అగ్రిమెంట్ ఇవ్వండి..లేదా ఖాళీ చేయండి
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:27 AM
విద్యార్థుల భవిషతను దృష్టిలో పెట్టుకుని భవన యజమాని చూపిన విశాల హృదయాన్ని చులకన చేశారు.
కలెక్టర్, డీఐవోకు కళాశాల భవన యజమాని లేఖ
అద్దె భవనంలో నార్కట్‌పల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ
మూడేళ్లయినా అందని అద్దె బకాయిలు
(ఆంధ్రజ్యోతి-నార్కట్‌పల్లి): విద్యార్థుల భవిషతను దృష్టిలో పెట్టుకుని భవన యజమాని చూపిన విశాల హృదయాన్ని చులకన చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ నిర్వహిస్తున్న తన భవనానికి గాను అద్దె చెల్లింపేమో కానీ కనీసం లీజు అగ్రిమెంట్ చేయమ న్నా అధికారులు పట్టించుకోలేదు. మూడేళ్లు గడుస్తు న్నా అగ్రిమెంట్ లేకపోవడం..అసెస్ మెంట్ చేయకపోవడంతో అద్దెరూపంలో ఒక్క పైసాకూడా రాలేదు. పై గా సొంత ఖర్చు రూ.10లక్షలు వెచ్చించి తరగతి గదులను తీర్చిదిద్దాడు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన భవన యజమాని చివరకు తన భవనాన్ని స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉన్నారు. లీజు అగ్రిమెంట్ ఇస్తారా..? లేక భవనాన్ని ఖాళీ చేస్తారా..? అంటూ జిల్లా కలెక్టర్‌తో పాటు డీఐవో కు సదరు కాలేజీ భవన యజమాని రాసిన లేఖ అందజేశారు. కాగా ఈనెలాఖరుకు గడువు విధించిన దరిమిలా నార్కట్‌పల్లిలో వచ్చే 2026-27 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
పక్కా భవనం లేక..
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జడ్పీ ఛైర్మన బండా నరేందర్‌రెడ్డి చొరవతో 2023-24 విద్యా సంవత్సరంలో నార్కట్‌పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ మంజూరయ్యింది. దీంతో కాలేజీని తొలుత స్థానిక జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలోనే నిర్వహించాలని భావించారు. కానీ పాఠశాల తరగతుల నిర్వహణకు గదులు సరిపోవని గ్రహించి ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఐతే కాలేజీ నిర్వహణకు అనువుగా ఉండే ప్రభుత్వ పక్కా భవనాలు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు అద్దె భవనమే ప్రత్యామ్నాయమైంది. దీంతో నార్కట్‌పల్లిలో ఇంతకు ముందు ప్రైవేటు కాలేజీ నిర్వహించిన గంట నర్సిరెడ్డికి చెందిన భవనాన్నే అనువైనదిగా నిర్ణయించి అదే భవనాన్ని అద్దెకు తీసుకునేలా నిర్ణయించిన ప్రజ్రాతినిధులు ఎట్టకేలకు ప్రభుత్వ జూనియర్ కాలేజీని ప్రారంభించడంతో తరగతులు కొనసాగాయి.
అసె్‌సమెంట్ చేయలేదు
నార్కట్‌పల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనానికి మూడేళ్లుగా అద్దె చెల్లింపు జరగడం లేదు. అద్దె చెల్లింపేమో కానీ కనీసం అద్దెను ఖరారు చేసేందుకు ముందు చేయాల్సిన అసె్‌సమెంట్ (కొలతలు వేసి అద్దె నిర్ణయించే ప్రక్రియ) కూడా నేటికీ చేపట్టలేదు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు కోసం ఏదైనా భవనాన్ని అద్దెకు తీసుకోవాలంటే కొన్ని నిబంధనలుంటాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఆ భవనానికి కొలతలు వేసి వైశాల్యం ఎంత ఉందో ఫీట్ల లెక్కన గుర్తిస్తారు. తర్వాత గదుల నిర్మాణ రకాన్ని బట్టి స్లాబ్, రేకులు గదులకు ఇతర మౌలిక సదుపాయాలు ఉంటే వాటికి మార్గదర్శకాలను బట్టి (ఫీటు లేదా గజం స్థలం) అద్దెను నిర్ణయించి యజమానితో సంబంధిత శాఖ అధికారులు ఒప్పందం కుదుర్చుకుంటారు. కానీ అద్దెను ఖరారు చేయకుండా మూడేళ్లుగా భవనాన్ని వాడుకుంటున్నా అద్దె విషయమై అధికారులు ప్రజాప్రతినిధులకూ పట్టకపోవడం విస్మయంగొలిపే విషయం.
