అక్రమార్కుల చెరలో ప్రభుత్వ భూమి
ABN , Publish Date - Mar 07 , 2026 | 12:43 AM
చివ్వెంల మండలంలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికావడం పరిపాటిగా మారింది. పలు గ్రామాల్లో అక్రమార్కుల చేతుల్లోకి పోవడంతో ప్రభుత్వ భూములు కనుమరుగవుతున్నాయి.
అసైనమెంట్ కింద 12 గుంటలు
ఆక్రమణలో రెండు ఎకరాలు
మరో లబ్ధిదారుడికి బెదిరింపులు
చివ్వెంల మండలంలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికావడం పరిపాటిగా మారింది. పలు గ్రామాల్లో అక్రమార్కుల చేతుల్లోకి పోవడంతో ప్రభుత్వ భూములు కనుమరుగవుతున్నాయి. వల్లభాపురంలో ప్రభుత్వం ఇచ్చిన అసైన్డభూమిలో సాగు చేసుకుంటున్న ఓ కుటుంబం ఏకంగా రెండు ఎకరాల భూమిని ఆధీనంలోకి తీసుకుంది. అందులో పట్టాలు ఉన్న వారిని సైతం బెదిరింపులకు గురిచేస్తూ కబ్జా చేసి దర్జాగా పక్కా భవనాలు నిర్మించుకున్నారు. అయినా అధికారులు కిమ్మనడంలేదు.
- (ఆంధ్రజ్యోతి-చివ్వెంల)
ప్రధానంగా చెరువు శిఖాలు ఆక్రమణకు గురవుతున్నాయి. శిఖాలకు సమీపంలో తమ సొంత భూములు ఉండగా దానికి తోడుగా శిఖాలను ఆక్రమించుకొని కలుపుకుంటున్నారు. మరికొన్ని గ్రామాల్లో గ్రామకంఠం భూములు, ఇతర ప్రభుత్వ స్థలాలు పెద్దమొత్తంలో ఉండగా ఆ భూములు సైతం ఆక్రమణకు గురికాగా ఖాళీగా స్థలాలు లేకుండాపోయాయి. దీంతో పలు గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మించ తలపెట్టిన పలు భవనాలు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, నర్సరీలు, స్త్రీ శక్తి భవనాల లాంటి తదితర అభివృద్ధి భవనాల నిర్మాణాలకు అనువైన స్థలాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఏకంగా కొంతమంది ఇళ్లు నిర్మించుకోవడమే కాకుండా కొందరు ఇతర వ్యక్తులకు ప్రభుత్వ భూమిని సొంత భూములుగా చూపించుకుని తమకు అనుకూలమైన వారికి, కుటుంబీకులకు బదలాయింపు చేస్తున్నారు. కొన్నింటిని వ్యాపారాలకు అనువుగా భవనాలు నిర్మించుకొని లీజుకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టమొచ్చినట్లు భూములను ఆక్రమించుకుంటున్నారు.
వల్లభాపురంలో...
ఎలాంటి భూమి లేని పేదలకు తమ జీవనాధారం కోసం ప్రభుత్వం వ్యవసాయం చేసుకుని జీవనం సా గించాలని రాష్ట్ర ప్రభుత్వం అసైనమెంట్ కమిటీ ద్వారా కొంత భూమిని ఇచ్చి మనోధైర్యాన్ని నింపుతోం ది. ఈ భూములను పొందిన పేదలు వ్యవసాయం చేస్తు తమ కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇందులో భాగంగానే వల్లభాపురం రెవెన్యూ శివారులో సర్వే నెంబర్ 26లో ప్రభుత్వ భూమి 02.15 ఎకరాల భూ మి ఉండగా గుంపుల గ్రామానికి చెందిన పేదలైన కోల నాగలక్ష్మి, కోల యాదమ్మలకు చెరో 12 గుంటల భూమిని ప్రభుత్వం సాగు చేసుకోవడానికి పంపిణీ చేసింది. మొత్తం భూమిలో 24 గుంటలు పోగా మిగతా 01.31 ఎకరాల (ఎకరం 31 గుంటల) భూమి ఉండాలి. దాంట్లో కొంత భూమిలో మండలంలోని పలు గ్రామాలైన ఉర్లుగొండ, తుల్జారావుపేట, వల్లభాపురం, జగననాయక్ తండాతో పాటు పెనపహాడ్ మండలంలోని ధర్మాపురం, రంగయ్యగూడెం, మరికొన్ని ఆవాస తండాలకు మంచినీరు అందించేందుకు సుమారు 05(ఐదు గుంటలు) గుంటల భూమిలో మిషన భగీరథ ట్యాంకు నిర్మించి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మిగిలిన భూమి ప్రస్తుతం ఆక్రమణకు గురైంది. వ్యవసాయ ఆధారంగా ఇచ్చిన భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ఒకరి పేరు నుంచి మరొకరికి నిబంధనలకు విరుద్ధంగా మార్చుకోవడమే కాకుండా పక్కా భవనాలను నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కోలా నాగలక్ష్మి 2017లో చనిపోగా ఆమె పేరు మీద ఉన్న భూమిని భర్త సైదులు పేరు మీదకు బదలాయించి ప్రభుత్వం పట్టా మంజూరు చేసింది. ఆ తర్వాత అనారోగ్యంతో రెండేళ్లకు పైగా భూమిపైకి వెళ్లేందుకు సైదులు ప్రయత్నించగా బెదిరింపులకు గురిచేస్తున్నారు. భయభ్రాంతులకు గురిచేస్తూ వారి భూమిని ఆక్రమించుకున్నారు.
ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాకుండా చూస్తాం
మండలంలోని ప్రభుత్వ భూములు గురికాకుండా పర్యవేక్షణ చేస్తాం. ఆ భూములను ఎవరు ఆక్రమించినా నిబంధనలకు విరుద్ధంగా భూబదలాయింపులు జరిపినా తగు చర్యలు తీసుకుంటాం. బలవంతంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతర వ్యక్తుల భూములను ఆక్రమించుకుంటే కఠినచర్యలు తీసుకుంటాం. ఆ భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ స్థలాలను కాపాడుతాం.
చంద్రశేఖర్, తహసీల్దార్, చివ్వెంల