Share News

ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు

ABN , Publish Date - May 24 , 2026 | 11:58 PM

అనేక సవాళ్ల నడుమ సాగిన యాసం గి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జిల్లాలో ముగింపు దశకు చేరింది. ఇప్పటి వరకు 90శాతం కొనుగోళ్లల ప్రక్రియ పూర్తికాగా, మిగిలిన 10శాతం వేగవంతంగా పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తికి అధికారులు నిర్ణయించారు.

ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు

90శాతం మేర పూర్తి

మంత్రుల సమీక్ష, కలెక్టర్‌ కార్యాచరణతో గాడిన ప్రక్రియ

ఇప్పటివరకు 6.53లక్షల మెట్రిక్‌టన్నుల కొనుగోలు

కల్లాల్లో 73వేల మెట్రిక్‌టన్నులు

నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ) : అనేక సవాళ్ల నడుమ సాగిన యాసం గి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జిల్లాలో ముగింపు దశకు చేరింది. ఇప్పటి వరకు 90శాతం కొనుగోళ్లల ప్రక్రియ పూర్తికాగా, మిగిలిన 10శాతం వేగవంతంగా పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తికి అధికారులు నిర్ణయించారు.

జిల్లాలో ఏప్రిల్‌ మొదటివారం నుంచి మొ దలయ్యే ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మే నెలాఖ రు వరకు కొనసాగడం సర్వసాధారణమే. అయినా కొనుగోళ్ల ప్రక్రియలో లోపాలు, అవకతవకలతో ధాన్యం విక్రయంలో అన్నదాతలు అవస్థలు పడ్డారు. తాలు, తేమ పేరుతో ధాన్యం తూకం, ధరలో మితిమీరిన కోతలు విధించడం ఈ సీజన్‌లో కొనుగోళ్లలో ప్రధాన అడ్డంకిగా మారాయి. లారీల కొరత, దిగుమతుల్లో జాప్యం కూడా రైతులను ఇబ్బందులకు గురిచేశాయి. రైతుల అసహనం, ఆగ్రహం పెల్లుబికడంతో ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు కొనసాగ గా, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ప్రజాసంఘాలు ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలపై నిరసనగా రోడ్లెక్కి ఆందోళనలు చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగిన నేపథ్యంలో సీఎం నేతృత్వంలో సమీక్షలతో పాటు, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెం కట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌ నేతృత్వంలో జిల్లాలో ధాన్యం కేంద్రాలను తనిఖీచేశారు. కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు పలు మార్గదర్శకాలను సూచించడం, అదే సమయంలో కలెక్టర్‌ నేతృత్వంలోని అధికార యంత్రాంగం సైతం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయడంతో ఎట్టకేలకు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగి చివరి దశకు చేరింది. ఇప్పటికే 90శాతం కొనుగోళ్లు ముగియగా, ఈ నెలాఖరులోగా మిగిలిన 10శాతం ధాన్యం కొనుగోలు పూర్తిచేసేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

సత్ఫలితాలిచ్చిన కలెక్టర్‌ ప్రత్యేక కార్యాచరణ

జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ప్రధాన అడ్డంకిగా మారిన దిగుమతులను గాడిలో పెట్టేందుకు, తాలు, తేమ పేరుతో అడ్డగోలుగా కోత విధించకుండా నియంత్రించేందుకు, లారీల సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ నేతృత్వంలో జిల్లాలో చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతానికి దోహదం చేసింది. ప్రతీ కేంద్రానికి ప్రతి రోజూ కనీసం మూడు లారీలు అందుబాటులో ఉండేలా చూడడంతో కాంటాల ప్రక్రియ వేగవంతంగా సాగింది. అదేవిధంగా మిల్లుల వద్ద ఒక రెవెన్యూ ఉద్యోగితో పాటు, మరో పోలీస్‌ కానిస్టేబుల్‌ను నియమించడంతో దిగుమతుల్లో జాప్యం చేయకుండా, తాలు, తేమ పేరుతో రైతులను సతాయించకుండా వెంటనే దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఈ పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా కొనసాగాయని రైతులు చెబుతున్నారు.

