Share News

భవిష్యత్‌ దిక్సూచీ

ABN , Publish Date - Jan 27 , 2026 | 01:14 AM

అత్యున్నత కార్పొరేట్‌ స్కూళ్లలో మాత్రమే అందుబాటులో ఉండే ప్రపంచస్థాయి ప్రమాణాలు, అత్యున్నత కార్పొరేట్‌ స్కూళ్లలో అందుబాటులో ఉన్న వాల్డార్ఫ్‌ విద్యావిధానం నల్లగొండలో ప్రభుత్వ పాఠశాలలో అమల్లోకి రానుంది.

భవిష్యత్‌ దిక్సూచీ

బొట్టుగూడ ప్రభుత్వ స్కూల్‌లో వాల్డార్ఫ్‌ విద్యావిధానం

రూ.8కోట్లతో ప్రభుత్వ పాఠశాలను నిర్మించిన ప్రతీక్‌ ఫౌండేషన్‌

అత్యాధునిక హంగులతో జీప్లస్‌ త్రీ భవనం

సెంట్రల్‌ ఏసీ, డిజిటల్‌ తరగతులలో బోధన

నేడు పాఠశాలను ప్రారంభించనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ, జనవరి 26 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): అత్యున్నత కార్పొరేట్‌ స్కూళ్లలో మాత్రమే అందుబాటులో ఉండే ప్రపంచస్థాయి ప్రమాణాలు, అత్యున్నత కార్పొరేట్‌ స్కూళ్లలో అందుబాటులో ఉన్న వాల్డార్ఫ్‌ విద్యావిధానం నల్లగొండలో ప్రభుత్వ పాఠశాలలో అమల్లోకి రానుంది. ప్రతి పేదపిల్లవాడి మోములో తన కుమారుడిని చూసుకుంటానని, వారికి అత్యున్నత స్థాయి విద్యనందించడమే లక్ష్యమని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక చొరవ, కృషితో నల్లగొండలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్‌ ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో ఈ విద్యావిధానం అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. నల్లగొండ నగరం నడిబొడ్డున శిథిలావస్థలో ఉన్న బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను కోమటిరెడ్డి ప్రతీక్‌ ఫౌండేషన్‌ ద్వారా రూ.8కోట్లతో అత్యాధునికంగా నిర్మించి, ప్రపంచస్థాయి నాణ్యతగల వాల్డార్ఫ్‌ విధానంలో బోధన సాగేలా చర్యలు తీసుకున్నారు. ఆటబొమ్మలతో శిశుతరగతులు, హైస్కూల్‌ విద్యార్ధులకు కంప్యూటర్‌ ల్యాబ్‌లు, ఆడియో, వీడియో పాఠాలు, అత్యాధునిక విద్యాబోధనను అందించేలా సౌకర్యాలతో నాలుగంతస్తుల్లో ఈ పాఠశాల భవనాన్ని పునర్నిర్మించారు. పాఠశాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఆధునిక హంగులతో ...

కోమటిరెడ్డి ప్రతీక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నల్లగొండ నగరంలోని బొట్టుగూడలో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలను రూ.8 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. వాల్డార్ఫ్‌ విద్యావిధానంతో 600 మంది విద్యార్థులకు ప్రపంచస్థాయి నాణ్యత గల విద్య అందుబాటులోకి రాబోతోంది. విద్యార్ధులకు పాఠాలు బోధించే 36 తరగతి గదులకు సెంట్రల్‌ ఏసీ అమర్చారు. పై అంతస్తులో ఆడిటోరియం, ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. మంత్రి వెంకటరెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో ఈ పాఠశాల పునర్నిర్మాణ పనులను ప్రతీక్‌ ఫౌండేషన్‌ సీఈవో ఎంవీ గోనారెడ్డి పర్యవేక్షణలో చేపట్టారు. పాఠశాలలోని ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ విద్యాబోధనకు అనుకూలంగా కంప్యూటర్లతో కూడిన డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేశారు. చిన్నపిల్లల కోసం ఆటబొమ్మలతో ప్రత్యేకంగా ల్యాబ్‌ని పొందుపరచారు. ప్రతి అంతస్తులో తాగునీరు, టాయిలెట్ల సదుపాయాలతో పాటు మినీ ఆడిటోరియాలు అందుబాటులోకి తెచ్చారు. పిల్లలు ఆడుకునేందుకు టెన్నీస్‌ కోర్టు ఏర్పాటు చేశారు. హైజినిక్‌గా ఉండేలా వాష్‌రూమ్స్‌ నిర్మించారు. పిల్లలకు ఉపయుక్తంగా ఉండేలా అత్యాధునిక లైబ్రరీని ఏర్పాటు చేశారు. విద్యార్థులు సైతం వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక భద్రత కలిగిన లిఫ్ట్‌ అందుబాటులో ఉంది. తరగతి గదుల గోడలపైన స్వామివివేకానంద, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వంటి మహనీయుల బొమ్మలు ఏర్పాటు చేశారు. స్కూల్‌కు ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని క్రీడామైదానంగా కేటాయిస్తూ అభివృద్ధి చేశారు.

పేద పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగడమే నా లక్ష్యం

నల్లగొండ నగరంలోని పేదపిల్లలు ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలే కాదు, ప్రపంచ స్థాయి సంస్థల అధినేతలుగా ఎదగాలనేదే నా కోరిక. డబ్బులేక, వనరుల్లేక ఏ ఒక్క పేద విద్యార్థి చదువుకు దూరం కావొద్దనే లక్ష్యంతో ప్రతీక్‌ ఫౌండేషన్‌ ద్వారా సేవలందిస్తున్నాం. ప్రపంచస్థాయి ప్రమాణాలు పాటించే వాల్డార్ఫ్‌ విద్యావిధానంతో బొట్టుగూడ స్కూల్‌ని రిన్నోవేషన్‌ చేసి అందుబాటులోకి తెస్తున్నందుకు సంతోషపడుతున్నాను. శ్లోక బిర్లా వంటి స్కూళ్లలోనే మన రాష్ట్రంలో ఈ వాల్డార్ఫ్‌ విద్యావిధానం అందుబాటులో ఉంది. ఆ స్కూళ్లలో చదవాలంటే భారీగా ఫీజులు కట్టాల్సి ఉంటుంది. నల్లగొండలోని ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు ఎలాంటి ఫీజులు లేకుండా ఈ తరహా విద్యావిధానాన్ని అందుబాటులోకి తెచ్చాం. పేదవిద్యార్ధుల కోసం ప్రతీక్‌ ఫౌండేషన్‌ ద్వారా ఎన్ని వ్యయప్రయాసలకైనా ఓర్చుకుంటాం.

- కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి

Updated Date - Jan 27 , 2026 | 01:14 AM