Forensic audit : ‘ధరణి’పై ఫోరెన్సిక్ ఆడిట్
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:08 AM
ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలను తేల్చేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధంచేస్తోంది. ఈ పోర్టల్ ద్వారా చేపట్టిన భూలావాదేవీలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న జిల్లాల్లో జరిగిన ధరణి పోర్టల్ లావాదేవీలపై ప్రభుత్వం ప్రత్యేకదృష్టి కేంద్రీకరించింది.
అక్రమ భూ లావాదేవీలను తేల్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు
సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహణ
ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక నివేదికలో అవినీతి, అక్రమాలు వెలుగులోకి..
అన్ని జిల్లాల్లోనూ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయం
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలను తేల్చేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధంచేస్తోంది. ఈ పోర్టల్ ద్వారా చేపట్టిన భూలావాదేవీలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న జిల్లాల్లో జరిగిన ధరణి పోర్టల్ లావాదేవీలపై ప్రభుత్వం ప్రత్యేకదృష్టి కేంద్రీకరించింది. ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించే సంస్థలతో గుర్తించేందుకు చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలోని సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థతో ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక నివేదికలో అవినీతి, అక్రమాలు జరిగినట్లు తేలినట్లు సమాచారం. అయితే ఈ నివేదికను పరిశీలించిన తర్వాత 31 జిల్లాల్లో ఆడిట్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో జిల్లాలోని మొత్తం 17 మండలాల్లో జరిగిన లావాదేవీలపై ఆడిట్ చేయనున్నారు. ఇటీవల జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వ్యవసా య భూముల రిజిస్ర్టేషన్లు, స్టాంపు డ్యూటీ ఎగవేత కుంభకోణం కూడా ధరణి పోర్టల్‌లోని సాంకేతిక లోపాలవల్లే జరిగాయని, ఈ జిల్లాల్లో వెలుగులోకి వచ్చిన రిజిస్ర్టేషన్ కుంభకోణంపై ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీ ప్రకటించింది.
జిల్లాలో రూ.3.72కోట్లు కాజేశారు
జిల్లాలోని చౌటుప్పల్‌లో 237, యాదగిరిగుట్టలో 212, రాజాపేటలో 323, మోటకొండూరులో 59, తుర్కపల్లిలో 55, వలిగొండలో 41, బొమ్మలరామారంలో 26, నారాయణపురంలో 29, భూదాన్‌పోచంపల్లిలో 9, గుండాలలో 8, భువనగిరిలో 11, రామన్నపేటలో 6, బీబీనగర్‌లో 5, ఆలేరులో 3, ఆత్మకూరు(ఎం) లో 1లు మొత్తంగా జిల్లాలో 1025 స్లాట్లకు రూ.3.84కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.11.54 లక్షలు మాత్రమే చెల్లించారు. దీంతో జిల్లా పరిధిలో రూ.3.72కోట్లు కాజేశారు. ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలపై తగిన విచారణ చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ పోర్టల్‌లో జరిగిన లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా అక్రమాలను తేల్చేందుకు సన్నద్ధమవుతోంది. ఈ పోర్టల్ ద్వారా అప్పటి అధికారులు అర్ధరాత్రివేళ పలు పైళ్లను అప్రూవల్ చేసినట్టుగా, ఆన్‌లైన్‌లో ఇత ర దేశాల నుంచి పోర్టల్ ద్వారా అక్రమాలు జరిగినట్లుగా ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా నిషేధిత భూములు ధరణిలో జరిగిన లావాదేవీలపై ఆరా తీయనున్నారు. ధరణి పోర్టల్‌లో నిషేధిత భూములు, దేవాదాయ, వక్ఫ్, కోర్టుల పరిధిలో కేసులు నడుస్తోన్న భూములను కూడా మ్యుటేషన్ చేసినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. విచారణకు రెవెన్యూ శాఖ సన్నాహాలు చేస్తోంది.
సవాల్‌గా మారిన అక్రమ లావాదేవీలు
ధరణి పోర్టల్ 2020నవంబరు 2వ తేదీ నుంచి పనిచేస్తున్న నేపథ్యంలో లక్షల ఈ-ఫైళ్లు అందులో నమోదయ్యాయి. వాటిలో అక్రమ లావాదేవీలను కనుగొనడానికి ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. పోర్టల్ వేదికగా రాష్ట్రవ్యాప్తంగా రోజూ కొన్ని వేల ఈ-పైళ్లు అప్‌లోడ్, డౌన్‌లోడ్ అయ్యాయి. తహసీల్దార్/జాయింట్ సబ్‌రిజిస్ర్టార్, కలెక్టర్, జిల్లా ధరణి సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఈ-ఫైలింగ్ ద్వారా లావాదేవీలు పూర్తవుతుంటాయి. ఈ సమాచారమంతా సెంట్రల్ సర్వరల్‌లో నిక్షిప్తమవుతుంది. ఫోరెన్సిక్ ఆడిట్ ఏజెన్సీలు జిల్లా కేంద్రం స్థాయిలోనా? మండల కేంద్రం స్థాయిలోనా ఆడిట్ నిర్వహించాలా? అన్న అంశంపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. కలెక్టర్‌కు ప్రత్యేకంగా అనుమతులు ఇచ్చిన పెండింగ్ మ్యుటేషన్ల జారీ ప్రక్రియలోనూ ప్రభుత్వ భూములకు హక్కులు కల్పించారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దీనిపైనా దృష్టి పెట్టారు.
