Share News

వేగంగా సర్‌

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:18 AM

ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్‌)కు జిల్లా యంత్రాంగం వడివడిగా అడుగులు వేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జూన్‌ 25వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు ఓటరు సవరణ చేపట్టనున్నారు.

వేగంగా సర్‌

జిల్లాలో 87.03 శాతం ఓటరు మ్యాపింగ్‌ పూర్తి

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి) : ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్‌)కు జిల్లా యంత్రాంగం వడివడిగా అడుగులు వేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జూన్‌ 25వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు ఓటరు సవరణ చేపట్టనున్నారు. ప్రతీ 25 ఏళ్లకు ఒకసారి చేపట్టే ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ కార్యక్రమంపై జిల్లా అధికార యంత్రాంగం, రాజకీయపార్టీల ప్రతినిధులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు.

రెండు దశల్లో చేపట్టే ఓటరు జాబితాలో 2002 సంవత్సరం తర్వాత ఓటరు జాబితాలో నమోదైన ఓటర్లను 2025 ఓటరు జాబితా ఆధారంగా గుర్తిస్తారు. వారికి సంబంధించిన స్థానికతను నిరూపించే ఆధారాలను సేకరించి, అనర్హులుగా గుర్తిస్తే జాబితా నుంచి నిబంధనల ప్రకారం తొలగించనున్నారు. ఒకే వ్యక్తి రెండు.. అంతకంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉంటే గుర్తించి తొలగిస్తారు. మొదటి దశలో ఓటర్ల జాబితా మ్యాపింగ్‌ చేపట్టి, దాని ప్రకారం బీఎల్‌వోలు, ఆయా రాజకీయ పక్షాల ఏజంట్ల సమక్షంలో సర్వే నిర్వహించనున్నారు. అయితే ఈ ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ కార్యక్రమం జిల్లాలో వేగవంతంగా కొనసాగుతోంది. జిల్లాలోని ఆలేరు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్‌ బూత్‌ల వారీగా మ్యాపింగ్‌ ప్రక్రియ తుది దశకు చేరుకుంది.

ఇంటింటికీ బీఎల్‌వోలు

ప్రతీ 25 ఏళ్లకు ఒకసారి భారత ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ చేపడుతుంది. ప్రతీ పోలింగ్‌ బూత్‌లో 1000-1200 మంది ఉండే విధంగా చూసి మ్యాపింగ్‌ చేస్తారు. ఈ మ్యాపింగ్‌ ప్రకారం ఆయా బూత్‌స్థాయి అధికారి ఇంటింటిని సం దర్శించి ఇంట్లో ఓటర్‌ అర్హతలను పరిశీలించి నిర్ధారిస్తారు. 2002కు ముందు పుట్టిన ఓటరు నమోదుపై తండ్రి, కుటుంబ సభ్యులు, రక్తసంబంధీకుల ధ్రువీకరణలను పరిశీలించనున్నారు. ఇందుకోసం 12 ధ్రువీకరణ పత్రాల్లో ఒకటి చూపెట్టాల్సి ఉంటుంది. ఆ విధమైన రు జువులు చూపెడితేనే ఓటరు జాబితాలో కొనసాగుతుంది. ఒకవేళ సరైన ధ్రువపత్రాలు లేనిపక్షంలో నిబంధనల ప్రకారం నోటీసులిచ్చి ఓటరు జాబితా నుంచి తొలగించనున్నారు. అదేవిధంగా రెండు చోట్ల ఓట్లు ఉన్నవారిని, మరణించిన వారిపేర్లను సైతం తొలగించడానికి చర్యలు చేపట్టనున్నారు. ఇలా ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ కోసం బీఎల్‌వో అధికారి ఒక్కో ఇంటిని కనీసం నాలుగు పర్యాయాలు సందర్శించాల్సిన అవసరముంటుందని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో 2025 ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం 4,67,489 ఓటర్లకు 4,06,840 మంది ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తిచేశారు. ఇంకా 60,649మంది ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. భువనగిరి నియోజకవర్గంలో 2,25,452 మంది ఓటర్లకు 1,91,546మంది మ్యాపింగ్‌ జరగ్గా, మరో 33,906మంది మ్యాపింగ్‌ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలోని 2,42,036మంది ఓటర్లకు 2,15,294మంది ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తిచేశారు. మరో 26,743మంది మ్యాపింగ్‌ చేయాల్సి ఉంటుంది.