అద్దె రాక అయోమయం
ఇదిలా ఉంటే మూడేళ్లుగా భవనంలో కాలేజీ నిర్వహిస్తున్నా యజమానికి మాత్రం అద్దె చెల్లింపు జరగలేదు. పైగా అద్దె ఎంత ఇవ్వాలో ఖరారు చేయాల్సిన భవన కొలతల ప్రక్రియ, ఒప్పంద పత్రం కూడా రాసుకోలేదు. ఎన్నో శాఖలకు చెందిన ప్రభుత్వ కార్యాలయాలు సొంత భవనాలు లేకున్నా అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నా దానికో ఆధారం, జవాబుదారీ తనం ఉంది. కాస్త వెనకో ముందో అద్దె వస్తుందనే ధీమా భవన యజమానులకూ ఉంటుంది. కానీ ఈ కాలేజీ భవనం విషయంలో నేటికీ (అసె్‌సమెంట్) అద్దె చెల్లింపు నిర్ణయ ప్రక్రియ ఖరారు చేయకపోవడం, అసె్‌సమెంట్ చేయకుండా అద్దె ఒప్పంద పత్రం లేకుండా అద్దె చెల్లింపు సాధ్యం కాదు. సుమారు 400 మంది విద్యార్థులకు సరిపడా తరగతి గదులున్న ఈ భవనానికి కనిష్టంగా నెలకు రూ.లక్ష అద్దె ఇవ్వొచ్చని అంచనా.
బకాయితో కూడిన లీజు అగ్రిమెంట్ ఇవ్వాలి
ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటుకు నా భవనాన్ని అద్దెకు తీసుకుంటామంటే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగొద్దని రూ.10లక్షలు వెచ్చించి కనీస వసతులు కల్పించా. కానీ మూడేళ్లయినా నేటి వరకు అద్దెకు సంబంధించి ఒక్క రూపాయి కూడా నాకు అందలేదు. సరికదా కనీసం అద్దె ఎం త చెల్లిస్తారో కూడా చెప్పలేదు. పేద విద్యార్థుల చదువును దృష్టిలో పెట్టుకుని ఇంతకాలం కొంత ఉదార స్వభావంతో వ్యవహరించాను. కలెక్టర్ లేదా ఇంటర్మీడియట్ జిల్లా అధికారులు స్పందించి భవ నం అద్దెను నిర్ణయించే లీజు అగ్రిమెంట్‌ను మూడే ళ్ల అద్దె బకాయిలు లేకుండా చెల్లించే విధంగా చొర వ చూపాలి. లేదా మూడేళ్ల బకాయిలను పూర్తిగా చెల్లించి భవనాన్ని ఖాళీ చేయాలని విజ్ఞప్తి.
-గంట్ల శ్రవణ్‌రెడ్డి, భవన యజమాని
లీజు అగ్రిమెంట్ నా పరిధిలో లేదు
నార్కట్‌పల్లి ప్రభుత్వ జూనియ ర్ కాలేజీ భవనం అద్దె చెల్లింపు లీజు అగ్రిమెంట్ వ్యవహారం నా పరిధిలో లేని అంశం. లీజు అగ్రిమెంట్ ఇవ్వాలని లేదా బకాయిలు చెల్లించి భవనాన్ని ఖాళీ చేయాలని భవన యజమాని తనకు లేఖ ఇచ్చిన మాట వాస్తవమే. లీజు అగ్రిమెంట్ ప్రతిపాదనల ఆమోదం కోసం ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శికి స్వయంగా అందజేస్తా.
- దస్ర్తూనాయక్, డీఐవో నల్లగొండ