కార్పొరేషన్‌లో నకిలీ కార్మికులు!
ABN , Publish Date - Nov 12 , 2026 | 12:10 AM
నల్లగొండ కార్పొరేషన్ నకిలీ కార్మికులకు కామధేనువుగా మారింది. ఇక్కడ ఔట్‌సోర్స్ కార్మికులుగా నమోదైన కొందరు ఎలాంటి పనిచేయకుండా నెలనెలా వేతనాలు తీసుకుంటూ కార్పొరేషన్ ఖజానాకు గండికొడుతున్నారు. నల్లగొండ మునిసిపాలిటీగా ఉన్న సమయంలో వీరంతా మునిసిపల్ కార్మికులుగా నమోదయ్యారు.
నల్లగొండలో పలువురి తిష్ఠ
పనిచేయకపోయినా నెలనెలా దర్జాగా వేతనాలు
మునిసిపాలిటీగా ఉన్న సమయంలోనే వీరి నియామకాలు
వీఐపీల కార్యాలయాలు, ఇళ్లల్లో పనులు చేస్తున్నట్టు రికార్డులు
దశాబ్దకాలంగా కొనసాగుతున్న నకిలీ వ్యవహారం
విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని డిమాండ్లు
(నల్లగొండ, ఆంధ్రజ్యోతిప్రతినిధి): నల్లగొండ కార్పొరేషన్ నకిలీ కార్మికులకు కామధేనువుగా మారింది. ఇక్కడ ఔట్‌సోర్స్ కార్మికులుగా నమోదైన కొందరు ఎలాంటి పనిచేయకుండా నెలనెలా వేతనాలు తీసుకుంటూ కార్పొరేషన్ ఖజానాకు గండికొడుతున్నారు. నల్లగొండ మునిసిపాలిటీగా ఉన్న సమయంలో వీరంతా మునిసిపల్ కార్మికులుగా నమోదయ్యారు. వీరు ఏళ్లతరబడిగా నెలనెలా వేతనాలు తీసుకుంటున్నారే తప్ప, ఏ ఒక్కరోజూ సంబంధిత విభాగాల్లో పనిచేయలేదని ఇతర కార్మికులు విమర్శిస్తున్నారు. మునిసిపాలిటీ మొదలు కార్పొరేషన్‌లో పాలకవర్గాలు, అధికారులకు ఈ నకిలీ తతంగమంతా తెలిసినా రాజకీయ, పాత్రికేయ, అధికార పలుకుబడి ఉండటంతో వారిని ఉద్యోగం నుంచి తొలగించలేక, వారితో పనిచేయించలేక మిన్నకుంటున్నారు. సుమారు 30 మందికిపైగా ఇలా నకిలీ కార్మికులు నల్లగొండ కార్పొరేషన్‌లో ఎలాంటి పనిచేయకుండా నెలనెలా వేతనాలు పొందుతున్నట్టు కార్మికవర్గాల్లో చర్చ సాగుతోంది.
దశాబ్దకాలంగా వ్యవహారం...
