విష వాయువు పీల్చి నలుగురికి అస్వస్థత
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:57 AM
సూర్యాపేట రూరల్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా కేంద్రం శివారు దాసాయిగూడెం సమీపంలోని కోహెన్స్ ఫార్మసీ కంపెనీలో విష వాయువు పీల్చి నలుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు
సూర్యాపేట రూరల్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా కేంద్రం శివారు దాసాయిగూడెం సమీపంలోని కోహెన్స్ ఫార్మసీ కంపెనీలో విష వాయువు పీల్చి నలుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కోహెన్స్ ఫార్మసీ కంపెనీలో నాలుగు షిఫ్ట్‌లుగా కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 3గంటల సమయంలో పెద్ద శబ్దం వచ్చి పొగ బయటకు రావడంతో సమీపంలోని వస్త్రాంతండావాసులు అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్‌తో గ్యాస్ లీకై ఒక్కసారిగా పొగ రూపంలో విష వాయువులు బయటికి రావడంతో ఆ సమయంలో విధుల్లో ఉన్న నాగరాజు, అంజయ్య, వినోద్, లక్ష్మయలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి మెరుగ్గానే ఉండగా, ఇద్దరిని కంపెనీ ప్రతినిధులు సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిందని తెలుసుకున్న వస్త్రాంత ండావాసులు కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తాము తరుచుగా అనారోగ్యం బారిన పడుతున్నా యాజమాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. తండావాసుల ఆందోళనకు సీపీఎం, సీఐటీయూ, మాస్‌లైన్, కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. యాజమాన్యం తక్షణమే కార్మికులకు భద్రత చర్యలు చేపట్టాలని, కాలుష్య నియంత్రణ మండలి నియమ నిబంధనలు పాటిస్తూ సమీప ప్రాంత ప్రజలను కాపాడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో లింగానాయక్, నెమ్మాది వెంకటేశ్వర్లు, కొత్తపల్లి రేణుక, తండా వాసులు పాల్గొన్నారు.
------------------------ ---------------------------------------------------------