‘ధరణి’లో జరిగిన లావాదేవీలపై ఆరా
ధరణి పోర్టల్‌లో 2020 నవంబరు 2వ తేదీ నుంచి వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయి. గతంలో అన్ని రిజిస్ర్టేషన్లు కూడా సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో జరిగేవి. అయితే ధరణి పోర్టల్ అమలుతో తహసీల్దార్లను జాయింట్ రిజిస్ర్టార్లుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పోర్టల్ ద్వారా సాధారణ ప్రక్రియకు భిన్నంగా జరిగిన లావాదేదీలను ముందుగా గుర్తించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిషేధిత భూములు ధరణిలో జరిగిన లావాదేవీలపై ఆరా తీయనున్నారు. అనుమానిత అక్రమ భూలావాదేవీల భూముల రికార్డులు, ప్రదేశం, సమయం ఏదైనా టాంపరింగ్ జరిగిందా? అన్న కోణంలో దర్యాప్తు చేయనున్నారు. అనంతరం భూలావాదేవీలు ఏ కంప్యూటర్ చిరునామాతో(ఐపీ) ప్రక్రియ పూర్తయిందనేది బయటపడుతుందని నిపుణులు పరిశీలిస్తున్నారు.
ఉన్నతాధికారుల కమిటీ విచారణ షురూ..
ధరణి, భూ భారతి పోర్టల్‌లో వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్ల కేసుపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఉన్నతాధికారులతో కమిటీని వేసింది. ఈ కేసుకు సంబంధించి సాంకేతిక, నేర పూరిత అక్రమాలకు సంబంధించిన ఆధారాలను రాబట్టడంలో కమిటీ నిమగ్నమైంది. ప్రభుత్వ నిర్ణయంతో రిజిస్ర్టేషన్ల కుంభకోణంపై విచారణతోపాటు ధరణి పోర్టల్‌లో లావాదేవీలపై సోషల్ ఆడిట్ ఏకకాలంలో జరుగనున్నాయి. జిల్లాలో మొత్తం 1,367 వరకు వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్లలో స్టాంపు డ్యూటీ చార్జీలు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. క్షేత్రస్థాయిలో పోలీసుల విచారణ ఓ వైపు, సాంకేతిక ఆధారాలకోసం రాష్ట్రవ్యాప్తంగా ధరణి, భూభారతి లావాదేవీల ఆడిటింగ్ నిర్వహించనున్నారు. ప్రభుత్వం తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్(టీజీటీఎస్) సమన్వయంతో ఆడిటింగ్ ఏజెన్సీల ఆధ్వర్యంలో పూర్తి విచారణ చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. ధరణి పోర్టల్లో ఆన్‌లైన్ వేదికగా జరిగిన ఈ వ్యవహారంలో గుట్టురట్టు చేయాలంటే సాంకేతిక పరిజ్ఞానంలో పట్టున్న నిపుణులు అవసరమని ఇదివరకే గుర్తించింది.
ఇతర రాష్ట్రాల నిపుణులతో
తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల్లో గల ఫోరెన్సిక్ నిపుణుల సంస్థలను ప్రభుత్వం పరిశీలించింది. ఆడిటింగ్ నిర్వహించే సామర్థ్యం ఉన్న సంస్థలతో రెవెన్యూ శాఖ సంప్రదింపులు జరిపింది. ప్రభుత్వం ఎంపిక చేసిన జిల్లాల్లో త్వరలోనే ఆడిట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ధరణి పోర్టల్‌ను 2020లో అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి 2025 మధ్యకాలంలో జరిగిన లావాదేవీలపై ఆరా తీయనుంది. ఈ కేసు విచారణలో భాగంగా రిజిస్ర్టేషన్ లావాదేవీలు నిర్వహించిన రైతులకు ఇప్పటికే రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. జిల్లాలో మొత్తం భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 17 మండలాలు ఉన్నాయి. వీటిలో భువనగిరి, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, బొమ్మలరామారం, వలిగొండ, తదితర మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి. భువనగిరి మండలంలోని రాయిగిరితోపాటు యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాలు వైటీడీఏ పరిధిలో ఉన్నాయి. ఈ మండలాల్లో స్థిరాస్థి వ్యాపారం జోరుగా సాగింది. భూముల క్రయవిక్రయాలు కూడా బాగా కొనసాగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా జరిగిన లావాదేవీలను పరిశీలించనుంది. ఆడిట్ జరిగే జిల్లాల్లో ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఫోరెన్సిక్ ఆడిట్ నిపుణులకు సహకరించాలని ఆదేశాలు జారీచేశారు. జిల్లాల్లో ధరణికి ముందు, అనంతరం జరిగిన భూముల రికార్డుల వివరాలను సంబంధిత అధికారులకు అందించాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా ధరణిలో జరిగిన లావాదేవీలపై క్షుణ్ణంగా పరిశీలన చేయనున్నారు.