Share News

పట్టభద్ర ఓటర్లు ః 6.21లక్షలు

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:43 AM

శాసనమండలి నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల నమోదులో తొలిఘట్టం పూర్తయింది. ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది.

పట్టభద్ర ఓటర్లు ః 6.21లక్షలు

ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

డిసెంబరు 10వరకు నమోదుకు అవకాశం

డిసెంబరు 30న తుదిజాబితా

2024కంటే 1.57లక్షల అదనపు ఓట్లు నమోదు

ఏ క్షణమైనా షెడ్యూల్‌ వచ్చే అవకాశం

షురూ కానున్న ప్రచార పర్వం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): శాసనమండలి నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల నమోదులో తొలిఘట్టం పూర్తయింది. ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. దీని ప్రకారం 6,21,086 ఓటర్లు నమోదయ్యారు. 2024లో జరిగిన ఉప ఎన్నికలో 4,63,839 ఓటర్లు మాత్రమే ఉండగా, ఈసారి ప్రధాన రాజకీయపక్షాలు ఓటర్ల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024తో పోల్చితే 1,57,247 ఓటర్లు అదనంగా నమోదయ్యారు.

ఎన్నికల సంఘం ప్రకటించిన ముసాయి దా ఓటర్ల జాబితాపై డిసెంబరు 10వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తా రు. డిసెంబరు 25వ తేదీలోగా వాటిని పరిష్కరించి 30న తుదిజాబితాను ప్రకటిస్తారు. డిసెంబరు 10వ తేదీ వరకు ఓటర్ల నమో దు కూడా సమాంతరంగా కొనసాగుతూనే ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి బుధవారం ప్రకటించారు. మరోవైపు ఈ ఎన్నికపై ప్రత్యేకంగా కన్నేసి న రాజకీయపార్టీలు ఇప్పటి వరకు ఓటర్ల నమోదుపై దృష్టిసారించగా, ఇక ప్రచార పర్వం ప్రారంభించనుండటంతో డిసెంబరు నుంచే ప్రచార హోరు ఊపందుకోనుంది.

6.21లక్షల మంది ఓటర్లు

ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లోని 192 మండలాల్లో విస్తరించిన పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం లో 894 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు గుర్తించారు. ముసాయిదా జాబితా ప్రకారం 6,21,086 మంది ఓటర్లు ఉండగా, అందులో 3,73,984 మంది పురుషులు, 2,47,095 మం ది మహిళలు, ఏడుగురు ఇతరులు నమోదయ్యారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 1,07,003 మంది ఓటర్లు నమోదవగా, ఆతర్వాత ఖమ్మం జిల్లాలో 1,01,671 మంది నమోదు చేసుకున్నారు. అత్యల్పంగా సిద్ధిపేటలో 6,392, ములుగులో 14,204మంది గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. మూడు ఉమ్మడి జిల్లాలో పరిధిలోని ఈ నియోజకవర్గంలో 2024లో జరిగిన ఉప ఎన్నికలో 4,63,839 ఓటర్లు ఉండగా, తాజాగా ఓటర్ల సంఖ్య 6,21,086కు చేరింది.

మార్చి 29తో ముగియనున్న తీన్మార్‌ మల్లన్న పదవీకాలం

ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తోన్న ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనుంది. ఇప్పటికే ఓటర్ల జాబితాల కొలిక్కిరాగా, డిసెంబరు 30న తుది ఓటర్ల జాబితా ప్రకటించనుండడంతో ఆ తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికలకు షెడ్యూల్‌ వస్తుందని భావిస్తున్నారు. 2007లో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో కపిలవాయి దిలీ్‌పకుమార్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తీన్మార్‌ మల్లన్న ప్రాతినిథ్యం వహించగా, ఈ సారి జరిగే ఎన్నికల్లో పూర్తిగా పోటాపోటీ కనిపిస్తోంది.

