స్థలం, ఇల్లు లేని పేదలకు శుభవార్త
ABN , Publish Date - Apr 22 , 2026 | 12:01 AM
పేదలకు గృహ వసతి కల్పించే లక్ష్యంగా ఇందిరమ్మ ఇంటి పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను వినియోగంలోకి తెచ్చేందుకు నిర్ణయించిం ది.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మరమ్మతులు
వాటిని పంపిణీ చేసేందుకు ముమ్మర కసరత్తు
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి) : పేదలకు గృహ వసతి కల్పించే లక్ష్యంగా ఇందిరమ్మ ఇంటి పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను వినియోగంలోకి తెచ్చేందుకు నిర్ణయించిం ది. గతంలో ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి లబ్ధిదారులకు కేటాయించని, అసంపూర్తిగా నిలిచిన ఇళ్లను పూర్తిచేసి స్థలం, ఇళ్లు లేని నిరుపేదలకు కేటాయించేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది.
ప్రస్తుతం ఇంటి స్థలం ఉన్న పేదలకు సొం తింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే ఇల్లు, ఇంటి స్థలం లేని నిరుపేదలకు సైతం ఇంటిని సమకూర్చేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటి స్థలం ఉన్న లబ్ధిదారుల ను ఎల్-1గా గుర్తించి తొలి విడతగా ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేశారు. గృహ నిర్మాణాలు సైతం శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇల్లు, ఇంటి స్థలం లేని నిరుపేదలను ఎల్-2గా గుర్తించింది. ఈ కేటగిరీలో పెద్ద సంఖ్యలో పేదలు సొంతింటికోసం ఎదురుచూస్తున్నారు. వీరికి ఇప్పటికి ఇప్పుడు ఇంటి స్థలాలు కేటాయించలేని పరిస్థితులు ఉన్నందున, వారికి ప్రత్యామ్నాయంగా డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలనిఇ ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని భువనగిరి పట్టణంలో సింగన్నగూడెం, బీబీనగర్, వంగపల్లి, నారాయణపూర్, పోచంపల్లి, జిబ్లక్‌పల్లిలో డబుల్ బెడ్‌రూమ్ గృహ సముదాయాల్లో మిగిలిపోయిన పనులను పూర్తిచేసి, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
1,445 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు పక్కా గృహ నిర్మాణ పథకం కింద 3,506 డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను జిల్లాకు రెండు దశల్లో మంజూరు చేసింది. వీటిలో అనువైన స్థలాలను గుర్తించి 3,306 ఇళ్లకు టెండర్లు పిలిచారు. అందులో కేవలం 1,445 ఇళ్ల నిర్మాణానికి మాత్రమే టెండర్లు ఖరారయ్యాయి. నిర్మాణాలను ప్రారంభించిన ఈ కొద్దిపాటి గృహాలు సైతం వివిధ దశల్లో కొట్టుమిట్టాడుతుండగా, కొన్ని మాత్రం నిర్మా ణం పూర్తవడంతో లబ్ధిదారులను ఎంపిక చేశారు. మరికొన్ని చోట్ల చిన్న, చిన్న పనులు మాత్రమే అసంపూర్తిగా ఉన్నాయి. తాగునీటి వసతి, విద్యుత్, డ్రైనేజీ, అంతర్గత రహదారుల నిర్మాణాలను చేపట్టకపోవడంతో వాటిని లబ్ధిదారులకు సైతం కేటాయించలేదు. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కొద్దిపాటి నిధుల కేటాయింపుతో అసంపూర్తి పనులు, మౌలిక సదుపాయాలు కల్పించి ఇల్లులేని నిరుపేదలకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న డబుల్‌బెడ్‌రూమ్ సముదాయాలపై ప్రత్యేక దృష్టిసారించింది. లబ్ధిదారులకు కేటాయించిన గృహాల్లో పెండింగ్ పనులను పూర్తి చేసి, వారికి అప్పగించడమే కాకుండా, ఇప్పటి వరకు అప్పగించని వాటిని ఇందిరమ్మ ఇంటి దరఖాస్తుదారుల్లో అర్హులైన ఎల్-2 లబ్ధిదారులకు కేటాయించాలని నిర్ణయించింది.
