రీ-సర్వేకు సన్నద్ధం
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:21 AM
నిజాం కాలం నాటి సర్వేలతో క్షేత్రస్థాయిలో నెలకొన్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తం గా ప్రభుత్వం భూ రీసర్వే కార్యక్రమాన్ని చేపడుతోంది. జిల్లాలోని 17 మండలాల్లో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో ఈ సర్వే నిర్వహించనున్నారు.
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం
సర్వే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
ఆధునిక పరికరాలతో కొలతలు
జిల్లాలో 70 గ్రామాలకు నోటిఫికేషన్
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): నిజాం కాలం నాటి సర్వేలతో క్షేత్రస్థాయిలో నెలకొన్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తం గా ప్రభుత్వం భూ రీసర్వే కార్యక్రమాన్ని చేపడుతోంది. జిల్లాలోని 17 మండలాల్లో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో ఈ సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేలో భూముల హద్దులను శాస్త్రీయంగా నిర్ధారించి, వాస్తవ పరిస్థితులకు అనుగుణం గా రికార్డులను నవీకరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ రీసర్వేను ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది.
భూ రీసర్వే ప్రక్రియలో భాగంగా జిల్లాలోని రెవెన్యూ, సర్వే విభాగం అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. జిల్లాలోని సర్వే విభాగానికి చెందిన అధికారులతో పాటు మండల సర్వేయర్లు, వారితో పాటు జీపీవోలు, జూనియర్ అసిస్టెంట్లను రీసర్వేకు వినియోగించనున్నారు. జిల్లాలోని 17 మండలాలకు 17 మంది సర్వేయర్లతో పాటు మరో 17 మంది గ్రామపాలనాధికారులు, లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను వినియోగించనున్నారు. రీ సర్వేలో రెవెన్యూ రికార్డులపై అవగాహన కలిగిన గ్రామపాలనాధికారులు ఆయా భూ కమతాలకు చెందిన రికార్డులు, తహసీల్దార్ నిర్ధారించిన పహాణీలతో సర్వేయర్లకు సహకరిస్తారు. అదే విధంగా ఆయా గ్రామాలకు చెందిన భూ కమతాల యజమానులకు నోటీసులు జారీ చేయడం, రీసర్వేపై అవగాహన కల్పించడం వంటి విధులు నిర్వహిస్తారు. వీరికి నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో సర్వేపై ఈనెల 23వ తేదీ వరకు అవగాహన కల్పిస్తారు. అనంతరం రీ సర్వే కోసం రంగంలోకి దిగుతారు. సర్వేకు ఆధునిక సాంకేతిక పరికరాలను వినియోగించనున్నారు. జిల్లాలో ప్రస్తుతం 11 అత్యాధునిక డిజిటల్ సర్వే పరికరాలు రోబోటిక్ టోటల్ స్టేషన్ (రోబర్స్) అందుబాటులో ఉన్నాయి. మూడింటిని యాదగిరిగుట్ట మునిసిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న నక్షా సర్వే పైల ట్ ప్రాజెక్టులో వినియోగిస్తున్నారు. మిగిలిన ఎనిమిది పరికరా ల ద్వారా ముందస్తు కార్యాచరణ ప్రకారం బృందాలను ఏర్పా టు చేసి దశల వారీగా జిల్లాలో ప్రభుత్వం ఎంపిక చేసి, గెజిట్ జారీ చేసిన 70 గ్రామాల్లో రీసర్వే చేపట్టనున్నారు.
తొలుత గ్రామ రెవెన్యూ సరిహద్దులు...
రీసర్వేకు ఎంపిక చేసిన గ్రామాల్లో తొలుత ఆ గ్రామ సరిహద్దు, రెవెన్యూ పరిధి, సర్వేనెంబరు హద్దు రాళ్లను గుర్తిస్తారు. ఈ మేరకు సరిహద్దులో ఉన్న రైతుల నుంచి సైతం అంగీకార పత్రాలు తీసుకొని గ్రామ సరిహద్దులను నిర్ధారిస్తారు. గ్రామ సరిహద్దుల నిర్ధారణ తర్వాత ప్రభుత్వ భూములు, గ్రామ కం ఠం హద్దులను నిర్ణయిస్తారు. ఆ తర్వాత రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న రికార్డుల ప్రకారం రైతుల భూ కమతాలను రీసర్వే చేసి రైతుల సమక్షంలోనే ల్యాండ్ పార్శిల్ సర్వేలను నిర్వహిస్తారు. అయితే సరిహద్దు రైతులు పేచీపెడితే మాత్రం ఆ భూకమతం వివాదం పెండింగ్‌లో ఉంటుంది.
