ఫీజుల మోత
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:27 AM
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల మోత మోగుతోంది. యాజమాన్యాలు ప్రతీ ఏడాది ఫీజులు పెంచుతుండటంతో తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పిల్లల భవిష్యత్తే తమ భవిష్యతగా భావించి అప్పులు చేసి మరీ పిల్లలను చదివిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట అర్బన)
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల మోత మోగుతోంది. యాజమాన్యాలు ప్రతీ ఏడాది ఫీజులు పెంచుతుండటంతో తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పిల్లల భవిష్యత్తే తమ భవిష్యతగా భావించి అప్పులు చేసి మరీ పిల్లలను చదివిస్తున్నారు. నర్సరీ నుంచి ఫీజుల బాదుడు భారీగానే ఉంటుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. డిజిటల్ బోధన, టెక్నో పాఠశాల, ఐఐటీ ఫౌండేషన పేరిట కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ లేకుండాపోయింది. అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. చూసీచూడనట్లు వ్యవహరించడంతో ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఫీజులు మాత్రమే కాదు కొన్ని పాఠశాల్లోనే యూనిఫాంలు, టై, బెల్టు లు, పుస్తకాలను కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా మారుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఫీజులు భారంగా మారాయి. లాభార్జనే ధ్యేయంగా కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజుల పెంపుదలను కొనసాగిస్తున్నాయి. పాఠశాల ఫీజులతో పాటు ల్యాబ్, లైబ్రరీ, స్పోర్ట్స్, ట్యూషన ఫీజుల కింద అందిన కాడికి దండుకుంటున్నాయి. ఫీజుల నియంత్రణను నిరంతరం పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలొస్తున్నాయి.
అమలుకు కాని ప్రతిపాదనలు
ఫీజుల నియంత్రణపై అధికారుల నిర్లక్ష్యంతో ప్రైవేట్ పాఠశాలల ఆగడాలకు అంతేలేకుండాపోయింది. 2017లో ప్రొఫెసర్ తిరుపతిరావు నేతత్వృంలో ఒక కమిటీని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఆ కమిటీ 2018లో నివేదిక అందజేస్తూ ప్రతి ఏడాది 10 శాతం ఫీజులను పెంచుకోవచ్చని ప్రతిపాదనలు చేసింది. నేటి వరకు ఆ కమిటీ సిఫారసులను ప్రభుత్వం అమలుచేయడంలేదు. 2020 ఏప్రిల్ ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వు నెంబర్ 46ను జారీ చేసింది. జీవో నెంబర్ 1 ప్రకారం ట్యూషన ఫీజులను నియంత్రించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర్వుల అమలుకు విద్యాశాఖ అధికారులు మీనమేషాలు లెక్కబెడుతున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి మొదలుకొని మండల విద్యాశాఖ అధికారుల వరకు ఒక్కరూ కూడా ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేయడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు వస్తే చూద్దామనే ధోరణిలో అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కొందరు ఎంఈవోలు ప్రైవేట్ యాజమాన్యాలతో కుమ్మకై చూసీచూడ నట్లు వ్యవహరిస్తూ దండుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం అడ్మిషన ఫీజు వసూలు చేయకూడదని అయినా జిల్లాలో అన్ని ప్రైవేట్ పాఠశాలలు అడ్మిషన ఫీజులు వసూలు చేస్తున్నాయి.
ఎల్‌కేజీకి రూ.45 వేలు
జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వేసవి సెలవులు ముగిసి ఈ నెల 15 నుంచి ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించింది. జిల్లా కేంద్రంతో పాటు కోదాడ, హూజూర్‌నగర్, తుంగతుర్తి పట్టణాలల్లో ప్రైవేట్ పాఠశాలల్లో ఎల్‌కేజీ నుంచి ఫీజుల మోత మోగిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో ఎల్‌కేజీ విద్యార్థికి ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, టై, బెల్ట్‌లు కలుపుకొని రూ.45వేల నుంచి రూ.50వేల వరకు కార్పొరేట్ పాఠశాలలు వసూలు చేస్తున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.80వేల వరకు ఫీజులు వసూలు చేయిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాల్లోని ఫీజులు మధ్యతరగతి వారికి భారంగా మారాయి. సర్కారు బడుల్లో పిల్లలను చేర్పించాలని ప్రచారం చేస్తున్నా విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలల తనిఖీకి విముఖత చూపడంలేదనే ఆరోపణలొస్తున్నాయి. బస్‌చార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారు.
తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం
ఎవరైనా అధికఫీజులు వసూలు చేస్తే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు ప్రైవేట్ స్కూళ్లలో తనిఖీలు చేస్తున్నాం. విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ఎవరైనా అధిక ఫీజులు వసూలు చే సినట్లయితే మా దృష్టికి తీసుకొస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
అశోక్, జిల్లా విద్యాశాఖ అధికారిృ