నల్లగొండ మునిసిపాలిటీగా ఉన్న సమయంలో సుమారు పదేళ్ల క్రితం నకిలీ కార్మికుల వ్యవహారం మొదలైంది. పదేళ్ల క్రితం మునిసిపాలిటీలో అదనపు కార్మికుల కోసం ఔట్‌సోర్స్ విధానంలో నియామకాలు చేపట్టారు. ఆ సమయంలో సుమారు 20 మంది వరకు నకిలీలు రాజకీయ పలుకుబడి, ఉన్నతాధికారుల ప్రాపకం, పాత్రికేయ బంధుత్వంతో ఉద్యోగాల్లో చేరారు. వారెవ్వరూ ఒక్కరోజు కూడా కార్మికులుగా మునిసిపాలిటీలో పనిచేయలేదు. వీరిపై అప్పుడప్పుడు విమర్శలు, ఫిర్యాదులు వచ్చినా రాజకీయ అండదండలతో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఆ తర్వాత మరో పాలకవర్గం కొలువుదీరినా ఇదే తరహాలో మరో 20 మంది వరకు ఉద్యోగాలు పొందారు. వీరిలో ఛోటా నాయకులు, పాత్రికేయులు, పైరవీకారులు వారి కుటుంబీకుల పేర్లతో ఉద్యోగాలు పొందారు. ఈ నియామకాలను ఆసరాగా చేసుకొని కొందరు ఛోటా లీడర్లు వారి కుటుంబీకులు, అనుచరులకు సైతం మునిసిపాలిటీ లో పరిమితికి మించి నియామకాలు చేయించారు. దీంతో మునిసిపాలిటీపై ఆర్థికభారం పెరగడం, అవసరానికి మించి కార్మికు లు ఉన్నట్టు ఉన్నతాధికారుల నుంచి తాఖీదులు వచ్చాయి. దీం తో 2024 తర్వాత నిర్వహించిన సమీక్ష తర్వాత మునిసిపాలిటీలో అడ్డదారుల్లో నియమితులైన కొందరు కార్మికులను తొలగించారు. ఆ సమయంలో కూడా ఈ నకిలీలు మాత్రం వారిపై వేటుపడకుండా తప్పించుకున్నారు. పలుకుబడితో ఇప్పటికీ వీరంతా ఉద్యోగాల్లో కొనసాగుతూ పనిచేయకుండా నెలనెలా వేతనాలు పొందడంపై ఇతర కార్మికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ నకిలీల వ్యవహారం అందరికీ తెలిసిపోవడంతో ప్రస్తుతం కొందరు పైరవీకారులు, రాజకీయ పరిచయాలు ఉన్నవారు తమకూ అలాంటి ఉద్యోగాలు ఇప్పించాలని కొందరు నేతలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నట్టు చర్చ సాగుతోంది.
చర్యలకు వెనకంజపై విమర్శలు
నల్లగొండ కార్పొరేషన్‌లో పేరుకు కార్మికులుగా నమోదయినప్పటికీ ఒక్క రోజు ఉద్యోగం చేయకపోయినా వేతనాలు మాత్రం నెలనెలా ఠంచనుగా ఇస్తున్నారు. సాధారణ కార్మికులు జ్వరం, అనారోగ్యం కారణంగా ఒక్క రోజు పనిచేయకపోతే వేతనంలో కోత విధించే అధికారులు వీరికి మాత్రం అసలు పనిచేయకపోయినా నెలనెలా బ్యాంక్ అకౌంట్‌లో వేతనం జమచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో రోజూ పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ఫేస్ రికగ్నయిజేషన్ (ఎఫ్‌ఆర్‌ఎస్) ద్వారా రోజూ హాజరు తీసుకునే అధికారులు ఈ నకిలీలకు మాత్రం ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు లేకుండా రిజిస్టర్లలో సంతకాలు పెట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉద్యోగులు వేర్వేరు రంగాల్లో ఇతర చోట్ల పనిచేసుకుంటూ ఇక్కడ నెలాఖరున వచ్చి సంతకాలు చేసి వేతనాలు పొందుతున్న వైనం ఉన్నతాధికారులకు తెలుసునని, అయినా పట్టించుకోవడం లేదని పలువురు కార్మికులు విమర్శిస్తున్నారు. ప్రధానంగా ఈ నకిలీలంతా వీఐపీలు, ఉన్నతాధికారుల ఇళ్లల్లో, కార్యాలయాల్లో, క్యాంపు కార్యాలయాల్లో పనిచేస్తున్నట్లు రికార్డుల్లో నమోదు చేసి వీరికి వేతనాలు చెల్లిస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ పని ప్రదేశాల్లో ఎక్కడా వీరు ఒక్క రోజు కూడా పనిచేయలేదని, అంతా రికార్డుల్లో మాత్రమే ఉందనే చర్చ సాగుతోంది. కార్పొరేషన్ కమిషనర్, ఇతర అధికారులందరికీ ఈ తతంగమంతా బహిరంగంగానే తెలిసినా, వారు ఎలాంటి తనిఖీలు చేపట్టడం, ప్రత్యక్ష పరిశీలన చేయడం వంటి చర్యలేవీ తీసుకోవడం లేదని, ఈ నకిలీల పలుకుబడికి అధికారులు మిన్నకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా నకిలీల వ్యవహారంపై కార్పొరేషన్ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని పలువురు కార్మికుల డిమాండ్ చేస్తున్నారు.