Share News

Panchayats: పంచాయతీలకు ఆర్థిక భరోసా

ABN , Publish Date - May 26 , 2026 | 11:52 PM

గ్రామపంచాయతీలకు 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రానికి రూ.9,968 కోట్లు కేటాయించారు. అయితే జిల్లా విషయానికొచ్చే సరికి 481 పంచాయతీలకు రూ.40 నుంచి రూ.50 కోట్ల నిధులు మంజూరు కానున్నాయి.

Panchayats: పంచాయతీలకు ఆర్థిక భరోసా

16వ సంఘం నిధులు విడుదల

జిల్లాకు రూ.50 కోట్లు వచ్చే అవకాశం

తీరనున్న మౌలిక సమస్యలు

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట): గ్రామపంచాయతీలకు 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రానికి రూ.9,968 కోట్లు కేటాయించారు. అయితే జిల్లా విషయానికొచ్చే సరికి 481 పంచాయతీలకు రూ.40 నుంచి రూ.50 కోట్ల నిధులు మంజూరు కానున్నాయి. 2026 - 27 నుంచి 2030 - 31 వరకు విడుతల వారీగా నిధులు మంజూరు చేయనున్నారు. ఈ నిధుల వినియోగం, పర్యవేక్షణ పారదర్శకతపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం నిధులను ఏఏ అవసరాలకు వినియోగించాలో స్పష్టంగా నిర్దేశించింది. గ్రామీణ, స్థానికసంస్థలైన పంచాయతీలు, మండల, జిల్లా ప్రజాపరిషత్‌లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుధ్య, వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ రహదారుల నిర్మాణం, వీధిదీపాలు, ఇతర ప్రజాసేవల కోసం వినియోగించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఈ నిధులను వేతనాలు, పింఛన్ల చెల్లింపుల కోసం వినియోగించరాదని ఆదేశించారు. ఇప్పటికే 15వ ఆర్థిక సంఘ నిధులు జిల్లాకు రూ.25 కోట్లు మంజూరయ్యాయి. ఆయా పంచాయతీల్లో జనాభా ఆధారంగా నిధులు కేటాయింపులు చేయనున్నారు. ఇంకా రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు పనులు చేపట్టాల్సి ఉంది. 16వ ఆర్థిక సంఘ నిధుల ఖర్చు వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సి ఉంది. అంతేకాక త్రైమాసిక, వార్షిక పురోగతి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా సమగ్ర నివేదికలను రాష్ట్రం కేంద్రప్రభుత్వానికి అందజేస్తుంది. ఆడిట్‌లో గుర్తించిన లోపాలను తక్షణమే సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నిధులు దారి మళ్లించినా, దుర్వినియోగం చేసినా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.

నిధుల్లో 80శాతం పంచాయతీలకే..

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘ నిధుల్లో 80శాతం పంచాయతీలకు కేటాయిస్తోంది. మండల, జిల్లా పరిషత్‌లకు 10శాతం చొప్పున కేటాయిస్తారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో మొదటిగా జూన్‌లో ఒకసారి, అక్టోబరులో మరోసారి నిధులు విడుదల అవుతాయి. స్థానిక సంస్థలకు ఏ మేరకు ఆర్థిక వనరులు సమకూర్చుతారనే అంశం ఆధారంగా రాష్ట్ర పనితీరును, పన్నుల వసూలు, సొంత ఆదాయ వనరుల పెంపుదల ఆధారంగా పంచాయతీల పనితీరును పరిశీలించి 20 శాతం నిధులు ఇవ్వడంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. 2026 నాటి అంచనా ప్రకారం గ్రామీణ జనాభాకు 90 శాతం, రాష్ట్ర వైశాల్యానికి 10శాతం వెయిటేజీ ప్రాతిపదికన నిధులు కేటాయించింది. కేవలం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిధుల కేటాయింపు జరుగనుంది.

నివేదికలు తప్పనిసరి

మొదటి విడత నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధికి కేటాయించిన 2025-26 బడ్జెట్‌ను ఆయా స్థానికసంస్థల ఆడిట్‌ను సమర్పించారు. మొదటి విడత నిధుల వినియోగ ధ్రువీకరణ, పురోగతి నివేదికల ప్రకారం రెండో విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంటుంది. గ్రాంట్‌లను నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు విడుదలచేస్తారు. వాటిని 10రోజుల్లో సంబంధిత స్థానిక సంస్థలకు బదిలీ చేస్తుంటారు. నిర్దేశించిన అవసరాలకు కేటాయించే నిధులను వెచ్చించాలి. వాటిని టైడ్‌ నిధులుగా వ్యవహరిస్తారు. అన్‌టైడ్‌ నిధుల్లో 20శాతం కన్నా ఎక్కువ నిధులను రోడ్ల నిర్మాణం, నిర్వహణ కోసం ఖర్చు చేయరాదు. నిధుల వినియోగంపై గ్రామ సభల్లో, మండల, జిల్లా పరిషత్‌ సమావేశాల్లో విధిగా తీర్మానం చేయాలి. వాటిని ఈ-గ్రామస్వరాజ్‌ పోర్టల్‌లో నమోదు చేయాలి. కేంద్రప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో గ్రామాల అభివృద్ధికి వెసలుబాటు లభించినట్లయ్యింది.

రూ.50 కోట్ల వరకు వచ్చే అవకాశం: యాదగిరి, డీపీవో

16వ ఆర్థిక సంఘ నిధులు జిల్లాకు రూ.40 నుంచి రూ.50కోట్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నిధులను కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఖర్చు చేయాలి. ఐదేళ్ల పాటు నిధులు విడుదలవుతాయి. ప్రతి ఖర్చుకూ ఆడిట్‌ ఉంటుంది.

Updated Date - May 26 , 2026 | 11:52 PM