ఇప్పటికే రంగంలోకి దిగిన రాజకీయపార్టీలు

రాజకీయంగా చైతన్యవంతమైన నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో విస్తరించిన ఈ నియోజకవర్గంలో విద్యావంతుల అభిప్రాయం ఈ ఎన్నిక ద్వారా తెలియనుండడంతో అధికార కాంగ్రె్‌సతో పాటు, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీలు గెలుపుకోసం ఇప్పటికే రంగంలోకి దిగాయి. అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందు జరిగే ఎన్నిక కావడం, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన సీట్లను అందించడంలో కీలక భూమిక పోషించిన ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఈ ఎన్నిక జరగనుండడంతో కాంగ్రె్‌సకు ఈ స్థానం ప్రతిష్ఠాత్మకంగా మారింది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ సైతం ఈ నియోజకవర్గంపై దృష్టిసారించాయి. అధికార కాంగ్రెస్‌ ఇక్కడ ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని అందరికంటే ముందే అభ్యర్థిగా ప్రకటించింది. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తనయుడైన సర్వోత్తమ్‌రెడ్డి ఇప్పటికే మూడు ఉమ్మడి జిల్లాల్లోని కాంగ్రెస్‌ కీలక నేతలందరినీ కలిసి మద్దతు ఆశించడంతో పాటు, ఓటర్ల నమోదుకు ప్రత్యేకంగా శిబిరాలు నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి రెండోస్థానంలో నిలిచిన ఏనుగుల రాకే్‌షరెడ్డి మరోసారి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. ఆయన అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనా, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బీఆర్‌ఎస్‌ సైతం ఓటర్ల నమోదుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి పాలకూరి అశోక్‌

ఇంకోవైపు ఇదేస్థానం నుంచి 2024 ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ మద్దతుతో గెలిచిన తీన్మార్‌ మల్లన్న, ఆయన స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి, 2024 ఉప ఎన్నికలో బలమైన ఓట్లు సాధించి నాలుగోస్థానంలో నిలిచిన పాలకూరి అశోక్‌కుమార్‌గౌడ్‌ను అభ్యర్థిగా ప్రకటించి గట్టిపోటీకి సిద్ధమయ్యారు. పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఉపాధ్యాయసంఘ కీలక నేత సుంకరి భిక్షంగౌడ్‌ను ఆ సంఘం అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ సైతం భిక్షంగౌడ్‌కు మద్దతు ఇచ్చే అంశంపై పార్టీలో అంతర్గత అభిప్రాయసేకరణ నిర్వహించగా, సానుకూలత వ్యక్తమైంది. అయితే ఆ పార్టీ భిక్షంగౌడ్‌కు మద్దతిస్తుందా? లేదా ఆయన్ను పార్టీలో చేర్చుకొని పార్టీ అభ్యర్థిగా నిలబెడుతుందా? లేక వేరే అభ్యర్థిని బరిలో నిలుపుతుందా? అనే అంశం తేలాల్సి ఉంది. వీరితోపాటు ఇటీవల అటవీశాఖలో జిల్లా అధికారిగా పనిచేస్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన యర్కాల శ్రీనివా్‌సగౌడ్‌, ప్రభుత్వ అధికారిగా ఇంకా సర్వీస్‌ ఉన్నప్పటికీ స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసి ఎమ్మెల్సీగా బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. వీరితోపాటుగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణసేన పార్టీ అభ్యర్థిగా వరంగల్‌కు చెందిన డాక్టర్‌ నలమాస శ్రీకాంత్‌గౌడ్‌ బరిలో నిలుస్తున్నారు. ఆయనతోపాటు జనసేన అభ్యర్థిగా డాక్టర్‌ గడల శ్రీనివాసరావుతో పాటు మానవహక్కుల ఉద్యమనేత నలమాస కృష్ణ, రాష్ట్ర గిరిజన సంఘం నేత ధీరావత్‌ రవినాయక్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయా పార్టీలు, సంఘాల నుంచి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఈ సారి పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారనుంది.

ముసాయిదా జాబితా ప్రకారం ఓటర్లు ఇలా..

జిల్లా మండ పోలింగ్‌ పురుష మహిళా ఇత మొత్తం

లాలు స్టేషన్లు ఓటర్లు ఓటర్లు రులు ఓటర్లు

నల్లగొండ 33 146 65,933 41,070 0 1,07,003

సూర్యాపేట 23 95 43,704 25,108 1 68,813

యాదాద్రి 17 52 26,802 19,211 0 46,013

సిద్ధిపేట 4 7 4,121 2,271 0 6,392

జనగామ 12 42 20,013 12,894 1 32,908

మహబూబాబాద్‌ 18 52 31,385 18,182 0 49,567

వరంగల్‌ 13 84 37,746 24,799 1 62,546

హన్మకొండ 11 117 36,105 27,001 1 63,107

భూపాలపల్లి 7 25 9970 6370 0 16,340

భదాద్రికొత్తగూడెం 23 91 28815 23707 0 52522

ఖమ్మం 21 159 60,494 41,174 3 1,01,671

ములుగు 10 24 8896 5308 0 14,204

మొత్తం 192 894 3,73,984 2,47,095 7 6,21,086

Updated Date - Nov 26 , 2026 | 12:43 AM