కొనుగోలుచేయాల్సిన ధాన్యం 73వేల మెట్రిక్‌టన్నులు

జిల్లాలో యాసంగి సీజన్‌లో 415 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, కొనుగోళ్లు ముగియడంతో ఇప్పటికే వీటిలో 116 కేంద్రాలను మూసివేశారు. ఇంకా 299 కేంద్రాలు కొనసాగుతుండగా, మరో వారంలో వీటన్నింటి పరిధిలో కాంటాలు పూర్తిచేసేందుకు సిద్ధమయ్యా రు. జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు 7,27,099 మెట్రిక్‌టన్నుల ధాన్యం రాగా, అందులో 76,747 మంది రైతులకు సంబంధించి రూ.1562.20కోట్ల విలువైన 6,53,913 మెట్రిక్‌టన్నుల ధాన్యం కాంటాలు పూర్తయ్యాయి. ఇంకా కేంద్రాల వద్ద 73,185 మెట్రిక్‌టన్నుల ధాన్యం మాత్రమే కాంటా వేయాల్సి ఉంది.

ట్యాబ్‌ ఎంట్రీలు, ట్రక్‌ షీట్‌ జనరేషన్‌లో జాప్యం

కాంటాలు, లారీలు, దిగుమతుల ప్రక్రియను గాడిలో పెట్టినప్పటికీ ట్యాబ్‌ ఎంట్రీలు, ట్రక్‌ షీట్‌ జనరేట్‌లో మాత్రం జాప్యం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు మిల్లుల వద్దకు 6,37,725 మెట్రిక్‌టన్నుల ధాన్యం చేరితే, అందులో 5,27,319 మెట్రిక్‌టన్నుల ధాన్యం వివరాలు మాత్రమే నమోదయ్యాయి. అందులో 5,10,730 మెట్రిక్‌టన్నులకు మాత్రమే ట్రక్‌ షీట్లు జనరేట్‌ చేశారు. వీటిల్లో 4,99,336 మెట్రిక్‌టన్నులకు మిల్లర్ల నుంచి ధ్రువీకరణ రాగా, మిగిలిన ధాన్యానికి రావాల్సి ఉంది. ట్యాబ్‌ ఎంట్రీలు, ట్రక్‌ షీట్ల జనరేట్‌, మిల్లర్ల ధ్రువీకరణ పూర్తయిన రైతుల కు బిల్లులు మాత్రం వేగంగా చెల్లింపులు చేస్తున్నారు. ఇప్పటివరకు రూ.1220.13కోట్ల విలువైన ట్రక్‌ షీట్లు జనరే ట్‌ కాగా, అందులో 65,171 మంది రైతులకు రూ.1192.91 కోట్లు వారి ఖాతాల్లో జమయ్యాయని పౌరసరఫరాలశాఖా అధికారులు నివేదికల్లో పేర్కొన్నారు. కాంటాలు దిగుమతులపైనే ప్రధానంగా దృష్టిసారించడంతో ట్యాబ్‌ ఎంట్రీలు, ట్రక్‌ షీట్‌ జనరేట్‌ చేయడంలో, మిల్లర్ల ధ్రువీకరణ తీసుకోవడంలో జాప్యం జరిగిందని, ఈ వారం వీటిపైనా ప్రత్యేకంగా దృష్టిసారించి నెలాఖరులోగా కొనుగోళ్లు చేసిన ధాన్యమంతటినీ ట్యాబ్‌లో ఎంట్రీ చేయించి, ట్రక్‌ షీట్లు, మిల్లర్ల ధ్రువీకరణ తీసుకోవడంతో పాటు బిల్లుల చెల్లింపులు కూడా పూర్తయ్యేలా చూస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

వారంలో కొనుగోళ్ల ప్రక్రియ ముగిస్తాం : వెంకటేశ్‌, జిల్లా పౌరసరఫరాలశాఖాధికారి

జిల్లాలో దాదాపు 90శాతం వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. లారీలు ఎక్కడా ఆగడం లేదు. మిల్లుల వద్ద వచ్చిన ధాన్యం వచ్చినట్లే దిగుమతి చేయిస్తున్నాం. ట్యాబ్‌ ఎంట్రీలు కూడా వెంటనే చేయిస్తున్నాం. బిల్లుల చెల్లింపుల్లోనూ జాప్యం లేకుండా వెంటనే రైతుల ఖాతాల్లో నేరుగా జమవుతున్నాయి. ఈ వారాంతంలోగా కొనుగోళ్లు దాదాపు పూర్తిచేయడమే గాక, ట్యాబ్‌ ఎంట్రీలు, ట్రక్‌ షీట్లు, మిగతా అన్ని ప్రక్రియలు పూర్తిచేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం.

Updated Date - May 24 , 2026 | 11:58 PM