కచ్చితమైన హద్దుల నిర్ధారణ
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రీసర్వేతో భూ కమతాలకు కచ్చితమైన హద్దులను నిర్ధారించనున్నారు. రైతుల అనుభవంలోని భూ సరిహద్దులు, విస్తీర్ణం, యజమాని వివరాలు, జియో కోఆర్డినేట్లు డిజిటల్ రూపంలో ల్యాండ్ పార్శిల్ మ్యాప్‌ను రూపొందిస్తారు. ప్రతీ కమతానికి ప్రత్యేక గుర్తింపు నెంబరు (యూనిక్ పార్శిల్ ఐడీ) జారీ చేస్తారు. రీసర్వేలో తొలుత పాత రెవెన్యూ రికార్డులు, ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్, రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలిస్తారు. భూమికి డిఫరెన్షియల్ జీపీఎస్ ద్వారా కచ్చితమైన నియంత్రణ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. ఆధునిక రోబర్స్ సాయంతో కొలతలను సేకరిస్తారు. అయితే భూముల హద్దులను పొరుగు రైతుల సమక్షంలోనే గుర్తించి నమోదు చేసి, డిజిటల్ ల్యాండ్ పార్శిల్ మ్యాప్ రూపొందిస్తారు. మొదట ముసాయిదా మ్యాప్‌ను గ్రామంలో ప్రదర్శించి, అభ్యంతరాలను స్వీకరించి, విచారణ అనంతరమే తుది ల్యాండ్ పార్శిల్ మ్యాప్‌ను ఆమోదించి రికార్డుల్లో నమోదు చేస్తారు.
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం
ప్రతీ గ్రామంలో భూ వివాదాల కారణంగా న్యాయ వివాదాలు, శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటువంటి భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా రీసర్వేను ప్రభుత్వం చేపట్టింది. ప్రతి భూకమతానికి కచ్చితమైన సరిహద్దు నిర్ధారణ, విస్తీర్ణం నమోదు, డిజిటల్ రికార్డులు అందుబాటులోకి రావడమే గాక, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, రుణాల వంటివి పొందడం సులభతరం అవుతుంది. అదే విధంగా భూ ఆక్రమణలను, నకిలీ రికార్డులను గుర్తించడం ద్వారా నిజమైన భూ యజమానులకు న్యాయం జరుగుతుంది.
సర్వే బృందాలకు భూ యజమానులు సహకరించాలి
జి.సుజాత, భూకొలతలు, రికార్డులశాఖ ఏడీ
జిల్లాలో భూ రీసర్వేకు 17 మండలాల్లో 70 గ్రామాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశాం. భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం రీసర్వే చేపడుతోంది. దీనికి సంబంధించి ప్రతీ భూమి సొంతదారులు, రిజిస్ట్రేషన్‌దారులు నిర్దేశించిన గ్రామాల్లో, సమయానికి హాజరై సర్వే బృందాలకు సహకరించాలి. భూమి సరిహద్దులను గుర్తించడానికి, ఇతర సమాచారం అందించేందుకు అధికారుల సూచనల మేరకు హాజరుకావాలి. ఆధునిక యంత్ర పరికరాలతో శిక్షణ పొందిన సర్వే బృందాలు, రెవెన్యూ అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ల్యాండ్ పార్శిల్ మ్యాప్‌ను రూపొందించి ప్రజల సమక్షంలో ప్రదర్శించి, అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన అనంతరం రికార్డుల్లో నవీకరిస్తారు.
భూ రీసర్వేకు ఎంపికైన గ్రామాలు
మండలం రెవెన్యూ గ్రామాలు
అడ్డగూడూరు చిర్రగూడురు, ధర్మారం, చిన్నపడిశాల, జానకీపురం
ఆలేరు బహద్దూర్‌పేట, శ్రీనివాసపురం, మంతపురి, పటేల్‌గూడెం
ఆత్మకూర్(ఎం) ధర్మాపూర్, రాఘవాపూర్, లింగరాజుపల్లి, కాల్వపల్లి
భువనగిరి తాజ్‌పూర్, రాంచంద్రాపూర్, యర్రంబెల్లి, పగిడిపల్లి
బీబీనగర్ బగ్ధయారా, రహీంఖాన్‌గూడ, మహదేవ్‌పూర్, రంగాపూర్, అన్నంపట్ల
బొమ్మలరామారం బండకాడిపల్లి, బోయినిపల్లి, యావపూర్, జలాల్‌పూర్
గుండాల మాసాన్‌పల్లి, వంగాల, సుద్దాల, కొమ్మాయిపల్లి
మోటకొండూరు చామాపూర్, దుర్సుగానిపల్లి, దిలావర్‌పూర్, వర్టూర్
మోత్కూరు అనాజీపూర్, ముసిపట్ల, పాటిబండ్ల, పనకబండ
రాజాపేట బూరుగుపల్లి, లక్ష్మక్కపల్లి, కాల్వపల్లి, బసంతపురం
తుర్కపల్లి కోమటికుంట, శ్రీనివాసపురం, నాగాయపల్లి, ధర్మారం
యాదగిరిగుట్ట సాదువెల్లి, రామాయంపేట, పెద్దకందుకూరు, చిన్నకందుకూర్
బి.పోచంపల్లి జగత్‌పల్లి, అలీనగర్, అబ్దుల్లానగర్, రాంలింగంపల్లి, హైదర్‌పూర్
చౌటుప్పల్ ఖైరత్‌పూర్, ఎల్లగిరి, ధర్మజీగూడ, అల్లాపూర్,
నారాయణపూర్ కోతులపూర్, గుడ్డిమల్కాపూర్, కంకణాలగూడెం, చిమిర్యాల
రామన్నపేట బి.తుర్కపల్లి, సూరారం, బాచుప్పల, నిదానపల్లి
వలిగొండ గంగాపురం, కాశమ్మకుంట, గోపరాజుపల్లి, గురునాధపల్లి