దేవాదుల నుంచి గోదావరి జలాలు
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:16 AM
జిల్లాతోపాటు జనగామ జిల్లాతో కలిపి మొత్తం 25వేల ఎకరాలకు దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ-6 ద్వారా వానాకాలం సీజన్‌కు గోదావరి జలాలు అందనున్నాయి.
జనగామ జిల్లాతో కలిపి 25వేల ఎకరాలకు నీరు
ముమ్మరంగా కాల్వల తవ్వకం పనులు
వచ్చే వానాకాలం నాటికి అందుబాటులోకి
(ఆంధ్రజ్యోతి,సూర్యాపేట(కలెక్టరేట్): జిల్లాతోపాటు జనగామ జిల్లాతో కలిపి మొత్తం 25వేల ఎకరాలకు దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ-6 ద్వారా వానాకాలం సీజన్‌కు గోదావరి జలాలు అందనున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో శ్రీరాంసాగర్ రెండోదశ ప్రాజె క్టు ద్వారా గోదావరి జలాలు వస్తున్నప్పటికీ అవి కొన్ని మండలాల్లోని కొంత ఆయకట్టుకు మాత్రమే పరిమితమయ్యాయి. జనగామ జిల్లాలో కూడా శ్రీరాంసాగర్ నీరు కొంతమేర అం దుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు ద్వారా జనగాంతోపాటు జిల్లాలో సాగునీరు అందని గ్రామాల కు నీరు అందించేందుకు చర్యలు చేపట్టింది.
దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ-6 ద్వారా సూర్యాపేట, జనగామ జిల్లాల పరిధిలోని 25,165 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఏ టూరునాగారం ఇన్‌టెక్‌వెల్ నుంచి గోదావరి జలాలను తీసుకుని సమ్మక్క-సారక్క బ్యారేజీ ద్వారా గోదావరి జలాలను కాల్వల ద్వారా నవాబ్‌పేట, తొర్రూరు మీదుగా స్టేషన్‌ఘన్‌పూర్ సమీపంలోని చెన్నూరు వద్దకు తరలించనున్నారు. అక్కడ ఏర్పాటుచేసిన 0.5టీఎంసీ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేయనున్నారు. అక్కడి నుంచి కాల్వల ద్వారా జనగాం, సూర్యాపేట జిల్లాలకు నీటిని తరలించనున్నారు. చెన్నూరు రిజర్వాయర్ నుంచి కాల్వల ద్వారా జనగామ జిల్లాతో పాటు జిల్లాలోని తిరుమలగిరి మండలం తొండ, తిరుమలగిరి, నెల్లిబండతండా, ఈదులపర్రెతండా, అనంతారం, తాటిపాముల, నందపురం, నాగారం మండలంలోని ఈటూరు, బండ్లపల్లి, మామిడిపల్లి గ్రామాలతో పాటు జనగామ జిల్లాలోని పలు గ్రామాల్లోని వ్యవసాయ భూములకు సాగు నీరందించే విధంగా చర్యలు చేపట్టారు.
తిరుమలగిరి, నాగారం మండలాల పరిధిలో 13,200 ఎకరాలకు...
తిరుమలగిరి మండలంలో 12,600 ఎకరాలు, నాగా రం మండలంలో 600 ఎకరాలు, జనగాం జిల్లాలోని పలు మండలాల పరిధిలో 11,965 ఎకరాలకు సాగునీరు అందనుంది. చెన్నూరు రిజర్వాయర్ నుంచి జన గాం జిల్లాలో 10కిలోమీటర్లు, జిల్లాలో 1.3కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వను నిర్మిస్తున్నారు. ఈ ప్రఽధాన కాల్వలకు అనుసంధానంగా జనగాం జిల్లాలో 1-ఎల్, 2-ఎల్, 3-ఎల్, 4-ఎల్, 5-ఎల్, 6-ఆర్, 7-ఆర్, 8-ఎల్, 9-ఎల్ డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లు, సబ్ మైనర్ కాల్వలు నిర్మించనున్నారు. ఈ కాల్వలు 70కిలోమీటర్ల వరకు ఉండనున్నాయి. జిల్లాలో 7-ఆర్, 10-ఆర్, 11-ఆర్, 12 టెయిలెండ్ కాల్వలు నిర్మించనున్నారు. జిల్లాలో డిస్ట్రిబ్యూటర్లు, మైన ర్లు, సబ్ మైనర్ కాల్వలు 40కిలోమీటర్ల మేర ఉండనున్నాయి. ఈ కాల్వల ద్వారా ఆయకట్టు పరిధిలోని వ్యవసాయ భూములకు నీళ్లు ఇవ్వడమే కాకుండా చెరువు లను నింపే విధంగా చర్యలు చేపడుతున్నారు.
పూర్తి కావచ్చిన కాల్వల తవ్వకాల పనులు
దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ-6 నిర్మాణానికి సంబంధించి కాల్వల తవ్వకాల పనులు పూర్తి కావొచ్చాయి. ప్రధాన కాల్వకు సంబంధించి 10 కిలోమీటర్లు తవ్వకాలు పూర్తి చేశారు. అదేవిధంగా కాల్వల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ కూడా పూర్తి చేసి భూములు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించారు. దీంతో కాల్వల తవ్వకాల పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి కానున్నాయి. పనులు సకాలంలో పూర్తయితే వచ్చే వానాకాలం నాటికి గోదావరి జలాలు సూర్యాపేట, జనగామ జిల్లాలోని పలు మండలాలకు రానున్నాయి.
పనులు సకాలంలో పూర్తి చేస్తాం: ప్రవీణ్, ఈఈ, దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ-6
దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ-6కు సంబంధించిన పనులను సకాలంలో పూర్తి చేస్తాం. ఇప్పటికే ప్రధాన కాల్వ తవ్వకాలు పూర్తి కావొచ్చాయి. డిస్ట్రిబ్యూటరీలు, మైనర్ కాల్వల పనులను త్వరలోనే పూర్తి చేస్తాం. కాల్వల నిర్మాణాలకు సంబంధిం చిన భూసేకరణ పూర్తయింది. ప్రాజెక్టు పూర్తయితే జనగాం, సూర్యాపేట జిల్లాలోని 26,165 ఎకరాలకు సాగునీరు అందనుంది.