జిల్లాలో ఏడు 2బీహెచ్‌కే కాలనీల గుర్తింపు
జిల్లాలో కొద్దిపాటి మౌలిక వసతుల కల్పన, అసంపూర్తిగా ఉన్న డబుల్‌బెడ్‌రూమ్ గృహ సముదాయా లు ఏడింటిని అధికారులు గుర్తించారు. వీటిలో భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెంలో 444 గృహాల సముదాయంలో మౌలిక సదుపాయాలను కల్పించి ఎంపిక చేసిన లబ్ధిదారులకు కేటాయింపు చేయాలని నిర్ణయించారు. అయితే లక్కీడీప్ ద్వారా చేసిన ఎంపికలో ఎల్-2 పరిధిలోకి రానివారిని గుర్తించి, వారి స్థానంలో ఎల్-2 దరఖాస్తుదారులకు కేటాయింపులు చేయనున్నారు. అదే విధంగా ఈ సముదాయంలో 444 గృహాలకు 400 నివాసానికి అనుకూలంగా పూర్తిస్థాయి పనులు జరిగాయి. మరో 44 గృహాలు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.2.55 కోట్లు మంజూరు చేయగా, 70శాతం పనులు పూర్తిచేశారు. సీవరేజ్ పనులు, వాటర్‌లైన్ కనెక్షన్లు పూర్తిచేయాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అదే విధంగా పోచంపల్లి పట్టణంలోని రేవన్‌పల్లిలో 120 గృహాల్లో అసంపూర్తిగా ఉన్న ఇంటర్నల్ పనులు పూర్తిచేశారు. విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. పోచంపల్లి మండలంలో 24 ఇళ్లను పూర్తిచేయడంతో పాటు వాటర్‌ట్యాంకు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కొండమడుగులో 30 గృహాల పనులు కొనసాగుతున్నాయి. అదే విధం గా బీబీనగర్‌లో లెప్రసీ కాలనీ వద్ద డంపింగ్ యార్డ్ సమీపంలో నివాసానికి ఇబ్బందికరంగా ఉన్నందున దాన్ని అక్కడి నుంచి తరలించేందుకు చర్యలు చేపట్టాలని లబ్ధిదారులు సూచించారు. యాదగిరిగుట్ట మండలంలో 40 గృహాల నిర్మాణం పూర్తయినా, ఇంటర్నల్ పనులు, సెప్టిక్‌ట్యాంక్ నిర్మాణం, విద్యుద్దీకరణ పనులు పూర్తిచేసి, ఇప్పటికే ఎంపిక చేసిన లబ్ధిదారులకు కేటాయించడానికి చర్యలు తీసుకుంటున్నారు.
నారాయణపూర్‌లో లబ్ధిదారులకే నిర్మాణ బాధ్యతలు
సంస్థాన్‌నారాయణపూర్ మండల కేంద్రంలో 120 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారు. జీ+1 ఫ్మార్మాట్ డిజైన్‌లో ఉన్న ఈ సముదాయంలో 112 గృహాల నిర్మాణాలకు ఎల్-2 లబ్ధిదారులను గుర్తించి నిధులు మంజూరు చేయనున్నారు. ప్రతీ ఇంటికి ఇద్దరు చొప్పున కలిసి నిర్మాణం పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది.
అసంపూర్తి పనులు వేగవంతం: శ్రీరాములు, గృహ నిర్మాణ సంస్థ పీడీ
జిల్లాలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ గృహ సముదాయాల ఏడు కాలనీలను గుర్తించాం. ఇక్కడ చిన్న చిన్న పనులు పూర్తిచేసి, లబ్ధిదారులకు కేటాయించడమేగాక, మరికొన్ని చోట్ల ఎల్-2 ఇందిరమ్మ లబ్ధిదారులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ మాసం వరకు అసంపూర్తి పనులు, మౌలిక వసతులు పూర్తిచేసేందుకు పనులను వేగవంతం చేశాం.