వేతనాల కోసం మూడునెలలుగా..
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:17 AM
జిల్లాలో గ్రామీణులకు నిత్యం ఉపాధి కల్పిస్తున్న ఉపాధిహామీ ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందడం లేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు నివారించేందుకు తీసుకువచ్చిన ఉపాధిహామీ పథకంలో ప్రతిరోజూ పనిచేస్తున్నా ఉద్యోగులకు వేతనాలు రాకపోవడంతో కుటుంబపోషణ ఇబ్బందిగా మారుతోంది.
అందక ఇబ్బందుల్లో ఉపాధిహామీ ఉద్యోగులు
జిల్లాలో సుమారు రూ. 2 కోట్లు బకాయి
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట(కలెక్టరేట్): జిల్లాలో గ్రామీణులకు నిత్యం ఉపాధి కల్పిస్తున్న ఉపాధిహామీ ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందడం లేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు నివారించేందుకు తీసుకువచ్చిన ఉపాధిహామీ పథకంలో ప్రతిరోజూ పనిచేస్తున్నా ఉద్యోగులకు వేతనాలు రాకపోవడంతో కుటుంబపోషణ ఇబ్బందిగా మారుతోంది. మూడు నెలలుగా వేతనాలు చెల్లించడంలేదు. దీంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో కూలీలకు వీలైనన్ని రోజులు పని కల్పించాలనే ప్రభుత్వాల లక్ష్యాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఉద్యోగులు వేతనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 23 మండలాల పరిధిలోని 475 గ్రామాల్లో ఉపాధిహామీ పనులు చేపడుతున్నారు. అందులో 2,61,1 92 కుటుంబాలకు జాబ్‌కార్డులు అందజేశారు. ఆ జాబ్‌కార్డుల పరిధిలో 5,69,350 మంది సభ్యులు కూలీలుగా నమోదు చేసుకున్నారు. వీరందరికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధి హామీ ఉద్యోగులు పనులు కల్పిస్తున్నారు. వేసవిలో మండుటెండల్లో సైతం ఉపాధి పనులు చేయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్నా సకాలంలో వేతనాల డబ్బులు రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. జిల్లాలో ఉపాధిహామీ ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు రావడంలేదు. దీంతో అప్పులు చేసి ఉద్యోగులు కుటుంబాలను పోషించుకుంటున్నారు. జిల్లాలో రూ.2 కోట్లకు పైగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి.
అన్నివిభాగాల్లోనూ బకాయిలు
జిల్లాలో ఉపాధిహామీ పథకంలో వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు రావడం లేదు. 48మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 23 మంది ఈసీలు, 18 మంది ఏపీవోలు, 79 మంది టీఏలు విధులు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లకు సంబంధించి మూడు నెలలకు రూ.48లక్షలు, ఈసీలకు సుమారు రూ.47 లక్షలు, ఏపీవోలకు సుమారు రూ.32లక్షలు, టీఏలకు రూ.73లక్షల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి.
త్వరలో వేతనాలు అందుతాయి : సన్యాసయ్య, డీఆర్‌డీవో, సూర్యాపేట
ఉపాధిహామీ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ వేతనాలు త్వరలోనే అందుతాయి. వేతనాలకు సంబంధించి ట్రెజరీకి పంపించాం. ప్రభుత్వం నుంచి బడ్జెట్ విడుదల కాగానే ఉద్యోగుల బ్యాంకు ఖాతాలో నిధులు జమవుతాయి. ఎప్పటికప్పుడు ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు చర్యలు చేపడుతున్నాం.