ప్రాదేశిక ఎన్నికలకు కసరత్తు
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:58 PM
పరిషత్ ఎన్నికలకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ప్రాదేశిక నియోజకవర్గాల్లో 2025 జూలై 10వ తేదీ తర్వాత నమోదైన ఓటర్లతో కొత్త జాబితాలను సిద్ధం చేస్తున్నారు.
కొత్త ఓటర్లతో జాబితా
ప్రాదేశిక నియోజకవర్గాల మ్యాపింగ్
జిల్లాలో ప్రాదేశిక ఓటర్ల జాబితాలో 4,730 కొత్త ఓటర్లు
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): పరిషత్ ఎన్నికలకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ప్రాదేశిక నియోజకవర్గాల్లో 2025 జూలై 10వ తేదీ తర్వాత నమోదైన ఓటర్లతో కొత్త జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ప్రాదేశిక నియోజకవర్గాల సరిహద్దులు, ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా మ్యాపింగ్ ప్రక్రియను జిల్లా పరిషత్, జిల్లా పంచాయతీ అధికారులు చేపట్టారు.
జిల్లాలోని 17 మండలాల్లో, మండలానికి ఒక ప్రాదేశిక నియోజకవర్గం, ఆయా మండలాల్లోని గ్రామీణ ఓటర్ల సంఖ్య ఆధారంగా మండల ప్రాదేశిక నియోజకవర్గాల విభజన మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. చిన్న పంచాయతీలు రెండు నుంచి మూడింటిని కలిపి ఒక మండల ప్రాదేశిక నియోజకవర్గం కానుండగా, పెద్దపంచాయతీల్లో గ్రామానికి ఒకటి, లేదా అంతకంటే ఎక్కువగా ఎంపీటీసీ స్థానాల మ్యాపింగ్ చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 178 మండల ప్రాదేశిక నియోజకవర్గాల మ్యాపింగ్ చేసి, ప్రభుత్వ నిర్ణయం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలకు అధికారులు సంసిద్ధం చేస్తున్నారు.
కొత్త ఓటర్లు 4,730 మంది
జిల్లా, మండల ప్రాదేశిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధతలో భాగంగా అధికార యంత్రాంగం కొత్త ఓటర్లను గుర్తించి, జాబితాలను సిద్ధం చేస్తోంది. అధికారులు చేపట్టిన ఓటరు జాబితా ప్రకారం జిల్లాలోని 17 మండలాల్లో పంచాయతీ ఎన్నికల తర్వాత కొత్తగా నమోదైన గ్రామీణ ఓటర్లు 4,730 మందిగా గుర్తించారు. ఈ కొత్త ఓటర్లతో కలిపి, ప్రాదేశిక నియోజకవర్గ మ్యాపింగ్ ప్రక్రియ ప్రకారం జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో జిల్లాలో 5,32,240 మంది గ్రామీణ ఓటర్లు ఉండగా, కొత్త ఓటర్లతో కలిపి 5,36,970కి పెరగనున్నారు. వీరిలో పాత ఓటర్లు జాబితా ప్రకారం పురుషులు 2,64,577 మంది ఉండగా, కొత్తగా 2,214 మంది పెరిగారు. కొత్త జాబితా ప్రకారం మొత్తం పురుష ఓటర్లు 2,66,791 మంది ఉన్నారు. పాత జాబితా ప్రకారం మహిళలు 2,67,661 మంది ఉండగా, కొత్త జాబితా ప్రకారం 2,70,176 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 2,515 మంది పెరిగారు. పాత ఓటరు జాబితా ప్రకారం ఇతరులు ఇద్దరు మాత్రమే ఉండగా, కొత్త ఓటరు నమోదుతో ఒకరు పెరిగి, ఆ సంఖ్య మూడుకు చేరింది. మొత్తంగా కొత్త ఓటర్లు 4,730మంది ఉన్నారు. జిల్లాలో ప్రస్తుతం కొత్త ఓటర్ల సంఖ్య మొత్తం 5,36,970గా లేక్క తేల్చిన అధికారులు జాబితాను ఆమోదించారు. ఈ ఓటరు జాబితా ప్రకారమే జిల్లా, మండల ప్రాదేశికాలకు మ్యాపింగ్ జరిగి ఎన్నికలు నిర్వహించనున్నారు.
జిల్లాలో 17 జడ్పీటీసీ, 178 ఎంపీటీసీ స్థానాలు
జిల్లా, మండల పరిషత్ పాలకవర్గాలు కొలువుదీరడానికి జిల్లాలో 17 మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలు, 17 మండలాల పరిధిలో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా 178 ఎంపీటీసీ స్థానాలను అధికారులు గుర్తించారు. జిల్లాలో అతి ఎక్కువ గ్రామీణ ఓటర్లు ఉన్న వలిగొండ మండలంలో 17 మండల ప్రాదేశిక నియోజకవర్గాలు, అతి తక్కువ గ్రామీణ ఓటర్లు ఉన్న మోత్కూరు మండలంలో కేవలం 5 మండల ప్రాదేశిక నియోజకర్గాలు ఉన్నాయి. వలిగొండ మండలంలో సవరించిన ఓటరు జాబితా ప్రకారం 53,167 మంది ఓటర్లు ఉండగా, మోత్కూరు మండలంలో కేవలం 13,345 మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు ముగిసినందున ఇక గ్రామీణ ఓటర్లతో సంబంధం ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. రిజర్వేషన్ల వివాదం కారణంగా నోటిఫికేషన్ జారీ తర్వాత వాయిదా పడిన ఎన్నికలను తిరిగి మళ్లీ నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కేంద్రం నుంచి స్థానిక ప్రభుత్వాలకు రావల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు పాలకవర్గాల ఎన్నికలు చట్టప్రకారం తప్పనిసరి కావడంతో ప్రభుత్వం జడ్పీ, మండల పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించడం అనివార్యంగా మారింది. అయితే ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్), జనగణన-2027లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎన్యుమరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాతనే జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు అధికారిక కార్యక్రమాల గడువు ముగిసిన తర్వాత జూన్ చివరి వారం లేదా, జూలై మొదటి వారంలోనే ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తం కానుందని భావిస్తున్నారు.
జిల్లా, మండల ప్రాదేశిక ఓటర్ల వివరాలు
మండలం ఎంపీ పాత కొత్త మొత్తం
టీసీలు ఓటర్లు ఓటర్లు
అడ్డగూడూరు 7 23,022 264 23,286
మోత్కూరు 5 13,215 220 13,435
ఆలేరు 7 21,537 370 21,907
ఆత్మకూర్(ఎం) 8 25,533 558 26,091
బొమ్మల రామారం 11 29,503 222 29,725
గుండాల 9 26,069 164 26,233
మోటకొండూరు 7 21,103 231 21,334
రాజాపేట 11 30,236 051 30,287
తుర్కపల్లి 10 27,977 306 28,283
యాదగిరిగుట్ట 9 27,615 303 27,918
పోచంపల్లి 10 27,497 225 27,722
భువనగిరి 13 39,654 299 39,953
బీబీనగర్ 14 42,876 349 43,225
వలిగొండ 17 52,431 736 53,167
చౌటుప్పల్ 12 38,501 100 38,601
నారాయణపూర్ 13 40,113 - 40,133
రామన్నపేట 15 45,358 332 45,690
మొత్తం 178 5,32,240 4730 5,36,970