చెట్లు నరికితే చర్యలు తీసుకుంటాం.
ఫ సతీష్, డీఎఫ్‌వో