Share News

municipalities: మునిసిపోల్స్‌కు శరవేగంగా..

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:25 AM

మునిసిపల్‌ ఎన్నికల సన్నాహాలు ఒక్కోటి వేగంగా పూర్తవుతున్నాయి. సంక్రాంతి పండుగ ముగిసిన మరుక్షణమే మునిసిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

municipalities: మునిసిపోల్స్‌కు శరవేగంగా..

ప్రభుత్వానికి చేరిన బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ సిఫార్సులు

34శాతం వరకు రిజర్వేషన్లు కల్పిస్తారనే సంకేతాలు

పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీల పరిమిత జనాభాతో బీసీలకు పెరగనున్న కోటా

పండుగలోపు గెజిట్‌ వస్తేనే నల్లగొండ కార్పొరేషన్‌కు ఎన్నికలు!

ఆంధ్రజ్యోతిర పతినిధి, నల్లగొండ: మునిసిపల్‌ ఎన్నికల సన్నాహాలు ఒక్కోటి వేగంగా పూర్తవుతున్నాయి. సంక్రాంతి పండుగ ముగిసిన మరుక్షణమే మునిసిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఓ వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌శాఖ రిజర్వేషన్ల ఖరారుకు కసరత్తు చేస్తోంది.

మునిసిపల్‌ ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల అమలుకు బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ రూపొందించిన సిఫార్సుల నివేదికను సోమవారమే రాష్ట్ర మునిసిపల్‌ శాఖకు అందజేయగా, ఆ శాఖ ఉన్నతాధికారులు రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఓటర్ల తుది జాబితా ఖరారు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 16లోగా పోలింగ్‌ కేంద్రాలు, లొకేషన్లు, పోలింగ్‌ స్టేషన్లు, వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలు రూపొందించేందుకు సిద్ధమైంది. ఈలోగా చైర్మన్‌, మునిసిపల్‌ వార్డుల రిజర్వేషన్లు ఖరారవుతాయని భావిస్తున్నారు.

34శాతం వరకు బీసీలకు రిజర్వేషన్లు!

మునిసిపాలిటీల్లో బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ల కోటాపై బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ సిఫార్సులు ప్రభుత్వానికి చేరాయి. రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం మునిసిపల్‌ ఎన్నికల్లో బీసీలకు 34శాతం వరకు రిజర్వేషన్లు ఇవ్వాలని కమిషన్‌ ప్రధానంగా సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు 50శాతానికి లోబడి రిజర్వేషన్ల కోటా నిర్ణయించాల్సి ఉండగా, కమిషన్‌ రాష్ట్రంలోని మునిసిపాలిటీ జనాభా ఆధారంగా ఈ సిపార్సులుచేసినట్లు చెబుతున్నారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా గ్రామీణ ప్రాంతాల కంటే తక్కువగా ఉండడంతో ఆ రెండు వర్గాలకు కలిపి రిజర్వేషన్లను 15శాతం వరకు ఇచ్చి మిగిలిన 34శాతం బీసీలకు ఇవ్వాలని సూచించినట్లు పేర్కొంటున్నారు. ఎస్టీ, ఎస్సీల జనాభాను ప్రాతిపదికగా చేసుకొని ఎక్కువగా జనాభా ఉన్న వర్గానికి మునిసిపాలిటీల్లో ఎక్కువ వార్డులు కేటాయించి రిజర్వేషన్లు ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీల జనాభా గణనీయంగా ఉన్నచోట్ల రిజర్వేషన్లను ఈ రెండువర్గాలకు 20శాతం వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. స్వల్ప సంఖ్యలోని మునిసిపాలిటీల్లో ఈ పరిస్థితి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. సగటున బీసీలకు 28శాతం నుంచి 34 శాతం వరకు రిజర్వేషన్లు దక్కుతాయని, ఎస్టీలకు 5 నుంచి 7శాతం, ఎస్సీలకు 12 నుంచి 15శాతం వరకు రిజర్వేషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ సిఫార్సుల ఆధారంగా ఒక ఫార్ములాను రూపొందించి దాని ప్రకారం కార్పొరేషన్‌, మునిసిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్లు, అదేవిధంగా ఆయా కార్పొరేషన్ల డివిజన్లు, మునిసిపాలిటీల్లో వార్డులకు రిజర్వేషన్ల కోటా ఇస్తారని, కోటా ఖరారయ్యాక సీఎం, క్యాబినెట్‌ మంత్రుల ఆమోదం మేరకే రిజర్వేషన్లు విడుదలచేస్తారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికల మాదిరిగానే మునిసిపల్‌ ఎన్నికల్లోనూ 2019 ఎన్నికల రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకొని రొటేషన్‌ అమలు చేస్తారని తెలుస్తోంది. మహిళలకు 50శాతం సీట్లను అన్ని కేటగిరీల రిజర్వేషన్లలో అమలు చేయనున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో రొటేషన్‌ అమలు చేయడంతో బీసీలకు ఉమ్మడి జిల్లాలో రిజర్వేషన్‌ కోటా తగ్గిందని, ఈ ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందనే అంశం రిజర్వేషన్లు ఖరారైతే తేలనుందని బీసీ సంఘాల నాయకులు చెబుతున్నారు.

గెజిట్‌వస్తేనే కార్పొరేషన్‌కు ఎన్నికలు

నల్లగొండ మునిసిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తూ ఇటీవలే అసెంబ్లీలో బిల్లు అమోదం పొందింది. ప్రస్తుతం ఉన్న మునిసిపాలిటీ హద్దులు, పరిధితోనే కార్పొరేషన్‌ ఏర్పాటుచేయడంతో దీనిపై ప్రజాభిప్రాయసేకరణ అవసరం లేకుండా పోయింది. అయితే కార్పొరేషన్‌గా మారాలంటే అసెంబ్లీ, మండలిలో పాసైన బిల్లుకు గవర్నర్‌ ఆమోద ముద్రవేసి, గెజిట్‌ ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే గవర్నర్‌ కార్యాలయానికి బిల్లు చేరిన నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆశిస్తున్నారు. కార్పొరేషన్లు, మునిసిపాలిటీల రిజర్వేషన్ల ప్రకటన వచ్చేలోగా నల్లగొండ కార్పొరేషన్‌ గెజిట్‌ వస్తేనే కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతాయని, గెజిట్‌ ప్రక్రియ ఆలస్యమైతే ఎన్నికలను వాయిదావేసే అవకాశం ఉందని అధికారవర్గాల్లో చర్చ సాగుతోంది. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా మునిసిపల్‌ అధికారులు మునిసిపాలిటీ పరిధిలోనే ఓటర్ల జాబితాల సవరణ, పోలింగ్‌ స్టేషన్ల ముసాయిదా ప్రకటన చేశారు. కార్పొరేషన్‌ గెజిట్‌ ఒకటి, రెండు రోజుల్లో విడుదల అవుతుందనే ధీమా అధికార పార్టీ వర్గాల్లో ఉంది. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో గెజిట్‌ జాప్యమైతే మాత్రం తదుపరి జీహెచ్‌ఎంసీ, ఖమ్మం కార్పొరేషన్లకు ఏప్రిల్‌, మేలో జరిగే ఎన్నికలతో పాటు నల్లగొండ కార్పొరేషన్‌ ఎన్నికలు జరుగుతాయని అంచనావేస్తున్నారు.

Updated Date - Jan 14 , 2026 | 12:25 AM