గంజాయి దందాపై నజర్!
ABN , Publish Date - Aug 18 , 2026 | 11:55 PM
గంజాయి దందా మాఫియాగా మారిన వైనంపై ఉక్కుపాదం మోపేందుకు పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. గంజాయి, మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల సరఫరా నిరోధంపై కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ పాత నేరస్థులు పోలీసులకు దొరక్కుండా కొత్తదారుల్లో దందా సాగిస్తున్న వైనంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
‘ఆంధ్రజ్యోతి’ కథనంపై ఆరాతీసిన పోలీస్ అధికారులు, ఇంటెలిజెన్స్ వర్గాలు
పాత నేరస్థులపై నిఘా పెంచాలని నిర్ణయం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): గంజాయి దందా మాఫియాగా మారిన వైనంపై ఉక్కుపాదం మోపేందుకు పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. గంజాయి, మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల సరఫరా నిరోధంపై కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ పాత నేరస్థులు పోలీసులకు దొరక్కుండా కొత్తదారుల్లో దందా సాగిస్తున్న వైనంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
నల్లగొండ కేంద్రంగా ఓ పాత నేరస్థుడి నేతృత్వంలో గంజాయి దందా సాగిస్తోన్న తీరుపై మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ మినీలో ప్రచురితమైన ‘పాత నేరస్థుడి గంజాయి దందా’ కథనంపై పోలీ్‌సశాఖ జిల్లా ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి. కథనంలో పేర్కొన్న ప్రతీ అంశంపై లోతైన విచారణకు పోలీసులు రంగంలోకి దిగారు. పాత నేరస్థుల కదలికలు, కార్యకలాపాల పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ‘ఆంధ్రజ్యోతి’ కథనంలో పేర్కొన్న ప్రతీ అంశంపైనా విచారించి నిగ్గుతేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. జిల్లాలో గంజాయి విక్రయాలను పూర్తిగా నిరోధించడంతో పాటు, ఈ దందాలో పాల్గొంటున్న వారందరినీ గుర్తించి చర్యలు తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.
మరింత దూకుడుగా..
జిల్లాలో గంజాయి, మత్తుపదార్థాల నిరోధానికి ఇప్పటికే చేపడుతున్న చర్యలను మరింతగా విస్తృతపరచాలని పోలీస్ అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. జిల్లాలో రిజర్వాయర్ల వద్ద చేపల వేట పేరుతో వెళ్లి అక్కడ ఇతర ప్రాంతాల వారికి గంజాయి విక్రయించే అంశంపైనా నిఘా పెంచనున్నారు. నల్లగొండలో పాతనేరస్థులు చేస్తున్న సివిల్ దందాలపైనా పూర్తి విచారణ నిర్వహించనున్నారు. గంజా యి కేసుల్లో అరెస్టయి, రిహ్యాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్సకు పొందివచ్చిన వారి కార్యకలాపాలను పరిశీలించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. యువతులతో అసభ్యకర ప్ర వర్తనలపైనా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అసాంఘిక, నేర కార్యకలాపాలకు పాల్పడేవారిని గుర్తించే కార్యాచరణను పోలీసులు చేపట్టినట్లు సమాచారం. ఎక్కడా గంజాయి, మత్తు పదార్థాల వినియోగం ఉండకూడదని, సామాజిక రుగ్మతగా మారిన దీన్ని వందశాతం అరికట్టడమే పోలీ్‌సశాఖ ఏకైక లక్ష్యంగా పనిచేయాలని, అందుకోసం సీరియ్‌సగా రంగంలోకి దిగాలని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.
యువత జీవితాల్లో గంజాయి చిచ్చు...
మాదకద్రవ్యాల నిరోధానికి ప్రభుత్వం ఎన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నా యువతను ఆ మహమ్మారి బారినపడకుండా నియంత్రించలేని పరిస్థితి జిల్లాలో కొనసాగుతోంది. ఓ వైపు అవగాహన కార్యక్రమాలు, మరోవైపు సరఫరాదారులపై కేసులు పెడుతున్నా పూర్తిస్థాయిలో నియంత్రణ కావడం లేదు. యువత ప్రధానంగా పాతిక, ముప్పై ఏళ్లలోపువారు ఎక్కువగా గంజాయితో పాటు హ్యాష్ ఆయిల్, నిషేధిత మత్తు ట్యాబ్లెట్లు, మత్తు పదార్థాలు మాదకద్రవ్యాలు, ఈ-సిగరెట్లు తాగడం వరకు పరిస్థితి చేరుకుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రంతో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, మునుగోడు తదితర ప్రాంతాల్లోనూ గంజాయి విచ్చలవిడి విక్రయాలు సాగడంతో పాటు, యువతకు నిరంతరం సరఫరాచేసే వ్యవస్థ ఏర్పాటైందని, ఇటీవల కాలంలో ఈ ప్రాంతాల్లో గంజాయి సేవిస్తూ, గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన సంఘటనలే అందుకు నిదర్శనంగా చెబుతున్నారు. జిల్లాలో గడచిన ఏడాది కాలంలో 88 గంజాయి, మాదకద్రవ్యాల కేసులు నమోదైతే, 266 మందిని అరెస్టు చేశారు. అందులో 85మంది వరకు పాతికేళ్లలోపు యువకులు ఉండగా, కొందరు మైనర్లు సైతం ఉండడం బాధాకరం. జిల్లాలో గంజాయి సహా ఎలాంటి మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాల విక్రయాలు జరిగినా, సంబంధిత పోలీ్‌సస్టేషన్లతో పాటు 8712670266 నెంబర్‌కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.