జిల్లాలో ఓటర్లు 4,67,489

ఎన్నికల సంఘం 2025లో సవరించిన ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 4,67,489మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో గల రెండు పూర్తి నియోజకవర్గాలైన భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు సంబంధించి 12 మండలాలకు సంబంధించిన ఓటరు జాబితాలోని ఓటర్లను మాత్రమే జిల్లా అధికారులు ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ చేపడుతున్నారు. జిల్లాలోని భు వనగిరి నియోజకవర్గంలో 2,25,452 మంది ఓటర్లు జాబితా, ఆలేరు నియోజకవర్గంలోని 2,42,037 మంది ఓటర్ల జాబితా మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తున్నారు. జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో పోలింగ్‌ బూత్‌స్థాయిలో ఓటరు జాబితా ప్రకారం మ్యాపిం గ్‌ అనంతరం బీఎల్‌వోలు ఇంటింటికీ తిరిగి మరణించిన, అనర్హులను గుర్తించి ఓటర్ల జాబి తా నుంచి తొలగిస్తారు. అదేవిధంగా నవతరం ఓటర్లును జాబితాలో నమోదు చేస్తారు. ఈ విధంగా జిల్లాలో మ్యాపింగ్‌ ప్రక్రియ జిల్లాలో 87.03 శాతం పూర్తిచేశారు. నియోజకవర్గాల ప్రకారం భువనగిరిలో 84.96శాతం, ఆలేరు నియోజకవర్గంలో 88.95శాతం పూర్తిచేశారు.

ఎస్‌ఐఆర్‌పై సమీక్షలు, సమావేశాలు

జిల్లాలో ఎస్‌ఐఆర్‌ను విజయవంతం చేయాడానికి జిల్లా అధికార యంత్రాంగం సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అదనపు కలెక్టర్‌ కె. వెంకారెడ్డి ఆధ్వర్యంలో బీఎల్‌వోలకు శిక్షణ, అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీలతో సర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. రాజకీయ పార్టీలు బూత్‌స్థాయిలో ప్రతినిధులుగా బీఎల్‌ఏ నియామకాలు చేయడానికి ఆయా పార్టీలతో సంప్రదింపులు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఇంటింటి సర్వేకోసం బీఎల్‌వోలు, ఇతర అధికారులకు జూన్‌ 15 నుంచి 24వ తేదీ వరకు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. బూత్‌లెవల్‌ అధికారులు జూన్‌25 నుంచి జూలై 24వతేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. జూలై 24వ తేదీన పొలింగ్‌ బూత్‌ల రేషనలైజేషన్‌ చేస్తారు. జూలై 31న ఓటరు జాబితా ముసాయిదాను ప్రకటిస్తారు. ఆగస్టు 30వ తేదీవరకు ఓటరు జాబితాపై అభ్యంతరాలు, క్లయిమ్స్‌ స్వీకరిస్తారు. సెప్టెంబరు 28వ తేదీ వరకు అభ్యంతరాలను, క్లయిమ్స్‌ను పరిష్కరిస్తారు. అక్టోబరు1వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు.

2025 ఓటరు జాబితా ప్రకారం..

నియోజకవర్గం మొత్తం ఓటర్లు మ్యాపింగ్‌ శాతం

భువనగిరి 2,25,542 1,91,546 84.96

ఆలేరు 2,42,037 2,15.294 88.95

మొత్తం 4,67,489 4,06,840 87.03

Updated Date - Jun 01 , 2026 | 12:18 AM